Advertisement

రెండు స్వప్నాలు-–ఒకే లక్ష్యం

Jul 14 2020 @ 01:02AM

డాక్టర్ చెలికాని రామారావు, కందాళ సుబ్రహ్మణ్య తిలక్ జీవితాలకి సారూప్యత ఉన్నది. ఒకరు సోషలిస్టు, మరొకరు కమ్యూనిస్టు. సిద్ధాంతాలు వేరైనా చివరిదాకా ఇద్దరూ నిరాడంబరమైన గాంధేయవాదులుగానే జీవించారు. మొట్టమొదటి సార్వత్రక ఎన్నికలలో ఒకరు సోషలిస్టు అభ్యర్థిగా, మరొకరు కమ్యూనిస్టు అభ్యర్థిగా విజయం సాధించి ప్రగతిశీల రాజకీయాలకి నూతన బాట వేసారు. రాజకీయ నేతలుగా ఇద్దరూ కులనిర్మూలన, మతసామరస్యం, మద్యపాన వ్యతిరేకోద్యమం, బలహీనవర్గాల ఉన్నతి కొరకు పాటుపడ్డారు. సొంత కుటుంబం నుండే మార్పుకు స్వీకారం చుట్టారు.


వాళ్ళిద్దరూ సామ్యవాద స్వాప్నికులు. అసమానతలు లేని సమాజాన్ని జీవితాంతం అభిలషించి అందుకోసం కృషి చేసిన ఆలోచనాపరులు. ఆశయాలని ఆచరణకు అనుసంధానించి రాజకీయాలకి నూతన భాష్యం రాసిన నవయుగ రథ సారధులు. మొదటివారు కమ్యూనిస్టు నాయకులు చెలికాని రామారావు. ప్రథమ సార్వత్రక ఎన్నికలలో కాకినాడ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికైన జనహితుడు. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం సమాజహితం కోసం అర్దరాత్రి ఇల్లు వదిలిపెట్టి జీవితాన్ని ప్రజాపరం చేసిన మహనీయుడు రామారావు. రెండవవారు సోషలిస్టు నాయకులు కందాళ సుబ్రహ్మణ్య తిలక్. మొదటి సార్వత్రక ఎన్నికల్లో విజయనగరం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే మూడవ అత్యధిక ఓట్లమెజారిటీతో తిలక్ గెలుపొందారు. సరిగ్గా నూరేళ్ళ క్రితం జన్మించి ప్రజాపక్షపాతిగా జీవించిన కార్యశూరుడు కందాళ సుబ్రహ్మణ్య తిలక్.


1920, 1930 దశకాలు భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైనవి. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రజాతంత్ర శక్తులన్నీ ఒక్కటై నిలవడానికి అవసరమైన అన్ని మార్గాలు పటిష్ఠంగా నిర్మించడం కోసం దేశంలోని యువత నలుచెరగులా చైతన్యాన్ని వ్యాపింపజేసిన కాలమది. సహాయనిరాకరణోద్యమ సంఘటితత్వం ఒక వైపు వ్యాప్తి చేస్తూనే కొత్త వెలుగుల కోసం అన్వేషిస్తున్న యువత ప్రధానంగా రెండు పక్షాల వైపు మొగ్గుచూపారు, ఒకటి- మార్క్సిస్టు ధోరణిలో కమ్యూనిస్టు రాజకీయాలు. రెండు- గాంధీయన్ దృక్పధంతో సోషలిస్టు రాజకీయాలు. డాక్టర్ చెలికాని రామారావు జీవితం భారతదేశ చరిత్రలోని అత్యుత్తమ అధ్యాయానికి ఒక ఉదాహరణ, మచ్చుతునక.’ అని చరిత్రకారుడు గరిగిపాటి రుద్రయ్య చౌదరి అన్నారు. 1901 జూలై 15న తిమ్మాపురంలో పుట్టిన చెలికాని రామారావు స్వగ్రామం పిఠాపురం దగ్గర కొండెవరం.రామారావు పై నాటి మానవతావాద ఉద్యమాలన్నింటి ప్రభావం ఉంది. స్వామి వివేకానంద మొదలుకొని,బ్రహ్మసమాజం, పిఠాపురం మహారాజా వారి సంఘసంస్కరణ, రఘుపతి వెంకటరత్నం నాయుడి ఆశయ సాధన, మహాత్మాగాంధీ నవీన కార్యాచరణ ఆయనను బాల్యంలోనే ప్రభావితం చేసాయి. 


