Twitter : మస్క్ ఝలక్‌, విమర్శకుల ప్రశ్నలు... ట్విటర్ సీఈఓ పరాగ్ ఘాటు సమాధానం...

ABN , First Publish Date - 2022-05-14T19:59:37+05:30 IST

ట్విటర్ టేకోవర్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఎలన్ మస్క్

Twitter : మస్క్ ఝలక్‌, విమర్శకుల ప్రశ్నలు... ట్విటర్ సీఈఓ పరాగ్ ఘాటు సమాధానం...

శాన్‌ఫ్రాన్సిస్కో : ట్విటర్ టేకోవర్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించిన నేపథ్యంలో, ఈ టెక్ జెయింట్ లీడర్‌షిప్ టీమ్, ఆపరేషన్స్‌లో మార్పులను ప్రకటించడంపై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుండటంతో ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ దీటుగా సమాధానం చెప్పారు. కేవలం బండిని ఏదో అలా నడిపించడం కోసం ఎవరూ పని చేయరని స్పష్టం చేశారు.


44 బిలియన్ డాలర్ల ట్విటర్‌ టేకోవర్ డీల్‌ను టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ కంపెనీ యాజమాన్యం మారుతుండటంతో కొందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారని, పునర్నిర్మాణం జరుగుతుందని వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఈ కంపెనీ లీడర్‌షిప్ టీమ్, ఆపరేషన్స్‌లో కొన్ని మార్పులను ట్విటర్ సీఈఓ  పరాగ్ అగర్వాల్ (Twitter CEO Parag Agrawal) ప్రకటించారు. దీంతో కొందరు ప్రశ్నలు లేవనెత్తారు. అంతగా విజయవంతం కాని (lame-duck) సీఈఓ మార్పులు చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 


ఈ నేపథ్యంలో పరాగ్ అగర్వాల్ స్పందిస్తూ, వరుస ట్వీట్లలో దీటైన సమాధానాలు ఇచ్చారు. గడచిన కొద్ది వారాల్లో చాలా జరిగిందని చెప్పారు. ఈ సమయంలో తాను తన దృష్టిని పూర్తిగా కంపెనీపైనే పెట్టానని, బహిరంగంగా పెద్దగా ఏమీ మాట్లాడలేదని, కానీ ఇప్పుడు మాట్లాడతానని తెలిపారు. ట్విటర్ టేకోవర్ గురించి గత నెలలో వార్తలు రావడంతో ఏర్పడిన అయోమయ స్థితిలో మార్పులు చేసినందుకు తనను “lame-duck” CEO అని పిలిచినప్పటికీ, తాను జవాబుదారీతనం వహిస్తానని చెప్పారు. 


‘‘నిన్న (మే 13న) మేము మా లీడర్‌షిప్ టీమ్, ఆపరేషన్స్‌కు మార్పులను ప్రకటించాం. వ్యక్తులపై ప్రభావం చూపే మార్పులు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. అయితే అక్వైర్ అవుతున్నపుడు lame-duck CEO  ఎందుకు ఈ మార్పులు చేస్తున్నారని కొందరు అడుగుతున్నారు’’ అని పరాగ్ అగర్వాల్ పేర్కొన్నారు. 


ఈ ప్రశ్నకు తాను ఇచ్చే చిన్న సమాధానం చాలా తేలికైనదని పేర్కొన్నారు. ట్విటర్ డీల్ పూర్తవుతుందని తాను భావిస్తున్నప్పటికీ, అన్ని రకాల పరిస్థితులకు తగినట్లుగా సంసిద్ధంగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. ట్విటర్‌కు ఏది సరైనదైతే దానిని చేయడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలన్నారు.  ట్విటర్‌కు నాయకత్వం వహించడానికి, నిర్వహించడానికి తాను జవాబుదారీనని తెలిపారు. ట్విటర్‌ను ఏ రోజుకు ఆ రోజు మరింత పటిష్టంగా తీర్చిదిద్దడం తమ కర్తవ్యమని చెప్పారు. కేవలం బండిని ఏదో అలా  నడిపించడం కోసం ట్విటర్‌లో ఎవరూ పని చేయడం లేదన్నారు. కంపెనీ భావి యాజమాన్యం ఎవరైనప్పటికీ, పని చేయడం గర్వకారణంగా తాము భావిస్తామని తెలిపారు. 


కస్టమర్స్, భాగస్వాములు, వాటాదారులు, తదితరుల కోసం ఓ ప్రొడక్ట్, బిజినెస్‌గా ట్విటర్‌ను తాము అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా సవాళ్ళను ఎదుర్కొంటున్న మేక్రో ఎన్విరాన్‌మెంట్ అని తెలిపారు. కంపెనీ శ్రేయస్సు కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా తప్పించుకోవడానికి ఈ డీల్‌ను ఓ సాకుగా తాను ఉపయోగించుకోబోనని స్పష్టం చేశారు. ట్విటర్‌లో ఉన్న ఏ లీడర్ అయినా సరే దీనిని ఓ సాకుగా తీసుకుని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా తప్పించుకోబోరన్నారు. 


అగర్వాల్ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే...

ట్విటర్ రీసెర్చ్, డిజైన్, ఇంజినీరింగ్ వ్యవహారాలకు బాధ్యుడైన జనరల్ మేనేజర్ కేవోన్ బేక్‌పోర్‌ను, ప్రొడక్ట్స్ హెడ్ బ్రూస్ ఫాల్క్‌ను పరాగ్ అగర్వాల్ తొలగించారు. బిజినెస్‌కు చాలా ముఖ్యమైన పదవులకు మాత్రమే నియామకాలు జరపాలని ట్విటర్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అవసరమైన కఠిన నిర్ణయాలను తాను కొనసాగిస్తానని అగర్వాల్ చెప్తున్నారు. మంచి కోసం మరిన్ని మార్పులను ఊహించవచ్చునని అంటున్నారు. 


మస్క్ ఏం చెప్పారంటే...

ఎలన్ మస్క్ ట్విటర్ అక్విజిషన్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ట్విటర్ అంతకుముందు చెప్పినట్లుగా ఈ వేదికపై ఉన్న యూజర్ అకౌంట్లలో కేవలం 5 శాతం మాత్రమే నకిలీ అకౌంట్లు ఉన్నాయని రుజువయ్యేందుకు వరకు ఈ డీల్‌ను నిలిపేస్తున్నట్లు తెలిపారు. ఈ అక్విజిషన్‌కు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. 


Read more