ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా

ABN , First Publish Date - 2021-03-01T06:48:20+05:30 IST

సెల్ఫీ సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను..

ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
విద్యార్థులు మునిగిపోయిన ఏలేరు కాలువ

స్వీయ చిత్రం తీసుకుంటుండగా ఏలేరు కాలువలో పడి ఇద్దరు విద్యార్థుల మృతి 

మరణంలోనూ వీడని స్నేహ బంధం

కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు


గొల్లప్రోలు(తూర్పు గోదావరి): సెల్ఫీ సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. కాలువలో పడి గల్లంతైన వారు తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. వివరాలు ఇలా వున్నాయి... గొల్లప్రోలు-పిఠాపురం పట్టణాల మధ్య గల ఏలేరు (గొర్రిఖండి) కాలువ వద్దకు పిఠాపురంలోని భారతి హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఆదివారం వచ్చారు. సెలవు రోజు కావడంతో సరదాగా ఫొటోలు తీసుకుందామని భావించి కొండమహంతి వాసు (16), వేణుం తేజ (16), నడిపల్లి గణేష్‌ (17), కూరాకుల భాను (15), తమ్మనబోయిన వెంకటసాయి (16) కాలువ రక్షణ గోడ వద్దకు వెళ్లారు. మొబైల్‌లో సెల్ఫీలు తీసుకుంటుండగా తేజ కాలువలో పడిపోయాడు. అతడిని రక్షించేందుకు వాసు కాలువలోకి దిగాడు. దీంతో ఇద్దరూ గల్లంతయ్యారు. ఏలేరు కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడం, లోతుగా ఉండడంతో వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పోలీసులు, స్థానికులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. గొల్లప్రోలు కాలువ కళింగల్‌ వద్ద తేజ మృతదేహం లభ్యమయ్యింది. గజ ఈతగాళ్లతో తీవ్ర గాలింపు అనంతరం రాత్రి 9 గంటల సమయంలో వాసు మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఇద్దరు విద్యార్థుల కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. 


తేజ తండ్రి శ్రీను ఆటోడ్రైవర్‌. శిష్టికరణాల వీధిలో నివాసముంటున్నారు. వేణుతో పాటు పాప ఉంది. ఆడుకోవడానికి అని వెళ్లిన తేజ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న విషయం తెలుసుకుని శ్రీను కుటుంబసభ్యులు విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. ఒక్కగానొక్క కొడుకు వాసు కాలువలో మునిగిపోయడని తెలుసుకున్న కొండమహంతి చిన్నబాబు కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్నబాబు తాపీమేస్త్రీగా పని చేస్తున్నాడు. తేజ, వాసు మంచి స్నేహితులని, మరణంలోనూ విడవలేదని తోటి విద్యార్థులు చెప్తున్నారు. గొల్లప్రోలు, పిఠాపురం ఎస్‌ఐలు రామలింగేశ్వరరావు, శంకరరావు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలను పర్యవేక్షించారు.


గొల్లప్రోలు తహశీల్దారు వి.అమ్మాజీ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన ప్రమాదస్థలి అయిన కాలువను పరిశీలించారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థి తేజ మృతదేహాన్ని పరిశీలించి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ కూడా పరామర్శించారు.

Updated Date - 2021-03-01T06:48:20+05:30 IST