నకిలీ సర్టిఫికెట్లతో అమెరికా వెళ్లే యత్నం.. చివరికి

ABN , First Publish Date - 2022-04-12T12:53:28+05:30 IST

నకిలీ ధ్రువపత్రాలతో అమెరికా వెళ్లేందుకు యత్నించిన ఇద్దరు వరంగల్‌ వాసులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

నకిలీ సర్టిఫికెట్లతో అమెరికా వెళ్లే యత్నం.. చివరికి

తనిఖీల్లో పట్టుబడిన ఇద్దరు వరంగల్‌ వాసులు..

హనుమకొండ క్రైం, ఏప్రిల్‌ 11: నకిలీ ధ్రువపత్రాలతో అమెరికా వెళ్లేందుకు యత్నించిన ఇద్దరు వరంగల్‌ వాసులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్లకి సహకరించిన మరో ముగ్గురిపై కూడా కేసు పెట్టారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ పోలీసులిచ్చిన వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన పాడి సాయిచంద్‌రెడ్డి, వరంగల్‌ గిర్మాజిపేటకు చెందిన దేవా మనీ్‌ష అమెరికా వీసా కోసం నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారు. హనుమకొండ కిషన్‌పుర, నక్కలగుట్టలోని ఓ కంప్యూటర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ద్వారా పలు సాఫ్ట్‌వేర్‌ కోర్సులు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లను కొనుగోలు చేశారు.


నక్కలగుట్టలోని వాల్మీకి ఫారిన్‌ కన్సల్టెన్సీ ద్వారా హనుమకొండలోని రెండు బ్యాంకుల్లో తమకు డిపాజిట్లు ఉన్నట్టు పత్రాలు పొందారు. వాటిని రెండు వారాల క్రితం ఢిల్లీలోని యూఎస్‌ ఎంబసీలో సమర్పించారు. తనిఖీల్లో అవి నకిలీవని తేలడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ నెల 5న కేసు నమోదైంది. సాఫ్‌టెక్‌ కంప్యూటర్‌ డైరెక్టర్‌ మధుమిత దండె, వాల్మీకి ఫారిన్‌ కన్సల్టెన్సీ ఏజెంట్‌ గణేశ్‌, బ్యాంకు అధికారి వేణుమాధవ్‌పై కూడా కేసు పెట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

Updated Date - 2022-04-12T12:53:28+05:30 IST