అమెరికన్లే లక్ష్యంగా ఇద్దరు భారతీయుల భారీ స్కామ్ !

ABN , First Publish Date - 2021-02-23T23:37:55+05:30 IST

అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని మిలియన్ డాలర్ల రోబోకాల్ కుంభకోణానికి పాల్పడిన ఇద్దరు భారతీయులను యూఎస్ కోర్టు దోషిగా తేల్చింది.

అమెరికన్లే లక్ష్యంగా ఇద్దరు భారతీయుల భారీ స్కామ్ !

వాషింగ్టన్: అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని మిలియన్ డాలర్ల రోబోకాల్ కుంభకోణానికి పాల్పడిన ఇద్దరు భారతీయులను యూఎస్ కోర్టు దోషిగా తేల్చింది. వీరు వేలాది మంది అమెరికన్లను ముఖ్యంగా వయో వృద్ధులను వివిధ పథకాల పేరిట భారీగా మోసం చేసినట్లు అమెరికా న్యాయశాఖ పేర్కొంది. ఈ భారీ కాల్‌సెంటర్ కుంభకోణంలో తమ నేరాన్ని అంగీకరించిన ప్రదీప్ సింగ్ పార్మర్(41), సుమెర్ పటేల్(37)కు చెరో 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే తన ఐడెంటిటీని మార్చుకుని మోసగించినందుకు పార్మర్‌కు అదనంగా రెండేళ్ల శిక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక ఈ స్కామ్‌ ప్రధాన సూత్రధారి షెహజాద్‌ఖాన్ పఠాన్‌ను న్యాయస్థానం ఈ ఏడాది జనవరి 15న దోషిగా తేల్చింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కాల్‌సెంటర్ ద్వారా పఠాన్ ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. ఆయనకు పార్మర్, సుమెర్ పటేల్ సహాకరించారు. ఇలా ఈ ముగ్గురు ఒక జట్టుగా ఏర్పడి వివిధ పథకాల పేరిట అమెరికన్ల నుంచి మిలియన్ల డాలర్లు కొల్లగొట్టారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ), డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్(డీఈఏ) నిర్ధారించాయి.

Updated Date - 2021-02-23T23:37:55+05:30 IST