ప్రభుత్వ ఆదేశాలపై కర్ణాటక హైకోర్టులో దావా వేసిన Twitter!

ABN , First Publish Date - 2022-07-05T23:47:42+05:30 IST

భారత ప్రభుత్వం (Indian government) కొన్ని ట్వీట్లను తొలగించాలని

ప్రభుత్వ ఆదేశాలపై కర్ణాటక హైకోర్టులో దావా వేసిన Twitter!

న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం (Indian government) కొన్ని ట్వీట్లను తొలగించాలని కోరుతూ ఇచ్చిన ఆదేశాలను  ట్విటర్ (Twitter) కర్ణాటక హైకోర్టులో సవాల్ చేసింది. అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నట్లు ఈ సామాజిక మాధ్యమ కంపెనీ ఆరోపించింది. కంటెంట్ రెగ్యులేషన్‌ విషయంలో భారత ప్రభుత్వంతో ఘర్షణ పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది. 


అభ్యంతరకరమైన కంటెంట్‌ను జూలై 4నాటికి తొలగించకపోతే క్రిమినల్ చర్యలు చేపడతామని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. దీనికి సంబందించిన నోటీసులను జూన్ 6, జూన్ 9, జూన్ 27 తేదీల్లో పంపించింది.  దీంతో భారత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై న్యాయ సమీక్ష కోరాలని అమెరికా కేంద్రంగా పని చేస్తున్న సామాజిక మాధ్యమ కంపెనీ ట్విటర్ నిర్ణయించింది. కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ ఇచ్చిన కొన్ని ఆదేశాలు భారత దేశంలో అమలవుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి అనుగుణంగా లేవని, అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేసినవారికి నోటీసులు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని  ఆరోపిస్తోంది. న్యాయ సమీక్ష కోరాలని ట్విటర్ నిర్ణయించినట్లు వచ్చిన వార్తలపై స్పందించాలని కోరినప్పటికీ ఐటీ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. 


ట్విటర్ సహా పెద్ద సామాజిక మాధ్యమ సంస్థలు తన ఆదేశాలను పాటించడం లేదని భారత ప్రభుత్వం గతంలో ఆరోపించింది. చట్టబద్ధమైన ఆదేశాలను జారీ చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని పేర్కొంది. 


దేశ భద్రత వంటి కారణాలను చూపుతూ కంటెంట్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచరాదని ఆదేశించే అధికారం ఐటీ చట్టం ప్రకారం ప్రభుత్వానికి ఉంది. ట్విటర్‌కు భారత దేశంలో 2 కోట్ల 40 లక్షల మంది యూజర్లు ఉన్నట్లు అంచనా. 85 Twitter Accounts, Tweetsను తొలగించాలని 2021లో ప్రభుత్వం ఈ కంపెనీని కోరింది.


Updated Date - 2022-07-05T23:47:42+05:30 IST