రెండు నెలల రేషన్‌!

ABN , First Publish Date - 2021-03-06T04:22:09+05:30 IST

సంగతి తెలిసిందే. సాంకేతిక సమస్యలు, పంచాయతీ ఎన్నికలు తదితర కారణాలతో రేషన్‌ పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య ఉండడంతో ప్రభుత్వం రెండు నెలలకు

రెండు నెలల రేషన్‌!




నేటి నుంచి పంపిణీ ప్రారంభం

ప్రభుత్వ నిర్ణయం

కొమరాడ, మార్చి 5: గత నెల రేషన్‌ అందని వారికి ఉపశమనం. ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి ఒకేసారి సరుకులు అందించనున్నారు. శనివారం నుంచి ఇంటింటా రేషన్‌ సరఫరా చేయనున్నారు. ఈ మేరకు అన్ని మండలాల అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. గత నెల నుంచి వాహనాల ద్వారా ఇంటింటా రేషన్‌ పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  సాంకేతిక సమస్యలు, పంచాయతీ ఎన్నికలు తదితర కారణాలతో రేషన్‌ పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య ఉండడంతో ప్రభుత్వం రెండు నెలలకు ఒకేసారి సరుకులు అందించడానికి నిర్ణయిస్తూ ఆదేశాలిచ్చింది. శనివారం నుంచి రేషన్‌ సరఫరాకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు పూర్తి చేసింది. 

జిల్లా వ్యాప్తంగా 7 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో 50 వేల రేషన్‌కార్డులకు సంబంధించి లబ్ధిదారులకు ఫిబ్రవరి నెలలో సరుకులు అందలేదు.  ముఖ్యంగా ఏజెన్సీ మండలాల్లో రేషన్‌ అందనివారు అధికం. కొండ శిఖర గ్రామాలకు వాహనాలు వెళ్లకపోవడం, సిగ్నల్‌ లేక ఇబ్బందులు ఎదురవ్వడం తదితర కారణాలతో గిరిజనులు రేషన్‌ పొందలేకపోయారు. అటువంటి వారికి శనివారం నుంచి రెండు నెలల సరుకులు అందించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.  జిల్లాలో 114 వార్డు, 664 గ్రామ సచివాలయాల పరిధిలో 458 వాహనాల ద్వారా సరుకులు ఇవ్వనున్నారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  కార్డుదారులు వాహనాల కోసం ఎదురు చూడకుండా తగిన తేదీ, సమయం తెలుపుతూ వలంటీర్లు ముందుగానే స్లిప్పులు రాసి ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని కొమరాడ సీఎస్‌ డీటీ నాగేశ్వరరావు సూచించారు. 


రేషన్‌ వాహనాలను తనిఖీ చేయండి

రేషన్‌ వాహనాలను తహసీల్దారులు తనిఖీ చేయాలని జేసీ కిషోర్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం తహసీల్దారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు, జేసీ మాట్లాడుతూ ఈ-పోస్‌ యంత్రాలపై వలంటీర్లకు అవగాహన పెంచాలన్నారు.  వాహనాల వద్ద క్యూలైన్లు ఉండకూడదని స్పష్టం చేశారు. పంపిణీ సమయాన్ని ముందుగా లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించారు. వాహనాల్లో ఉన్న మైకుల ద్వారా ప్రచారం చేయాలన్నారు. 15 కిలోల కంటే ఎక్కువైతే సంచుల ద్వారా అందించాలని చెప్పారు. కొండ శిఖర గ్రామాల్లో లబ్ధిదారుల ఇంటికే రేషన్‌ తీసుకెళ్లి అందించాలన్నారు. కేఆర్‌ఆర్‌సీ ఉప కలెక్టర్‌  బాలా త్రిపుర సుందరి, సర్వే శాఖ ఏడీ కుమార్‌ ఉన్నారు. 



Updated Date - 2021-03-06T04:22:09+05:30 IST