ఈ విషయం తెలిశాక కూడా ‘ ఛీ.. ఇదేం కుక్క బతుకు’ అనగలరా..!

ABN , First Publish Date - 2020-11-15T14:03:12+05:30 IST

సాధారణంగా ఏ దేశంలోనైనా దివంగతులైన ప్రముఖుల విగ్రహాలు, ఆ దేశానికి ఎనలేని సేవ చేసిన వారి విగ్రహాలు ప్రస్తుత పాలకులు ఆవిష్కరిస్తుంటారు. కానీ.. తుర్క్‌మెనిస్థాన్ దేశాధ్యక్షుడు...

ఈ విషయం తెలిశాక కూడా ‘ ఛీ.. ఇదేం కుక్క బతుకు’ అనగలరా..!

సాధారణంగా ఏ దేశంలోనైనా దివంగతులైన ప్రముఖుల విగ్రహాలు, ఆ దేశానికి ఎనలేని సేవ చేసిన వారి విగ్రహాలను ప్రస్తుత పాలకులు ఆవిష్కరిస్తుంటారు. కానీ.. తుర్క్‌మెనిస్థాన్ దేశాధ్యక్షుడు ఇందుకు పూర్తి భిన్నం. తుర్క్‌మెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బన్‌గులి బెర్డీముఖమెదోవ్ ఓ శునక విగ్రహాన్ని ఆ దేశ రాజధాని అష్కబట్‌లో‌ ఏర్పాటు చేయించి.. మరీ ఆవిష్కరించారు. ఆ విగ్రహం కూడా బంగారంతో తయారు చేయించింది కావడం విశేషం. తుర్క్‌మెనిస్థాన్ అధ్యక్షుడికి మధ్య ఆసియా షెపర్డ్ శునకాలంటే ఎంతో ఇష్టం. ఈ జాతి శునకాలను అలబాయ్ శునకాలుగా పిలుస్తారు. తుర్క్‌మెనిస్థాన్ అధ్యక్షుడు మీడియా ముందుకు వచ్చిన చాలా సందర్భాల్లో ఆ జాతి శునకాన్ని కూడా వెంట తెచ్చుకునేవారు. శునకంతో పాటు మీడియా ముందుకు రావడంపై ఆయన స్పందిస్తూ.. కలల్లో గుర్రాలను చూడటం, నిజ జీవితంలో అలబాయ్ శునకం వెంట ఉండటం ఆనందం అని ఆయన చెప్పారు.


అంతేకాదు, అలబాయ్ జాతి శునకాలను దేశ వారసత్వ సంపదగా ప్రకటించారు. ఏదేమైనా.. శునకాల పట్ల గుర్బన్‌గులి చూపిస్తున్న ఆప్యాయతపై జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం.. ఆ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఇలా ఓ అరుదైన నిర్ణయంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడం గుర్బన్‌గులికి కొత్తేమీ కాదు. 2015లో తన విగ్రహాన్ని తానే చేయించుకుని.. ఆవిష్కరించి ప్రపంచ దేశాలు అవాక్కయ్యేలా చేశారు. బంగారపు గుర్రంపై కూర్చుని స్వారీ చేస్తున్నట్లుగా ఉన్న గుర్బన్‌గులి బంగారపు విగ్రహం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సందర్భంలో పలు దేశాలు ఇదేం పిచ్చి పని అని ఆయన చర్యను తప్పుబట్టాయి.



Updated Date - 2020-11-15T14:03:12+05:30 IST