Americaలో భారతీయులపై వరుస దాడులు.. 10 రోజుల క్రితం జరిగిన ఘటన మరువక ముందే..

ABN , First Publish Date - 2022-04-13T22:40:20+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులపై జాత్యహంకార దాడులు పెరుగుతున్నాయి. పది రోజుల క్రితం జరిగిన ఘటన మరువక ముందే మళ్లీ అదే ప్రదేశంలో మరో ఇద్దరు భారతీయులపై దాడి జరిగింది. ఈ ఘట

Americaలో భారతీయులపై వరుస దాడులు.. 10 రోజుల క్రితం జరిగిన ఘటన మరువక ముందే..

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులపై జాత్యహంకార దాడులు పెరుగుతున్నాయి. పది రోజుల క్రితం జరిగిన ఘటన మరువక ముందే మళ్లీ అదే ప్రదేశంలో మరో ఇద్దరు భారతీయులపై దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

  

మంగళవారం ఉదయం వాకింగ్ కోసం బయటికెళ్లిన సిక్కు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై రిచ్మండ్ హిల్స్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యారు. ఈ దాడిలో ఒకరికి రక్తస్రావం కూడా జరిగింది. బాధితులకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి కాస్తా వైరల్‌గా మారాయి. దాదాపు 10 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో సిక్కు సామాజిక వర్గానికి చెందిన 70ఏళ్ల నిర్మల్ సింగ్‌పై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో నిర్మల్ సింగ్ ముక్కు విరిగిపోయింది. ఈ ఏడాది జనవరిలో అమెరికా విడిచి వెళ్లిపోవాలంటూ.. జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై తెల్లజాతీయుడు  దాడి చేశాడు. 



ఇదిలా ఉంటే.. సిక్కు మతస్థులపై జరుగుతున్న వరుస దాడుల పట్ల న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా విచారణ జరుపుతున్న అధికారులతోపాటు కమ్యూనిటీ సభ్యులతో కూడా  టచ్‌లో ఉన్నట్టు తెలిపింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేసినట్టు వెల్లడించింది. బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలవనున్నట్లు చెప్పింది. ఈ ఘటనపై స్పందించిన న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నీఫర్ రాజ్‌కుమార్ (న్యూయార్క్ స్టేట్ ఆఫీస్‌కు ఎన్నికైన తొలి పంజాబీ అమెరికన్) దాడిని ఖండించారు. గత కొన్నేళ్లుగా సిక్కు కమ్యూనిటీ ప్రజలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఢిల్లీకి చెందిన సిక్కు లీడర్ మంజిదర్ సింగ్ సిర్సా ఈ దాడిపై స్పందిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.




Updated Date - 2022-04-13T22:40:20+05:30 IST