UAE లో ఇద్దరు మహిళలకు ఏకంగా రూ.30 లక్షల జరిమానా.. ఇంతకీ వాళ్లు చేసిన నేరమేంటంటే..

ABN , First Publish Date - 2021-09-18T21:15:24+05:30 IST

యూఏఈలో ఇద్దరు మహిళలకు అక్కడి న్యాయస్థానం ఏకంగా 1.50లక్షల దిర్హమ్స్(రూ.30 లక్షల) జరిమానా విధించింది.

UAE లో ఇద్దరు మహిళలకు ఏకంగా రూ.30 లక్షల జరిమానా.. ఇంతకీ వాళ్లు చేసిన నేరమేంటంటే..

అబుధాబి: యూఏఈలో ఇద్దరు మహిళలకు అక్కడి న్యాయస్థానం ఏకంగా 1.50లక్షల దిర్హమ్స్(రూ.30 లక్షల) జరిమానా విధించింది. క్షణికావేశంలో ఆ ఇద్దరు మహిళలు చేసిన పనికి ఈ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంతకీ వారు చేసిన నేరమెంటో చెప్పలేదు కదూ. అబుధాబిలో వారు నివాసముండే విల్లాలో చిన్న విషయమై జరిగిన గొడవలో మరో మహిళను వారిద్దరూ బాల్కనీ నుంచి కిందకు తోసేశారు. దాంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఏకంగా 20 రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. తాజాగా ఈ కేసు అబుధాబి క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. దాంతో న్యాయస్థానం బాధితురాలికి ఇద్దరు మహిళలను పరిహారంగా రూ.30లక్షలు చెల్లించాల్సిందిగా తీర్పునిచ్చింది. 


ఇవి కూడా చదవండి..

రికార్డు స్థాయిలో Kuwait కు గుడ్ బై చెప్పిన వలసదారులు.. ఏడాదిన్నరలో..

Kuwaitలో ఇక జైల్ ఫ్రమ్ హోమ్.. అమల్లోకి సరికొత్త నిబంధన.. వాళ్లందరికీ బెన్‌ఫిట్.. 


కోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం.. అబుధాబిలోని ఓ విల్లాలో నివాసముండే ఇద్దరు అరబ్ మహిళలు మరో మహిళతో ఘర్షణ పడ్డారు. విల్లా బాల్కనీలో వారు ముగ్గురు ఇలా గొడవకు దిగారు. ఈ క్రమంలో గొడవ కాస్తా ముదిరి వారిద్దరూ కలిసి మూడో మహిళను బాల్కనీ నుంచి కిందకు తోసేశారు. దాంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. 20 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఇక బాధితురాలి పట్ల విచక్షణరహితంగా ప్రవర్తించి తీవ్రంగా గాయపడేటట్లు చేసిన ఇద్దరు అరబ్ మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు అబుధాబి క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో న్యాయస్థానం వారిద్దరికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు బాధితురాలికి లక్ష దిర్హమ్స్ పరిహారంగా ఇవ్వాలని తీర్పునిచ్చింది. కానీ, తర్వాత ఆ ఇద్దరు మహిళల అభ్యర్థన మేరకు జైలు శిక్షను ఆరు నెలలకు తగ్గించింది కోర్టు. 


కాగా, బాధితురాలు పరిహారం విషయమై కోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేసింది. తన కుటుంబం మొత్తానికి తానే ఆధారమని, ఈ ఘటన వల్ల తన శరీరానికి అయిన గాయాల కారణంగా బయటకు వెళ్లి పని చేయాలేనంటూ తనకు 2.50లక్షల దిర్హమ్స్ పరిహారంగా ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరింది. తాజాగా బాధితురాలి వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యాయస్థానం ఇద్దరు మహిళలను మరో 50వేల దిర్హమ్స్ అదనంగా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. దీంతో బాధితురాలికి వారిద్దరూ పరిహారంగా మొత్తం 1.50లక్షల దిర్హమ్స్(రూ.30లక్షలు) చెల్లించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. అంతేగాక బాధితురాలి కోర్టు ఖర్చులను కూడా ఆ ఇద్దరు మహిళలే భరించాలని న్యాయస్థానం తెలిపింది. 



Updated Date - 2021-09-18T21:15:24+05:30 IST