రానున్న ఆరు నెలల్లో... 20 వేల కొలువులు : హెచ్‌సీఎల్

ABN , First Publish Date - 2021-01-17T21:23:59+05:30 IST

శీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. కిందటి సంవత్సరం కరోనా కారణంగా నియామకాలను అంతంతమాత్రంగా మాత్రమే చేపట్టిన సంస్థ... వచ్చే ఆరు నెలల్లో ఏకంగా 20 వేల మంది సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

రానున్న ఆరు నెలల్లో... 20 వేల కొలువులు : హెచ్‌సీఎల్

న్యూఢిల్లీ : దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. కిందటి సంవత్సరం కరోనా కారణంగా నియామకాలను అంతంతమాత్రంగా  మాత్రమే చేపట్టిన సంస్థ... వచ్చే ఆరు నెలల్లో ఏకంగా 20 వేల మంది సిబ్బందిని రిక్రూట్‌ చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. డిజిటల్‌ సేవలకు దేశీయంగా, అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌తోపాటు అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకున్న నేపధ్యంలో... వచ్చే ఆరు నెలల్లో 20 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు కంపెనీ సీఈవో విజయ కుమార్‌ వెల్లడించారు. నోయిడా కేంద్రస్థానంగా ఐటీ సేవలందిస్తున్న హెచ్‌సీఎల్‌... గతేడాది 10 బిలియన్‌ డాలర్ల మైలురాయికి చేరుకున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం సంస్థలో 1.59 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గత త్రైమాసికంలో మొత్తంగా 12,422 మంది సిబ్బందిని రిక్రూట్‌ చేసుకుంది. 


డిమాండ్‌ దృష్ట్యా ఫ్రెషర్లు, నైపుణ్యం కలిగిన మరో 20 వేల మందిని రిక్రూట్‌ చేసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇక వీసాలకు సంబంధించిన సమస్యలపై ఆయన స్పందిస్తూ... అమెరికాలో విధులు నిర్వహిస్తున్నవారిలో 70 % మంది అక్కడి స్థానికులేనని చెప్పారు. 


మూడవ త్రైమాసికంలో 31 శాతం పెరిగిన లాభం...

ఆర్థిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలకుమించి హెచ్‌సీఎల్‌ రాణించింది. డిసెంబరుతో ముగిసిన మూడు నెలల్లో సంస్థ రూ. 3,982 కోట్ల లాభాన్ని సాధించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ. 3,037 కోట్లతో పోలిస్తే ఈసారి లాభంలో 31.1 శాతం ఎక్కువ. డిజిటల్‌ సేవలకు డిమాండ్‌ నెలకొనడం సంస్థకు ఊతమిచ్చింది. 

Updated Date - 2021-01-17T21:23:59+05:30 IST