Elon Musk పై Twitter దావా..

ABN , First Publish Date - 2022-07-13T15:53:28+05:30 IST

ఏకంగా 44 బిలియన్ డాలర్ల (రూ.3 లక్షల కోట్లు పైమాటే) విలువైన ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌పై ట్విటర్ కోర్టుకెక్కింది.

Elon Musk పై Twitter దావా..

టెక్సాస్ : ఏకంగా 44 బిలియన్ డాలర్ల (రూ.3 లక్షల కోట్లు పైమాటే) విలువైన ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా(Tesla) అధినేత ఎలాన్ మస్క్‌పై(Elon Musk) ట్విటర్(Twitter) కోర్టుకెక్కింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంటూ డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సెరీలో  దావా వేసింది. నీతినిజాయితీలేని చర్యలతో ట్విటర్‌కు పూడ్చలేని నష్టాన్ని తెచ్చిపెట్టారని మస్క్‌ని విమర్శించింది. ట్విటర్ షేర్లు అపార నష్టాన్ని చవిచూడడానికి మస్క్ చర్యలే కారణమని పిటిషన్‌లో తీవ్ర విమర్శలు చేసింది.  ట్విటర్ కొనుగోలు ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలను మస్క్ ఉల్లంఘించారని, ఒప్పందం కారణంగా స్టాక్ హోల్డర్లు దీర్ఘకాలం కొనసాగే అవకాశం కనిపించడంలేదని వాపోయింది. ‘‘ ట్విటర్‌ను కొనుగోలు చేస్తానని ప్రచారం చేశాడు. ఆ తర్వాత ప్రతిపాదించాడు. ఒప్పందంపై సంతకం చేశాడు. ఇప్పుడు ఒప్పందం నుంచి వైదొలిగారు. చట్టాలను మార్చేయవచ్చునని మస్క్ భావిస్తున్నారు. ట్విటర్‌ని తీవ్రంగా నష్టపరిచారు. కార్యకలాపాలు, స్టాక్ హోల్డర్ల వ్యాల్యూలను తీవ్రంగా దెబ్బతీశారు’’ అని దావాలో పేర్కొంది. ఈ మేరకు డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సెరీలో పిటిషన్ వేసింది. ఈ కోర్టు బిజినెస్ వివాదాలను పరిష్కరిస్తుంది. ఏప్రిల్‌లో ట్విటర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కోషేరు 54.20 డాలర్ల విలువతో కొనుగోలుకు అంగీకారం తెలిపారు. కానీ ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. ట్విటర్ యాక్టివ్ యూజర్లలో ఫేక్ లేదా స్పామ్ అకౌంట్లు 5 శాతం కంటే తక్కువగానే ఉన్నాయని నిర్ధిష్టమైన డేటా ఇవ్వాలని మస్క్ కోరారు. ట్విటర్ సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ట్విటర్ డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్టు గత శుక్రవారమే మస్క్ ప్రకటించారు. షేర్ల పతనం ద్వారా అపారమైన నష్టం వాటిల్లడంతో ఒప్పందాన్ని ఆచరణలో పెట్టాలని ట్విటర్ భావిస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే కోర్టులో దావా వేసింది.


అబ్బా నవ్వొస్తోంది..

ట్విటర్ తనపై దావా వేయడంపై ఎలాన్ మస్క్ స్పందించారు. ‘అబ్బా.. హస్యంగా ఉంది’ అంటూ చెమత్కరించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. డీల్ రద్దుపై దావా వేశారనే వార్తలు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే ఆయన ఈ మేరకు స్పందించారు. కాగా ట్విటర్- మస్క్ ఒప్పందం ప్రకారం డీల్ నుంచి వైదొలిగితే ఎలాన్ మస్క్ 1 బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు పేర్కొంటున్నాయి.

Updated Date - 2022-07-13T15:53:28+05:30 IST