జొమాటో డెలివరీ బాయ్‌‌ని అడ్డుకున్న ఆగంతకులు.. అతను తేరుకునే లోపే దానిని తీసుకుని ఉడాయించారు..

ABN , First Publish Date - 2021-10-30T16:34:23+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అర్థరాత్రి బైక్‌పై వచ్చిన..

జొమాటో డెలివరీ బాయ్‌‌ని అడ్డుకున్న ఆగంతకులు.. అతను తేరుకునే లోపే దానిని తీసుకుని ఉడాయించారు..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అర్థరాత్రి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు తుపాకీ చూపించి.. జొమాటో డెలివరీ బాయ్‌ బైక్‌ను తీసుకువెళ్లిపోయారు. బైక్‌పై వచ్చిన ఆ ఆగంతకులు జొమాటో డెలివరీ బాయ్‌ని ఓవర్ టేక్‌చేసి అడ్డుకున్నారు.  తరువాత అతని బైక్ తీసుకుని పరారయ్యారు. అయితే వారు తాము వచ్చిన బైక్  అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన రాజీవ్ ప్లాజా సమీపంలోని సిటీ పార్కింగ్ ఎదురుగా జరిగింది. ఘటన జరిగిన వెంటనే డెలివరీ బాయ్ ఇందర్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆగంతకుడు వదిలి వెళ్లిన బైక్‌ను వారు ఎక్కడో చోరీ చేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. 


వివరాల్లోకి వెళితే విశ్వాస్(31) జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే పార్సిళ్లు డెలివరీ చేశాక తన బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. దారిలో స్మార్ట్ సిటీ పార్కింగ్ వద్దకు రాగానే వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు అతనిని అడ్డుకున్నారు. వారిలోని ఒక యువకుడు తుపాకీ చూపించి.. విశ్వాస్‌ను బైక్ మీద నుంచి దిగాలని బెదిరించాడు. ఇంతలో మరో యువకుడు వచ్చి.. విశ్వాస్ బైక్‌ను స్టార్ చేశాడు. దీంతో విశ్వాస్‌కు.. ఆ యువకులకు మధ్య పెనుగులాట జరిగింది. అయితే వారు విశ్వస్‌ను పక్కకు తోసేసి, అతని బైక్ తీసుకుని ఇద్దరూ అక్కడి నుంచి ఉడాయించారు. అయితే వారు వచ్చిన బైక్‌ను అక్కడే వదిలివెళ్లపోయారు. వెంటనే విశ్వాస్ పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-10-30T16:34:23+05:30 IST