పన్నెండేళ్ల ప్రయాస

ABN , First Publish Date - 2022-06-23T05:28:25+05:30 IST

తుంగభద్రకు 2009లో భారీ వరదలు వచ్చాయి. నాగులదిన్నె వద్ద వంతెన కొట్టుకపోయింది.

పన్నెండేళ్ల ప్రయాస
అసంపూర్తిగా ఉన్న నాగలదిన్నె వంతెన

  1. నాగులదిన్నె వంతెన కోసం నిరీక్షణ  . 
  2. ఇబ్బందుల్లో ఇరు రాష్ర్టాల ప్రజలు 
  3. పటించుకోని ప్రభుత్వాలు..  

ఎమ్మిగనూరు, జూన 22:  తుంగభద్రకు 2009లో భారీ వరదలు వచ్చాయి. నాగులదిన్నె వద్ద వంతెన కొట్టుకపోయింది. అప్పటి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు, కర్నూలు జిల్లాకు మధ్య రాకపోకలు ఆగిపోయాయి. అయితే ఆ రెండు ప్రాంతాల ప్రజల మధ్య బంధుత్వాలు  ఉన్నాయి. అటూ ఇటూ ప్రయాణానికి చుట్టూ తిరిగిపోవాలి. లేదా బోట్లలో, తెప్పల్లో వెళ్లాలి. ఈ పరిస్థితి పన్నెండేళ్లుగా కొనసాగుతోంది. ఇంతకూ ఈ వంతెన నిర్మాస్తారా? లేదా? అనే సందేహంలో ప్రజలు ఉన్నారు. 

తుంగభద్రనదికి వరదలొచ్చి నాగులదిన్నె వంతెన కొట్టుకపోయాక 2014లో బ్రిడ్జి నిర్మాణపనులు ప్రారంభించారు. అప్పటి నుంచి పనులు సాగుతూనే ఉన్నాయి. బ్రిడ్జి లేకపోవడంతో  ఇరు ప్రాంతాల ప్రజలు  ప్రమాదం అంచున రోజూ నదిని దాటుతున్నారు. నదికి తెలంగాణవైపు ఏర్పాటు చేసిన ఇనుప మెట్లను ఎక్కీ దిగీ రాకపోకలు సాగిస్తున్నారు. 

  నాడు.. నేడు నిర్లక్ష్యమే: 

తుంగభద్ర నదికి తరచూ వరదలు సంభవిస్తుండడంతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నాగులదిన్నె దగ్గర నదిపై నవంబరు 18, 1992లో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనికి దాదాపు రూ.6 కోట్ల  నిధులు మంజూరు చేశారు. ఆ తర్వాత మళ్లీ పట్టించుకోలేదు. దీంతో  బ్రిడ్జి నిర్మాణానికి దాదాపు పదేళ్లు పట్టింది. 2003లో పనులు పూర్తయ్యాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, బీవీ మోహనరెడ్డి బ్రిడ్జిని ప్రారంభించారు. అయితే 2009లో తుంగభద్ర నదికి సంభవించిన భారీ వరదలకు ఈ  వంతెన కొట్టుకుపోయింది. అప్పటి నుంచి నేటి వరకు వంతెన లేక రెండు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది  పడుతున్నారు.   2011లో అప్పటి ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు రూ.49 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం రూ.42 కోట్లతో నిర్మాణ పనులకు గ్రీన సిగ్నల్‌ ఇచ్చింది.  

 ఎనిమిదేళ్లుగా..  

  నాగలదిన్నె  బ్రిడ్జి నిర్మాణ పనులకు  2013లో టెండర్లకు పిలిచారు.  హైదరాబాద్‌కు చెందిన సిండికేట్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ రూ.42 కోట్లకు టెండర్‌ను దక్కించుకుంది.   2014 మార్చిలో పనులు మొదలయ్యాయి.  ఈ ఎనిమిదేళ్లలో  తెలంగాణవైపు  భూసమస్య ఉన్నందు వల్ల పనులు ముందుకు సాగలేదు. నిధుల  విడుదలలో కూడా జాప్యం జరిగింది. దీంతో  కాంట్రాక్టర్‌ పనులు మరింత ఆలస్యం చేశాడు. ఎట్టకేలకు తెలంగాణ వైపు రెండు గోడలు, మట్టిపనులు చేయాల్సి ఉంది. అలాగే బ్రిడ్జి పైన కొన్ని మైనర్‌ పనులు మిగిలిపోయాయి.  గత రెండు మూడేళ్లుగా వర్షాలు  సరిగా రాకపోవడంతో నదిలో నీటి ప్రవాహం కూడా ఏడాదిలో కేవలం మూడు నెలలు మాత్రమే ఉంటోంది. అయినా  కాంట్రాక్టర్‌ ఏ మాత్రం పనులపై శ్రద్ధ చూపలేదనే విమర్శలు ఉన్నాయి. 

  గడువు పొడిగించినా.. 

