NRI కు మత్తుమందు ఇచ్చి.. ఇంట్లోని పనివాళ్లు చేసిన నిర్వాకమిది..

ABN , First Publish Date - 2021-10-24T19:04:31+05:30 IST

యజమానికి మత్తుమందు ఇచ్చి ఇంట్లోని వస్తువులను దోచుకెళ్లారు ఇద్దరు పనివాళ్లు. కొత్తగా ఇంట్లో పనిచేసేందుకు నియమించుకున్న ఇద్దరు యువకులు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు.

NRI కు మత్తుమందు ఇచ్చి.. ఇంట్లోని పనివాళ్లు చేసిన నిర్వాకమిది..

చంఢీగఢ్: యజమానికి మత్తుమందు ఇచ్చి ఇంట్లోని వస్తువులను దోచుకెళ్లారు ఇద్దరు పనివాళ్లు. కొత్తగా ఇంట్లో పనిచేసేందుకు నియమించుకున్న ఇద్దరు యువకులు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. చండీగఢ్‌లోని సెక్టార్ 36లో ఉన్న ఒక ఇంట్లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్వదేశంలో ఉంటున్న తల్లి వద్దకు వచ్చిన ఎన్నారై కుమారుడికి ఈ చేదు అనుభవం ఎదురైంది. తల్లి, కుమారుడు మత్తులోకి జారుకోగానే ఇంట్లోని నగదు, ఫోన్‌లు, నగలు, ఇతర గృహోపకరణాలతో ఆ ఇద్దరు పనివాళ్లు జంప్ అయ్యారు. సాయంత్రం బాధితులు స్పృహలోకి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 


వివరాల్లోకి వెళ్తే.. గురువారం సాయంత్రం సురీందర్ పాల్ సింగ్ (69) అనే ఎన్నారై తన తల్లి సర్వజీత్ కౌర్ (89) నివాసం ఉంటున్న పెహోవాలోని సెక్టార్ 36లో ఉన్న ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఆమె వద్ద నేపాల్‌కు చెందిన  సోనూ థాపా(19)తో పాటు మరో యువకుడు పనివాళ్లుగా ఉన్నారు. నెల క్రితమే సోనూను ఇంట్లోని పని కోసం సర్వజీత్ కౌర్ నియంచుకున్నారు. అనంతరం అతని అభ్యర్థన మేరకు వారం కిందట మరో యువకుడు పనిలో చేరాడు. ఈ క్రమంలో ఇంట్లో వృద్ధురాలు ఒకతే ఉండడం గమనించిన వారిద్దరి కన్ను అక్కడి విలువైన వస్తువులు, నగలు, డబ్బు మీద పడింది. దాంతో పెద్దావిడాకు మత్తుమందు ఇచ్చి వాటిని దోచుకెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే, ఉన్నట్టుండి గురువారం విదేశాల నుంచి ఆమె కుమారుడు సురీందర్ కూడా రావడంతో వారి ప్లాన్ బెడిసి కొట్టింది. 


అనంతరం రెండు రోజుల తర్వాత అదే ప్లాన్‌ను అమలు చేశారు. శనివారం ఉదయం తల్లి, కొడుకుకు ఇచ్చిన టీలో మత్తుమందు కలిపేశారు. అది తాగిన వారిద్దరూ అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. ఇదే అదునుగా భావించిన సోనూ, మరో యువకుడు ఇంట్లోని నగదు, ఫోన్‌లు, నగలు, ఇతర విలువైన గృహోపకరణాలతో అక్కడి నుంచి ఊడాయించారు. శనివారం సాయంత్రం సురీందర్, సర్వజీత్ స్పృహలోకి వచ్చారు. కళ్లు తెరిస్తే ఇంట్లోని విలువైన వస్తువులు, నగదు, ఆభరణలు, మొబైల్ ఫోన్స్ కనిపించలేదు. సోనూ, మరో యువకుడికి కోసం వెతికిన వారు కనిపించలేదు. దాంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసుల విచారణలో ఈ ఇద్దరినీ ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా నియమించబడ్డారని తెలిసింది. ప్రస్తుతం పరారీలో వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2021-10-24T19:04:31+05:30 IST