లఖింపూర్ ఖేరీ హింస: మరో ఇద్దరు రైతుల అరెస్ట్

ABN , First Publish Date - 2022-01-03T01:23:39+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరీ హింస కేసులో బీజేపీ కార్యకర్త సుమిత్ జైస్వాల్..

లఖింపూర్ ఖేరీ హింస: మరో ఇద్దరు రైతుల అరెస్ట్

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరీ హింస కేసులో బీజేపీ కార్యకర్త సుమిత్ జైస్వాల్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నంబరు 220కి సంబంధించి తాజాగా మరో ఇద్దరు రైతులు అరెస్టయ్యారు. లఖింపూర్ ఖేరీ పోలీసుల కథనం ప్రకారం.. ఈ కేసులో నిందితులైన రైతులు కమల్‌జీత్ సింగ్ (29), కవల్‌జీత్ సింగ్ అలియాస్ సోను (35)లను ఘటన జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత అరెస్ట్ చేశారు.


నిందితులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్ కస్టడీ కోరనుంది. తాజా అరెస్టులతో కలుపుకుని బీజేపీ కార్యకర్తల హత్యకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన రైతుల సంఖ్య ఆరుకు పెరిగింది. 


హత్య, అల్లర్లకు ప్రేరేపించడం వంటి ఆరోపణలపై సుమిత్ జైస్వాల్ చేసిన ఫిర్యాదుపై మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేయగా, ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఇద్దరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసలో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది చనిపోయారు. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సహా 13 మందిపై నమోదైన ఎఫ్ఐఆర్‌లో సుమిత్ జైస్వాల్ పేరు కూడా ఉంది. 


రైతులపై వాహనం దూసుకెళ్లడానికి ముందు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య హెలికాప్టర్ ల్యాండింగ్‌ను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించారు. నల్లజెండాలు చూపి నిరసన తెలిపారు. ఆ తర్వాత రైతులు కారుపై రాళ్లు విసరడంతో అది తిరగబడింది. ఫలితంగా మిశ్రా డ్రైవర్ సహా నలుగురు బీజేపీ కార్యకర్తలు మరణించారు. 

Updated Date - 2022-01-03T01:23:39+05:30 IST