Sad Incident: పాపం ఆ పిల్లాడు.. అన్నతో కలిసి ఆడుకుంటున్నాడు.. ప్రాణం పోతుందని అతనికి మాత్రం ఏం తెలుసు..

ABN , First Publish Date - 2022-05-31T01:50:10+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని అంరోహ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. వీధి కుక్కలు స్వైర విహారం చేసి 9 ఏళ్ల పిల్లాడిని అమానుషంగా..

Sad Incident: పాపం ఆ పిల్లాడు.. అన్నతో కలిసి ఆడుకుంటున్నాడు.. ప్రాణం పోతుందని అతనికి మాత్రం ఏం తెలుసు..

అంరోహ: ఉత్తరప్రదేశ్‌లోని అంరోహ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. వీధి కుక్కలు స్వైర విహారం చేసి 9 ఏళ్ల పిల్లాడిని అమానుషంగా పొట్టనపెట్టుకున్నాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు. అప్పటికే పిల్లాడు చనిపోయినట్లు డాక్టర్ ధృవీకరించాడు. ఆ పిల్లాడితో పాటే ఉన్న 12 ఏళ్ల వయసున్న బాలుడి అన్నయ్య కూడా కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు.



ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని అంరోహ జిల్లాలోని హసనపూర్ తాలూకాకు చెందిన గ్రామంలో ఇమ్రాన్ సింగ్ అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతనికి 12 సంవత్సరాలు, 9 సంవత్సరాల వయసున్న కొడుకులు ఉన్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు పిల్లలిద్దరూ వాళ్ల మామయ్య దేవీష్ కుమార్‌తో కలిసి పొలానికి వెళ్లారు. పిల్లలిద్దరినీ రోడ్డుపై ఆడుకోమని చెప్పి దేవీష్ కుమార్ పొలంలోకి వెళ్లి పనిచేసుకుంటున్నాడు. అన్నదమ్ములిద్దరూ ఆడుకుంటూ ఉండగా ఉన్నట్టుండి 10-12 కుక్కలున్న శునకాల సమూహం పిల్లలిద్దరినీ చుట్టుముట్టింది. ఇద్దరినీ ఆ కుక్కలు మీదబడి కరిచాయి. పిల్లల అరుపులు విన్న దేవీష్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ కుక్కలను తరిమికొట్టాడు.



కుక్కల దాడిలో అప్పటికే పిల్లలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా 9 ఏళ్ల పిల్లాడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్ శశికాంత్ చెప్పారు. మరో పిల్లాడికి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మీరట్‌కు తరలించారు. ఆ పిల్లాడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పిల్లాడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కుక్కల బెడద ఎక్కువైందని ఎన్నిసార్లు చెప్పినా మున్సిపాలటీ సిబ్బంది పట్టించుకోలేదని, నిండు ప్రాణం పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలను పట్టుకోవడానికి ఒక బృందాన్ని పంపినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-05-31T01:50:10+05:30 IST