ఇద్దరు అంతర్‌ రాష్ట్ర చైన్‌ స్నాచర్లు అరెస్టు

ABN , First Publish Date - 2021-06-23T06:12:43+05:30 IST

ఒంటరిగా వెళ్తున్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్లను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు.

ఇద్దరు అంతర్‌ రాష్ట్ర చైన్‌ స్నాచర్లు అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డి


రూ.11లక్షల విలువ చేసే 22 తులాల బంగారం, రెండు 

బైక్‌లు స్వాధీనం


అనంతపురం క్రైం, జూన్‌ 22: ఒంటరిగా వెళ్తున్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్లను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారి నుంచి రూ.11 లక్షల విలువ చేసే 22 తులాల బంగారు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వీరరాఘవరెడ్డి తన కార్యాలయంలో మంగళవారం సీఐలు కత్తి శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, ఎస్‌ఐ జైపాల్‌రెడ్డి, సిబ్బందితో కలిసి వెల్లడించారు. కంబదూరు మండలం వెంకటంపల్లికి చెందిన ఎనుముల మారుతీప్రసాద్‌ (పాత నేరస్తుడు) కొన్నేళ్లుగా సెల్‌ఫోన్‌ చోరీలు చేస్తూ వ్యసనాలు తీర్చుకునేవాడు. ఇతడిపై జిల్లాతోపాటు కర్ణాటకలోని పావగడలోనూ పలు కేసులు నమోదయ్యాయి. 2017లో సెల్‌ఫోన్‌ చోరీ కేసులో అరెస్టయి, మూడు నెలలు రెడ్డిపల్లి జైలులో శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో కరుడుగట్టిన తొంగ పీట్ల గంగాధర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో సెల్‌ఫోన్ల చోరీలు పక్కనపెట్టి, బయటకు వచ్చిన  తరువాత  చైన్‌స్నాచింగ్‌లకు తెరలేపాడు. తర్వాత కర్ణాటకలోని ఐదు కేసులకు సంబందించి అక్కడి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. బయటకు వచ్చాక కూడా అతడిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో తనకు పరిచయమున్న తన గ్రామానికి చెందిన మూడే రాములునాయక్‌తో కలిసి ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. గత నవంబరు నుంచి అనంతపురం సబ్‌ డివిజన్‌లోని నగరంతో పాటు రాప్తాడు, అనంతపురం రూరల్‌ పోలీసు స్టేషన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 9 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డి నేతృత్వంలో నగరంలోని నాలుగో పట్టణ, ఆత్మకూరు సర్కిల్‌ పోలీసులు బృందాలుగా ఏర్పాడి, దర్యాప్తు ముమ్మరం చేశారు. నగరంలోని 80 అడుగుల రోడ్డు సమీపంలో ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. 9 కేసుల్లో ఐదింటికి సంబంధించి బంగారు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 4 కేసులకు సంబంధించి 10 తులాల బంగారు మణప్పురం గోల్డ్‌ సంస్థలో తాకట్టు పెట్టారు. వీటిని కూడా త్వరలో స్వాధీనం చేసుకుంటామని డీఎస్పీ తెలియజేశారు. 


Updated Date - 2021-06-23T06:12:43+05:30 IST