బావిలోకి దూకి మైనర్ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. కారణం ఏంటో తెలుసా...

ABN , First Publish Date - 2022-06-07T21:36:14+05:30 IST

ఓ మృగాడి బెదిరింపులకు భయపడిపోయిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లు గుడికి వెళ్తున్నామని ఇంట్లో చెప్పి.. బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

బావిలోకి దూకి మైనర్ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. కారణం ఏంటో తెలుసా...

రేవా, మధ్యప్రదేశ్ : ఓ మృగాడి బెదిరింపులకు భయపడిపోయిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లు గుడికి వెళ్లొస్తామని ఇంట్లో చెప్పి.. బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అత్యంత విషాదకరమైన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో వెలుగుచూసింది. నైగర్హీ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని దిహియా పడాన్ గ్రామానికి చెందిన 12, 16 ఏళ్ల బాలికలు  మే 23న సూసైడ్ చేసుకున్నారు. గుడికి వెళ్లొస్తామని ఇంట్లో చెప్పి వెళ్లిన బాలికలు రాత్రయినా ఇంటికి చేరకపోవడంతో కంగారుపడిపోయిన కుటుంబ సభ్యులు వెతుకులాడుతుండగా.. మరుసటి రోజు ఇద్దరి మృతదేహాలనూ బావిలో గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతుండగా అసలు నిజాలు బయటపడ్డాయి. 


24 ఏళ్ల రవి చతుర్వేది అనే నిందిత యువకుడి బెదిరింపులే బాలికలు ఆత్మహత్యకు కారణమయ్యాయని తేలింది. తనను పెళ్లి చేసుకోవాలని, లేకుంటే తనవద్ద ఉన్న అసభ్యకరమైన వీడియోలు(బాలికలకు సంబంధించినవి) లీక్ చేస్తానంటూ ఇద్దరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ విషయం బాలిక సోదరుడికి తెలిసి నిందిత యువకుడికి వార్నింగ్ ఇచ్చాడు. తన సోదరీమణులను పీడించవద్దని బతిమాలాడాడు. కానీ  ఆ తర్వాత నిందితుడి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. తరచూ ఫోన్ చేస్తూ వీడియోలు లీక్ చేస్తానంటూ బాలికలపై తీవ్ర ఒత్తిడిని పెంచాడు. బాగా భయపడిపోయిన బాలికలు ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తేలిందని నైగర్హీ పోలీస్ స్టేషన్‌ ఇన్‌ఛార్జీ మిథిలేష్ యాదవ్ చెప్పారు. నిందితుడు తరచూ ఫోన్ చేసి బాలికలతో అనుచితంగా మాట్లాడేవాడని వెల్లడైనట్టు వివరించారు.


నిందితుడు రవి చతుర్వేదిపై ఐపీసీలోని 305 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు. ఈ సెక్షన్ ప్రకారం... 18 ఏళ్ల లోపు వాళ్లు(మైనర్లు) ఆత్మహత్యకు పాల్పడితే ఇందుకు కారణమైన వ్యక్తులకు మరణ శిక్ష లేదా జీవితకాల జైలుశిక్ష లేదా 10 ఏళ్లు మించకుండా జైలు, జరిమానా పడే అవకాశాలున్నాయని పోలీసులు వివరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి లీగల్ ప్రక్రియలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Updated Date - 2022-06-07T21:36:14+05:30 IST