Pulwamaలో ఎన్‌కౌంటర్...ఇద్దరు అల్‌బదర్ ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2022-04-28T13:02:52+05:30 IST

దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని మిత్రిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు...

Pulwamaలో ఎన్‌కౌంటర్...ఇద్దరు అల్‌బదర్ ఉగ్రవాదుల హతం

పుల్వామా(జమ్మూకశ్మీర్): దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని మిత్రిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా పుల్వామా జిల్లాలోని మిత్రిగామ్ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల్లో అల్-బదర్‌కు చెందిన ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసు అధికారులు గురువారం చెప్పారు.హతమైన ఉగ్రవాదులు ఇద్దరూ స్థానికులేనని, వారిని ఐజాజ్ హఫీజ్, షాహిద్ అయూబ్‌గా గుర్తించామని పోలీసులు చెప్పారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పోలీస్ విజయ్ కుమార్ చెప్పారు.


హతులైన ఉగ్రవాదులు ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నెలలో పుల్వామాలో జరిగిన వరుస దాడుల్లో పాల్గొన్నారని కుమార్ చెప్పారు.గ్రామంలో ఉగ్రవాదుల ఉనికి గురించి జమ్మూ కశ్మీర్ పోలీసులు నిర్దిష్ట సమాచారం అందించడంతో నిన్న సాయంత్రం ఆపరేషన్ ప్రారంభమైంది. వెంటనే పోలీసులు, సీఆర్‌పీఎఫ్, సైన్యం సంయుక్తంగా ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. భద్రతా బలగాల ఉమ్మడి బృందం అనుమానిత స్థలాన్ని చుట్టుముట్టడంతో దాక్కున్న ఉగ్రవాదులు జాయింట్ టీమ్‌పై కాల్పులు జరిపారు, దీంతో సాయుధ బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించారు.పౌరుల తరలింపు కోసం కొంతసేపు ఆపరేషన్‌ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. 


తొలుత జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక సైనికుడు గాయపడి శ్రీనగర్‌లోని 92 బేస్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆపరేషన్ తిరిగి ప్రారంభం కాగానే సాయంత్రం ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ రాత్రి సమయంలో ఆపరేషన్‌ను నిలిపివేశారు. గురువారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు తిరిగి ప్రారంభమయ్యాయని, ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది హతమయ్యాడని ఐజీ కుమార్ తెలిపారు.ఇది 41వ ఎన్‌కౌంటర్ అని, ఇప్పటి వరకు భద్రతా దళాలు ఈ సంవత్సరం 61 మంది ఉగ్రవాదులను హతమార్చగలిగాయి. వీరిలో పది మందికి పైగా పాకిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారు.


Updated Date - 2022-04-28T13:02:52+05:30 IST