స్నేహమంటే ఇదేరా...! ఆనంద్ మహీంద్రానే అబ్బురపరిచిన తాబేళ్లు..!

ABN , First Publish Date - 2022-04-08T21:57:12+05:30 IST

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ.. స్నేహం గొప్పతనాన్ని వివరించారు.

స్నేహమంటే ఇదేరా...! ఆనంద్ మహీంద్రానే అబ్బురపరిచిన తాబేళ్లు..!

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో సుఖసంతోషాలు, లాభనష్టాలు సహజమే. రాత్రిపగలూ లాగా అవి జీవితంలో వచ్చిపోతుంటాయి. కానీ.. సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఒక్కోసారి రేపనేది చూస్తామా అనే సందేహం కూడా కలుగుతుంది. అయితే..కష్టాలు ఆవరించినప్పుడు పక్కన ఓ ఫ్రెండ్ ఉంటే ఆ దిలాసానే వేరు!  స్నేహితులు ఉన్నవాళ్లకు అసలు ఒంటరి తనమనేదే తెలియదు. కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు ఫ్రెండ్స్ మాటల్తో ఊరడిస్తే.. మరికొందరు ఏదో రకంగా సాయం చేసి సమస్యల నుంచి గట్టెక్కిస్తారు. ఇక.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా ట్విటర్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. స్నేహం గొప్పతనాన్ని వివరించారు. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు మనల్ని ఆదుకుని, మళ్లీ కోలుకునేలా చేసే స్నేహితుడు ఉండటమే జీవితంలో అది పెద్ద బహుమతి అంటూ ఆయన చెప్పిన మాటలు నెటిజన్లను అకట్టుకుంటున్నాయి. ఆయన షేర్ చేసిన వీడియో నెటిజన్లను అంతకంటే ఎక్కువగా ఆశ్చర్యపోయేలా చేస్తోంది. 


ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. ఓ తాబేలు  వెల్లకిలా పడిపోతుంది. మామూలు జంతువులు ఇలా పడితే మళ్లీ లేవగలవు కానీ తాబేళ్ల విషయం అలా కాదు. మళ్లీ యథాస్థతికి రావడం వాటికి దాదాపు అసాధ్యం. 99 శాతం సందర్భాల్లో అవి చివరికి ఇతర జంతువులకు ఆహారమైపోతాయి కూడా!  పరిస్థితి ఇలా ఒక్కసారిగా తలకిందులైపోయి.. నిస్సహాయస్థితిలో కూరుకుపోవడాన్ని  ఇంగ్లిష్‌లో ‘టర్నింగ్ టర్టిల్’ అని అంటారు. టర్టిల్ అంటే తాబేలు.. టర్నింగ్ అంటే తిరగబడటం!


అయితే.. అవస్థలు పడుతున్న తాబేలును మరో తాబేలు గమనించి సాయం చేసేందుకు వెంటనే ముందుకు వస్తుంది.  ఆ తాబేలును ఓపక్కకు తోసి మళ్లీ దాని కాళ్లపై నిలబడ గలిగేలా చేస్తుంది. ఇదంతా చూసి అబ్బురపడ్డ ఆనంద్ మహీంద్రా..  ‘టర్నింగ్ టర్టిల్‌’ వాక్యానికి అర్థం మారిపోయినట్టు ఉందని వ్యాఖ్యానించారు. ఇకపై.. అవసరంలో ఉన్న స్నేహితుడికి సాయం చేయడాన్నే ‘టర్నింగ్ టర్టిల్’ అనాలంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన అనేక మంది తమ ప్రాణస్నేహితులను, స్నేహం విలువను గుర్తు చేసుకుంటున్నారు. మరీ ఈ వైరల్ వీడియోపై మీరు ఓ లుక్కేస్తే పోలా.. ! 

Updated Date - 2022-04-08T21:57:12+05:30 IST