‘ఆనాడు పిఠాపురం చిన్న బెంగాలు వలె ఉండేది. ఆధునికత కు, సంఘసంస్కరణ కార్యక్రమాలకు కలకత్తా కేంద్రమయితే, వాటికి గోదావరి జిల్లాలో కేంద్రం కాకినాడ’ అని చెలికాని జీవితంపై సమగ్ర పరిశోధన చేసిన బివివి బాటకృష్ణ అన్నారు. అలాంటి వాతావరణంలో సహజంగానే దేశమంతటా సాగుతున్న స్వాతంత్ర్యోద్యమ ప్రభావం చెలికాని రామారావును తన వైపు తిప్పుకుంది. కాంగ్రెస్ అభిమానిగా ఉంటూనే సోషలిస్టు రాజకీయాల వైపు మొగ్గు చూపి సేవాదళ్ బాధ్యునిగా కార్యక్రమాలు చేపట్టి, తదనంతరం కమ్యూనిస్టు సిద్ధాంతం వైపు మరలి చివరివరకూ వెనుదిరగని సామ్యవాద నేతగానే ఆయన బతికారు.ప్రజావైద్యునిగా దీనుల సేవచేస్తూ 1985 సెప్టెంబరు 25 న చెలికాని మరణించారు.


1920 జూలై 15 న విశాఖపట్నం లోని అల్లిపురంలో జన్మించిన కె.యస్.తిలక్ స్వగ్రామం విజయనగరం జిల్లా శృంగవరపుకోట దగ్గర రేగ. విజయనగరం మహారాజా కళాశాలలో విద్యార్థి దశలోనే సోషలిస్టు నాయకుడు ఎస్.ఎస్.బాట్లీవాలా ప్రసంగం విని ప్రభావితమై సోషలిస్టుగా మారి చివరిదాకా వెనకడుగు వేయని సమాజవాదిగా ఆయన జీవించారు. మహాత్మాగాంధీ, లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్, గోరా వంటి నాయకుల స్ఫూర్తితో ప్రప్రథమ పార్లమెంటు ఎన్నికలలో విజయనగరం ఎం.పీ.గా దేశంలోనే మూడవ స్థానంలో మెజారిటీ సాధించి సోషలిస్టు అభ్యర్థిగా చరిత్ర సృష్టించారు. ఆచార్య వినోబాబావే భూదాన ఉద్యమంలోనూ, సర్వోదయ ఉద్యమంలోనూ ప్రధానపాత్ర పోషించారు. రైల్వే సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా పని చేశారు. సొసైటీ ఫర్ సోషల్ చేంజ్, భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్, మాన్సస్ వంటి సంస్థలలో క్రియాశీలకంగా పనిచేసిన తిలక్ తూర్పుగోదావరి జిల్లా మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీల అభ్యున్నతికి ‘స్పందన’ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి కృషి చేశారు.భార్య అనారోగ్యంతో ఉండగా ఒకనాటి అర్దరాత్రి ఇంటికొచ్చి తమతో చేతులు కలపమన్న నక్సలైట్ నేతలకు ‘నేను అహింసావాదిని, మీ భావాలు నాకు పొసగవని’ మొహం మీద చెప్పిన ధీరులు తిలక్. ‘ఆంధ్ర తిలకం’ పేరిట ఆయన. జీవిత చరిత్రను విశ్వశ్రీ చాలా ఏళ్ళ క్రితం సంక్షిప్తంగా రచించారు. యువతరానికి అవకాశాలు ఇవ్వాలనీ ఒక వ్యక్తి ఒక సారికి మించి ఎన్నికలలో పోటీ చేయడాన్ని రద్దుచేయాలనే సత్సంకల్పంతో రెండో సారి కనీసం ఎన్నికల వైపు చూడని ఉదాత్త నేత తిలక్. 98 ఏళ్ళ వయసులో జూన్ 8, 2018 జూన్ 8న ఆయన కీర్తి శేషులయ్యారు.


