మరో రెండు కొత్త మండలాలు

ABN , First Publish Date - 2022-09-26T05:30:00+05:30 IST

సిద్దిపేట జిల్లాలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మరో రెండు కొత్త మండలాలు

కుకునూరుపల్లి, అక్బర్‌పేట-భూంపల్లిని మండలాలుగా ఏర్పాటు చేస్తూ ఉత్వర్వులు

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు


కొండపాక/దుబ్బాక, సెప్టెంబరు 26 : సిద్దిపేట జిల్లాలో మరో రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 13 మండలాలను కొత్తగా ఏర్పాటు చేస్తూ జీవో 104 విడుదల చేసింది. జిల్లాలో కుకునూరుపల్లి, అక్బర్‌పేట-భూంపల్లి కొత్తగా ఏర్పాటుకానున్నాయి. కుకునూరుపల్లి కొండపాక మండలంలోని 10 గ్రామాలను, జగదేవ్‌పూర్‌ మండలంలోని ఐదు గ్రామాలను మొత్తం 15 గ్రామాలతో మండలంగా ఏర్పాటు కానున్నది. మండల ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు కొన్నేళ్లుగా పోరాటం చేయడంతో పాటు అధికారులకు, నాయకులను కోరుతూ వచ్చారు. సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా పలుమార్లు ఈ ప్రాంత నాయకులు దేవిరవీందర్‌, పొల్కంపల్లి నరేందర్‌ తదితరులు మండల ఏర్పాటుకు వినతులు అందజేశారు. జూలై 27న ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేయగా సోమవారం జీవో విడుదల అయింది.


13 గ్రామాలతో కొత్త మండలం

భూంపల్లి చౌరస్తాలో నూతన మండల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. అక్బర్‌పేట- భూంపల్లి నూతన మండల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మండలం ఏర్పాటు చేయాలని 2001 నుంచి వినతులు అందజేస్తున్నారు. ఇక కొత్తగా ఏర్పడిన మండలంలో దుబ్బాక మండలానికి చెందిన పోతరెడ్డిపేట, చౌదర్‌పల్లి, ఎనగుర్తి, చిట్టాపూర్‌, బొప్పాపూర్‌తోపాటు మిరుదొడ్డి మండలానికి చెందిన ఖాజీపూర్‌, కూడవెల్లి, వీరరెడ్డిపల్లి, జంగపల్లి, అల్మా్‌సపూర్‌, భూంపల్లి, రుద్రారం, మోతే గ్రామాలు కలవనున్నాయి. ఇకనుంచి దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు స్వగ్రామం బొప్పాపూర్‌ అక్బర్‌పేట- భూంపల్లి మండలంలో కొనసాగనున్నది. దివంగత మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్‌ కూడా నూతన మండలంలోనే చేరింది. నూతన మండలాలు ఏర్పాటు కావడంపై ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2022-09-26T05:30:00+05:30 IST