పాకిస్తాన్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత

ABN , First Publish Date - 2022-05-15T21:27:09+05:30 IST

పెషావర్ : పాకిస్తాన్‌లో మైనారిటీల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కు వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ అగంతుకుడు కాల్చిచంపాడు.

పాకిస్తాన్‌లో ఇద్దరు సిక్కుల కాల్చివేత

పెషావర్ : పాకిస్తాన్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కు వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ అగంతుకుడు కాల్చిచంపాడు. పెషావర్‌లోని సర్బంద్ ఏరియాలో ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. మృతుల పేర్లు సల్జీత్ సింగ్(42), రంజీత్ సింగ్(38) కాగా వీరిద్దరూ షాప్‌కీపర్లుగా పనిచేస్తున్నారు. సర్బంద్ ఏరియాలోని బాటా టాల్ బజార్‌లో సుగంధద్రవ్యాలను విక్రయిస్తున్నారని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఇద్దరూ ఘటనా స్థలంలోనే చనిపోయారని వివరించారు. ఘటనా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని, నేరస్థులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటనలూ తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి మెహబూబ్ ఖాన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నేరస్థులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతర్గత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రగా ఈ దాడిని అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.


కాగా పాకిస్తాన్‌లో వెలుగుచూస్తున్న సిక్కుల హత్య ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2016, 2018, 2020లలో ఈ తరహా ఘటనలు జరిగాయి. పెషావర్ నగరంలో 15 వేలకుపైగా మంది సిక్కులు నివాసముంటున్నారు. ఇక్కడ నివసించే సిక్కుల్లో అత్యధికులు వేర్వేరు వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కొంతమంది ఫార్మసీలను నిర్వహిస్తున్నారు. 2017 జనాభా లెక్కల ప్రకారం.. పాకిస్తాన్‌లో అతిపెద్ద మైనారిటీ వర్గంగా సిక్కులు ఉన్నారు.

Updated Date - 2022-05-15T21:27:09+05:30 IST