Twitter Deal తాత్కాలికంగా నిలుపుదల: Elon Musk

ABN , First Publish Date - 2022-05-13T21:29:34+05:30 IST

టెక్సాస్ : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. 44 బిలియన్ డాలర్ల విలువైన ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

Twitter Deal తాత్కాలికంగా నిలుపుదల: Elon Musk

టెక్సాస్ : ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అనూహ్యమైన ప్రకటన చేశారు. 44 బిలియన్ డాలర్ల(రూ.3.3 లక్షల కోట్లు పైమాటే) విలువైన ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు వెల్లడించారు. స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు పెండింగ్‌లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ట్విటర్ యూజర్లలో 5 శాతం కంటే తక్కువగా ఉన్న స్పామ్ లేదా ఫేక్ అకౌంట్లకు సంబంధించిన లెక్కలు అందాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రకటనపై ట్విటర్ ఇంతవరకూ స్పందించలేదు. ఎలాన్ మస్క్ చేసిన ఈ ప్రకటనతో ట్విటర్ షేర్లు శుక్రవారం ఆరంభ ట్రేడింగ్‌లో ఏకంగా 20 శాతం మేర భారీగా పతనమయ్యాయి.


కాగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో డైలీ యాక్టివ్ యూజర్లలో 5 శాతం వరకు స్పామ్ లేదా నకిలీ వినియోగదారులు ఉండొచ్చని ఈ నెల ఆరంభంలో ట్విటర్ ఒక అంచనా వేసింది. ఎలాన్ మస్క్‌తో ఒప్పందం ముగిసే వరకు తమకు పలు ముప్పులు పొంచివున్నాయని వివరించింది. ప్రకటనదారులు తమతోనే కొనసాగుతారా లేదా తెలియడం లేదని వివరించింది. మరోవైపు స్పామ్ లేదా నకిలీ ఖాతాలను ట్విటర్ నుంచి తొలగించడం తన ప్రథమ ప్రాధాన్యత అని ఎలాన్ మస్క్ వివరించారు. 

Read more