ఇద్దరు మహాత్ములు.. ఒకటే లక్ష్యం!

ABN , First Publish Date - 2020-12-07T09:33:58+05:30 IST

భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సరిగ్గా ఒకే సమయంలో ఇద్దరు మహాత్ములు అత్యున్నత శిఖరాలపై నిలబెట్టారు. వారిలో ఒకరు స్వామి వివేకానంద అయితే, మరొకరు రమణ మహర్షి.

ఇద్దరు మహాత్ములు.. ఒకటే లక్ష్యం!

భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సరిగ్గా ఒకే సమయంలో ఇద్దరు మహాత్ములు అత్యున్నత శిఖరాలపై నిలబెట్టారు. వారిలో ఒకరు స్వామి వివేకానంద అయితే, మరొకరు రమణ మహర్షి. ‘‘నిరంతర ప్రయత్నం ద్వారా పరిపూర్ణ స్థితిని పొందడం, దివ్యత్వాన్ని సంతరించుకోవడం, భగవదభిముఖంగా పోవడం, ఆయనను సాక్షాత్కరించుకోవడం ఏకైక ధ్యేయం’’ అంటూ అమెరికాలో స్వామి వివేకానంద గొంతెత్తి సింహగర్జన చేశారు. ‘‘మూల తలంపు అయిన ‘నేను’ లేచిన తర్వాతనే మిగిలిన తలంపులన్నీ ఉదయిస్తాయి. మనసే తలంపులమయం. ‘నేను’ అనే భావాన్ని గట్టిగా పట్టుకోగలిగితే ఇతర భావాలెన్ని వచ్చినా తట్టుకోవచ్చు’’ అంటూ ఆత్మవిచారణ మార్గాన్ని శుద్ధ అద్వైతమాధ్యమంగా బోధించాలని కైలాసం నుండి అరుణాచలం వచ్చిన దక్షిణామూర్తి స్వరూపం రమణమహర్షి. 1896లో పదహారేళ్ల బాలుడిగా ఈ లోకానికి ఆత్మవిచారణ అందించేందుకు అరుణాచలంలో అడుగుపెట్టారాయన.


మేరీ లూయీబర్క్‌ మొదలుకొని సిస్టర్‌ నివేదిత వరకు ఎందరో విదేశీయులు స్వామి వివేకానందకు శిష్యులుగా మారారు. ‘‘అమెరికాకు దైవం మానుషరూపేణ’’ అన్నట్లుగా స్వామీజీ వచ్చారని బర్క్‌ పేర్కొన్నారు. అదే విధంగా పాల్‌ బ్రంటన్‌ మొదలుకొని మేజర్‌ చాడ్విక్‌ వరకు పలువురు విదేశీయులు రమణుల అందించిన ఆత్మజ్ఞాన సుగంధాన్ని పాశ్చాత్య ప్రపంచమంతా వెదజల్లారు. ఈ ఇద్దరు మహా పురుషులూ ఒకేసారి ఆధ్యాత్మిక శిఖరంపై తళుక్కున మెరిశారు. ఒకరు అత్యున్నత భారతమాత దివ్యతత్వాన్ని ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఎలా చేరుకోవచ్చో వివరిస్తే, మరొకరు అంతర్ముఖమైన ఆలోచనలను సైతం గమనించే సాక్షిని, ఎఱుకను, ప్రజ్ఞను అందించారు. ఈ రెండు మార్గాలు వేర్వేరుగా ‘అంతర్‌-బహి’తత్వాలకు ప్రతిరూపంగా కన్పించినా లోపల బయట ఉన్న ‘ఆత్మతత్వం’ ఒక్కటే అని నిరూపించారు. ఇద్దరూ అద్వైత తత్త్వాన్ని ఆచరణలో చూపించిన వారే కావడం గమనార్హం. వీరిలో ఒకరు ఉత్తరభారతంలో పుట్టి ప్రపంచం నలుమూలలా చుట్టి వస్తే, మరొకరు దక్షిణ భారతంలో జన్మించి ఉన్న చోటు నుంచే జగమంతా ఆత్మవిచారణకు బీజావాపనం చేశారు.


భారతదేశంలో గ్రంథకర్తల పేర్లను తెలుసుకోవడం చాలా కష్టమన్నారు స్వామి వివేకానంద. ‘‘మన తత్వశాస్త్రాలను రచించిన గ్రంథకర్తలు, పురాణాలు రచించిన వారు ఎవరో ఎవరికి ఎఱుక? వారిని వ్యాసుడనీ, కపిలుడనీ ఏదో ఒక సామాన్య నామంతో వ్యవహరించారు. నిజంగా వారు శ్రీకృష్ణుని బిడ్డలు! వారు నిజంగా గీతానుష్ఠానపరులు! ‘కర్యణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే సూత్రాన్ని అనుసరించి వర్తించారు’’ అన్నారు.  మనిషిలో దేహం, మనసే కాకుండా ఆత్మ అనే మూడోది ఉందని.. అది దివ్యమైందని, అన్ని శక్తులనూ అది లోపల ఇముడ్చుకోగలదని వివేకానందుడు తన ‘యతిబోధ’, చేశాడు. అదే ఆత్మను పట్టుకొన్న రమణ మహర్షి.. ‘అహంకారం లేని ‘నేను’ అన్నదే సాక్షాత్కారం. అలాంటి ‘నేను’ను అనుభవించడమే శాంతి. ఇద్దరు మహాత్ముల లక్ష్యం ఒకటే.

 -డా.పి.భాస్కర యోగి

Updated Date - 2020-12-07T09:33:58+05:30 IST