ISI terror module: ఇద్దరు ఉగ్రవాదులకు పాక్‌లో శిక్షణ

ABN , First Publish Date - 2021-09-15T15:47:45+05:30 IST

నవరాత్రి, రామలీల ఉత్సవాల సందర్భంగా దేశంలో ఉగ్ర దాడులకు వ్యూహం పన్నిన ఉగ్రవాదుల్లో ఇద్దరికి పాకిస్థాన్ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని వెల్లడైంది...

ISI terror module: ఇద్దరు ఉగ్రవాదులకు పాక్‌లో శిక్షణ

న్యూఢిల్లీ : నవరాత్రి, రామలీల ఉత్సవాల సందర్భంగా దేశంలో ఉగ్ర దాడులకు వ్యూహం పన్నిన ఉగ్రవాదుల్లో ఇద్దరికి పాకిస్థాన్ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని వెల్లడైంది. ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం జాన్ మహ్మద్ షేక్ అలియాస్ 'సమీర్', ఒసామా, మూల్‌చంద్, జీషన్ ఖమర్, మొహమ్మద్ అబూ బకర్, మొహమ్మద్ అమీర్ జావేద్‌లనే ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీరిలో ఒసామా, ఖమర్ లు పాకిస్థాన్ శిక్షణ పొంది ఐఎస్ఐ సూచనల మేర పనిచేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులకు పాక్ ఐఎస్ఐ ఏకే -47 రైఫిళ్లతోపాటు పేలుడు పదార్థాలు, తుపాకుల ఉపయోగించడంపై శిక్షణ ఇచ్చింది. 


ఈ శిక్షణ కోసం ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థాన్ వెళ్లి తిరిగి వచ్చారని ఢిల్లీ ప్రత్యేక పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ ఠాకూర్ చెప్పారు. షేక్‌ను రాజస్థాన్‌లోని కోటా సమీపంలో, ఒసామాను ఢిల్లీలోని ఓఖ్లా నుంచి, బకర్‌ను సరాయ్ కాలే ఖాన్ నుంచి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖమర్ అలహాబాద్ నుంచి, లక్నో నుంచి జావేద్, రాయ్ బరేలీ నుంచి మూల్‌చంద్ లను పట్టుకున్నామని డీసీపీ ప్రమోద్ సింగ్ కుశ్వాహ్ చెప్పారు. ఈ ఉగ్రవాదులకు అండర్ వరల్డ్ మాఫియాతో కూడా సంబంధాలున్నాయని దర్యాప్తులో వెల్లడైంది. అండర్ వరల్డ్ ఆపరేటివ్ సమీర్, అనీస్ ఇబ్రహీంకి సన్నిహితుడని అని పోలీసులు తెలిపారు. 


అతను అండర్ వరల్డ్ ఆపరేటివ్‌లతో సంబంధం ఉన్న పాక్ ఆధారిత వ్యక్తితో టచ్‌లో ఉన్నాడని చెప్పారు. ఉగ్రవాదులకు హవాలా మార్గాల ద్వారా ఆయుధాలు,పేలుడు పదార్థాల రవాణా,టెర్రర్-ఫండింగ్ వంటి పనులను అప్పగించారని తేలింది.ఒసామా, ఖమర్ లు మొదట మస్కట్‌కు వెళ్లి, ఆపై సముద్ర మార్గం ద్వారా పాకిస్థాన్‌లోని గ్వదార్ పోర్టు సమీపంలోని జియోని పట్టణానికి తీసుకెళ్లారు, అక్కడ నుంచి వారిని పాకిస్థాన్‌లోని తట్టాలోని ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారు.ఒసామా, ఖమర్‌లకు జబ్బార్ ,హమ్జాలు శిక్షణ ఇచ్చినట్లు పోలీసు అధికారి తెలిపారు.పాక్ మిలటరీ ఆర్మీకి చెందిన వారు వీరికి శిక్షణ ఇచ్చారని దర్యాప్తులో వెలుగుచూసింది.


Updated Date - 2021-09-15T15:47:45+05:30 IST