Himanta Vs Kejriwal : ఢిల్లీ, అస్సాం ముఖ్యమంత్రుల ట్వీట్ యుద్ధం

ABN , First Publish Date - 2022-08-28T19:03:30+05:30 IST

అస్సాం, ఢిల్లీ ముఖ్యమంత్రుల ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది

Himanta Vs Kejriwal : ఢిల్లీ, అస్సాం ముఖ్యమంత్రుల ట్వీట్ యుద్ధం

న్యూఢిల్లీ : అస్సాం, ఢిల్లీ ముఖ్యమంత్రుల ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి గురించి వీరు మూడు రోజుల నుంచి పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. అస్సాంలో కొన్ని పాఠశాలలను మూసేశారని వచ్చిన వార్తలపై స్పందిస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. 


అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో,  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ 2007లో ఇచ్చిన ఎన్నికల హామీని గుర్తు చేశారు. దేశ రాజధాని నగరం ఢిల్లీని లండన్, పారిస్ నగరాల మాదిరిగా మార్చుతానని వాగ్దానం చేశారు కదా? గుర్తు లేదా కేజ్రీవాల్ గారూ అని ప్రశ్నించారు. మీరు ఏమీ చేయలేకపోవడంతో ఇప్పుడు అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లోని చిన్న పట్టణాలతో ఢిల్లీని పోల్చడం ప్రారంభించారని ఆరోపించారు. ఢిల్లీ వంటి నగరం, వనరులు బీజేపీకి లభిస్తే ప్రపంచంలో అత్యంత  సంపన్న నగరంగా తీర్చిదిద్దుతుందన్నారు. తన మాటలను విశ్వసించాలని కోరారు. 


2017 మార్చిలో ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఢిల్లీని లండన్ నగరంలా తీర్చిదిద్దుతానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. తాను పరిశుభ్రత విషయంలో హామీ ఇచ్చానని తెలిపారు. 


హిమంత బిశ్వ శర్మ ట్వీట్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బదులిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు. మీ ప్రభుత్వ పాఠశాలను చూడటానికి నేను ఎప్పుడు రావాలి? పాఠశాల బాగులేకపోయినా పర్వాలేదు. మనం కలిసికట్టుగా పరిష్కరిద్దాం’’ అని తెలిపారు. 


అస్సాంలోని ప్రభుత్వ పాఠశాలలను మూసేసినట్లు వచ్చిన వార్తా కథనాలపై కేజ్రీవాల్ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, పాఠశాలలను మూసేయడం పరిష్కారం కాదని, దేశవ్యాప్తంగా మరిన్ని పాఠశాలలను తెరవాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిపై హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘కేజ్రీవాల్ గారూ! మీరు ఎప్పటిలాగానే హోం వర్క్ చేయకుండా, వాస్తవాలను తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేశారు. నేను అస్సాం విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 8,610 పాఠశాలలను ఏర్పాటు చేసింది’’ అని తెలిపారు. గడచిన ఏడేళ్ళలో ఢిల్లీలో ఎన్ని పాఠశాలలను ఏర్పాటు చేశారో చెప్పాలన్నారు. 


Updated Date - 2022-08-28T19:03:30+05:30 IST