 నాగులదిన్నె వంతెన   పనులు  2016 మార్చి కల్లా పూర్తి చేయవలసి ఉన్నది.  అయితే నిర్ణీత గడువులోపు బ్రిడ్జి పనులు పూర్తి కాలేదు. ఆ తర్వాత  2017, 2018, 2018లో పనులు పూర్తి కావాలని గడువును ప్రభుత్వం పొడిగించుకుంటూ వచ్చింది. అయినా పనులు పూర్తి కాలేదు.  దీంతో ఇరు రాషా్ట్రల ప్రజలు బ్రిడ్జీ నిర్మాణ పనులు  ఎప్పుడు పూర్తవుతాయని ఎదురు చూస్తున్నారు. 

  వంతెన లేకపోవడంతో.. 

గతంలో నాగులదిన్నె బ్రిడ్జి వీదుగా  వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించేవారు. బ్రిడ్జి కూలిపోయాక  మహబూబ్‌నగర్‌ జిల్లా ఐజాకు వెళ్లాలంటే కర్నూలు నుంచి లేదా మంత్రాలయం మీదుగా  రాయచూరు జిల్లా ఎరిగేరి దగ్గరి నుంచి వెళ్లాల్సి వస్తోంది.  దాదాపు 70కి.మీ దూరం ప్రయాణించాలి. అలాగే కర్ణాటకలోని బళ్లారి వైపు నుంచి హైదరాబాద్‌కు ఈ బ్రిడ్జి మీదుగా వెళ్తే దూరం తగ్గుతుంది. బ్రిడ్జీ లేకపోవటంతో వాహనదారులు అటు రాయచూరు లేదా కర్నూలు మీదుగా వెళ్తున్నారు.   దాదాపు 40కిమీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది.  

ఫ నిలిచిపోయిన పంట ఉత్పత్తుల రవాణా : 

ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డుకు   ఐజ, పులికల్‌ బైనుపల్లి, రాజాపురం, మేడికుంద, కొత్తపల్లి, సింధనూరు, పర్దిపురం, సంగాలం, బింగిదొడ్డి, ఈడుగోనిపల్లి వంటి గ్రామాల నుంచి అత్యధికంగా పంట ఉత్పత్తులను తీసుకొచ్చి  అమ్ముతారు.  ఈ బ్రిడ్జి కూలినప్పటి నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పంట ఉత్పత్తులను తీసుకురావడం లేదు. దీంతో ఎమ్మిగనూరు మార్కెట్‌యార్డుకు వచ్చే ఆదాయం పన్నేండేళ్లుగా రావటం లేదు. 

 ఇనుప మెట్లు ఎక్కలేక.. దిగలేకః 

బ్రిడ్జి  నిర్మాణ పనులు పూర్తికాకపోవటంతో రాకపోకలకు  తెలంగాణ వైపు బ్రిడ్జికి ఇనుపమెట్లు ఏర్పాటు చేశారు. ఇవి దాదాపు 60నుంచి 70వరకు ఉంటాయి.  చాలా చిన్నగా ఉన్నందు వల్ల పిల్లలు, వృద్ధులు ఎక్కి దిగడం చాలా ఇబ్బందిగా ఉంది.  

 బ్రిడ్జి లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం: తిరుపతమ్మ, తెలంగాణ

బ్రిడ్జి కూలిపోయినప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం.  నాబోటి ముసలివారు ఈ ఇనుప మెట్లు ఎక్కిదిగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి ఎప్పుడు పూర్తవుతుందో..ఏమో.   

  బ్రిడ్జి పూర్తిచేయాలిః ఉసేనమ్మ, నేలసోంపురం, తెలంగాణ 

బ్రిడ్జి పనులు తొందరగా పూర్తిచేయాలి. బ్రిడ్జి లేకపోవటంతో తల్లిపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కిదిగాలంటే కష్టాంగా ఉంది. పనులు పూర్తిచేసి రోడ్డు వేసి బస్సు నడపాలి. 

ఫకాంట్రాక్టర్‌, అధికారుల నిర్లక్ష్యమేః  ముగతి ఈరన్న గౌడ్‌, మాజీ జడ్పీటీసీ, నందవరం మండలం 

బ్రిడ్జి పడిపోయి 11ఏళ్లయింది.  మూడేళ్లు నేనే సొంత డబ్బుతో గరుసు రోడ్డు వేయించాను. ఇప్పుడు కూడా  గ్రావెల్‌ ఏర్పాటు చేశారు. పనులు ఆలస్యం కావటానికి కాంట్రాక్టర్‌, అధికారుల నిర్లక్ష్యమే కారణం. వర్షం వస్తే పనులు మరో  ఏడాది ఆలస్యం అవుతాయి. ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు చొరవ చూపాలి. 

  పనులు శరవేగంగా జరుగుతున్నాయిః వెంకటేశ్వర్లు, డీఈఈ, నాగలదిన్నె బ్రిడ్జి

నాగలదిన్నె  వంతెన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాంయి. పనులు ఎక్కడ ఆగటం లేదు, అన్ని పనులు జరుగుతున్నాయి. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే వీలైనంత త్వరగా పూర్తిచేస్తాం. 





Updated Date - 2022-06-23T05:28:25+05:30 IST