ఏసీబీ వలలో ఏపీఎఫ్‌డీసీ అధికారులు

ABN , First Publish Date - 2021-05-09T06:44:20+05:30 IST

లంచం తీసుకుంటూ ఏపీఎఫ్‌డీసీకి చెందిన ఇద్దరు సత్యవేడు అధికారులు శనివారం ఏసీబీకి పట్టుబడ్డారు.

ఏసీబీ వలలో ఏపీఎఫ్‌డీసీ అధికారులు
పట్టుబడిన దిలీప్‌

సత్యవేడు, మే 8: ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ)కు చెందిన  ఇద్దరు సత్యవేడు అధికారులు శనివారం ఏసీబీకి పట్టుబడ్డారు. కోటి రూపాయల బ్యాంక్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ కోసం కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.ఏసీబీ అధికారుల కథనం మేరకు..... భద్రాచలంలోని ఐటీసీ కంపెనీకి సరఫరా చేసేందుకు సత్యవేడు ఏపీఎఫ్‌డీసీ పరిధిలో యూకలిప్టస్‌ చెట్ల కొనుగోలుకు నిర్వహించిన ఈ టెండర్‌లో స్థానిక కాంట్రాక్టర్‌ మస్తాన్‌ పాల్గొన్నారు. 14 వేల టన్నులను రూ.7 కోట్లకు కొనుగోలు చేశారు. ఇందుకోసం బ్యాంక్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.కోటి రూపాయలు చెల్లించారు. చెట్ల కొనుగోలు, తరలింపు పూర్తయ్యాక బ్యాంక్‌లోని సెక్యూరిటీ డిపాజిట్‌ విడుదల కోసం ఏపీఎఫ్‌డీసీ డివిజనల్‌ మేనేజరు పిచ్చయ్యను, డిప్యూటీ ప్లాంటేషన్‌ మేనేజర్‌ దిలీప్‌ను కాంట్రాక్టర్‌ సంప్రదించగా రూ.5లక్షలు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అంత మొత్తం ఇవ్వలేనంటూ రూ.2.50 లక్షలకు బేరమాడిన కాంట్రాక్టర్‌ ఈ విషయమై ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచనల మేరకు శనివారం రాత్రి మొదటి విడతగా స్థానిక సుబ్రమణ్యస్వామి ఆలయ సమీపంలోని మస్తాన్‌ కాంప్లెక్స్‌ వద్ద దిలీప్‌కు రూ.1.50 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీలు అల్లాబక్ష్‌, జనార్దన నాయుడు, సీఐ తమీమ్‌ అహ్మద్‌, ఎస్‌ఐలు సూర్యనారాయణ, విష్ణువర్ధన్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T06:44:20+05:30 IST