వయసులో సుమారు 20 ఏళ్ళ వ్యత్యాసం ఉన్నప్పటికీ డాక్టర్ చెలికాని రామారావు, కందాళ సుబ్రహ్మణ్య తిలక్ జీవితాలకి సారూప్యత ఉన్నది. ఒకరు సోషలిస్టు, మరొకరు కమ్యూనిస్టు. సిద్ధాంతాలు వేరైనా చివరిదాకా ఇద్దరూ నిరాడంబరమైన గాంధేయవాదులుగానే జీవించారు. మొట్టమొదటి సార్వత్రక ఎన్నికలలో ఒకరు సోషలిస్టు అభ్యర్థిగా పోటీచేసి గెలిస్తే, మరొకరు కమ్యూనిస్టు అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించి ప్రగతిశీల రాజకీయాలకి నూతన బాట వేసారు. రాజకీయ నేతలుగా ఇద్దరూ కులనిర్మూలన, మతసామరస్యం, మద్యపాన వ్యతిరేకోద్యమం, బలహీనవర్గాల ఉన్నతి కొరకు పాటుపడ్డారు. సొంత కుటుంబం నుండే మార్పుకు స్వీకారం చుట్టారు. నిర్మొహమాట నేతలుగా, నిష్కళంక కార్యకర్తలుగా, అకళంక దేశభక్తులుగా ఎదిగి ప్రజల మనసుల్లో శాశ్వతంగా ఒదిగిపోయారు. స్వప్నాలు వేరైనా ఇద్దరి లక్ష్యం సమతా సాధనే.


కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉండి తదనంతరం కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగి కేరళ మొదటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ 1984లో ‘కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ & కమ్యూనిస్టులు’ అనే వ్యాసాన్ని రాస్తూ ప్రగతిశీల శక్తుల ఐక్యతని కాంక్షించారు. అందులోనే ఆయన కమ్యూనిస్టు పార్టీ కి, సోషలిస్టు లకి జరిగిన చారిత్రక ఒప్పందం,ఇరు పార్టీల ప్రధాన కార్యదర్శులైన పి.సి.జోషి, జయప్రకాష్ నారాయణ్ సామ్రాజ్యవాదం పై పోరు కోసం ఐక్య బాటపట్టి చారిత్రక సి.ఎస్.పి - సి.పి.ఐ. అగ్రిమెంట్ చేసుకున్న చరిత్రని తడిమారు. ఈరోజు పేట్రేగిపోతున్న మతోన్మాదాన్ని ఎదుర్కోడానికి దళిత బహుజన ప్రగతిశీల లిబరల్ శక్తులన్ని ఒక్కతాటి పైకి రావడం అంతే అవసరం. అందులో భాగంగానే కొద్దిపాటి భిన్న భావాలున్నప్పటికీ సమాజం కోసం పురోగమించిన సామ్యవాద స్వాప్నికులుగా, అలుపెరుగని ఆచరణాత్మక ధీరులుగా,చరిత్ర నుదుటి మీది అభ్యుదయ తిలకాలుగా డాక్టర్ చెలికాని రామారావు కమ్యూనిస్టు ఆదర్శాల నుండి, కందాళ సుబ్రహ్మణ్య తిలక్ సోషలిస్టు ఆలోచనల నుండి యువత ఈ రోజు స్పూర్తి పొందడం అవసరం.

గౌరవ్

జూలై 15 చెలికాని రామారావు 120 వ జయంతి; 

కందాళ సుబ్రహ్మణ్య తిలక్ శతజయంతి.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.