Corona : భయం.. భయంగా.. సరిగ్గా రెండేళ్ల క్రితం.. ‘గాంధీ’కి తొలి కరోనా కేసు

ABN , First Publish Date - 2022-03-03T12:55:23+05:30 IST

2020 మార్చి 3.. నగర వాసులకు పీడకలగా మారిన రోజు. 2వ తేదీ వరకు నిశ్చింతగా ఉన్న..

Corona : భయం.. భయంగా.. సరిగ్గా రెండేళ్ల క్రితం.. ‘గాంధీ’కి తొలి కరోనా కేసు

  • నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్న సిబ్బంది
  • ఆస్పత్రికి జాతీయ స్థాయి గుర్తింపు
  • వీడియో కాల్‌లో మాట్లాడిన ప్రధాని

2020 మార్చి 3.. నగర వాసులకు పీడకలగా మారిన రోజు. 2వ తేదీ వరకు నిశ్చింతగా ఉన్న నగరవాసుల గుండెల్లో పిడుగుపడిన రోజు. మహీంద్రహిల్స్‌లో ఓ వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌ నగర వాసులను ఆందోళన పరిచినరోజు.  ఆ తర్వాత నగరంలో కొవిడ్‌ కేసుల గ్రాఫ్‌ రోజురోజుకూ పెరిగింది. ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. గాంధీ ఆస్పత్రిని నోడల్‌ కేంద్రంగా ఏర్పాటు చేశారు. తొలి కరోనా కేసు నుంచి నేటివరకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అందించిన సేవలు ప్రశంసలను అందుకున్నాయి. తొలి కేసు నమోదైన రోజును పురస్కరించుకొని బుధవారం ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నాటి భయాందోళన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.


హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : నగరంలో తొలి కరోనా కేసు నమోదు అయి నేటికి సరిగ్గా రెం డేళ్లు అవుతోంది. మహీంద్రహిల్స్‌కు చెందిన ఒకరు  దుబాయ్‌ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చా డు. అక్కడి ఎయిర్‌పోర్టులో టెస్ట్‌ చేసి రిపోర్టు కోసం పుణె పంపించారు. రిపోర్టు వచ్చేందుకు రెండు రోజుల సమయం ఉండడంతో నగరానికి బస్సులో వచ్చాడు. ఈ లోపు రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది. బెంగళూరు అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి మార్చి 2 అర్ధరాత్రి వేళకు విషయం తెలియజేశారు. అక్కడినుంచి గాంధీ ఆస్పత్రికి సమాచారం అందింది. వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రి వైద్యులు అతన్ని తీసుకువచ్చేందుకు సిద్ధం కాగా.. టెస్ట్‌ రిపోర్టు మెస్సేజ్‌ ఫోన్‌కు రావడంతో రామతేజ స్వయంగా తెల్లవారుజామున చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చి వైద్యులను కలిశాడు. తెల్లవారే సరికి విషయం దావానలంలా వ్యాపించడంతో నగరం ఉలిక్కిపడింది. 


కొవిడ్‌ తొలికేసు నమోదైన రోజును పురస్కరించుకుని  బుధవారం గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్యుల సమ్మేళనంలో గుర్తు చేసుకున్నారు. 2020 మార్చి 3న తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మొదటి కరోనా కేసు ఆస్పత్రికి రాగానే నర్సులు, వైద్యులు, సిబ్బంది, శానిటేషన్‌ సిబ్బంది, సెక్యూరిటీగార్డులు పోలీసులు భయపడిన తీరును గుర్తుచేసుకున్నారు. ఒక్కొక్కరు ఆ రోజు విధులు నిర్వహించిన తీరును వివరించారు. కొవిడ్‌ కారణంగానే మృత్యువాత పడిన గాంధీ సిబ్బంది పేషెంట్‌ కేర్‌ స్వరూప, ఎంఆర్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న బాలరాజు, నర్సుల కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ నర్సింహారావు నేత, డాక్టర్‌ శోభన్‌బాబు, ఆర్‌ఎంఓ 1 డాక్టర్‌ జయకృష్ణ,  అలూమ్ని అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు లింగయ్య, అధ్యక్షుడు డాక్టర్‌ గురుమూర్తి, డాక్టర్‌ సంపత్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ మంగమ్మ, డాక్టర్‌ రంగనాథ్‌, డాక్టర్‌ రాథోడ్‌, లయన్స్‌ క్లబ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌, పల్మనాలజిస్టు డాక్టర్‌ కృష్ణమూర్తి  పాల్గొన్నారు.


అమరుల స్తూపం ఏర్పాటు చేస్తాం.. 

కొవిడ్‌ సమయంలో గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తూ అదే వ్యాధితో చనిపోయిన వారికి స్మారక చిహ్నంగా ఆస్పత్రి ఆవరణలో అమరుల స్తూపం ఏర్పాటు చేస్తాం. వైద్యులు బాధ్యత తీసుకుని ఆస్పత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం చేయించి ప్రజల ప్రాణాలు నిలబెట్టారు. ఆ ఘనత గాంధీకి దక్కింది. - డీఎంఈ డాక్టర్‌ రమేష్‌


ఆస్పత్రికి మంచి పేరు వచ్చింది 

తొలి కొవిడ్‌ కేసుపై కాస్త భయం ఉన్నప్పటికీ ధైర్యంతో వైద్యసేవలందించాలని బృందాన్ని ఏర్పాటు చేశాం. తక్కువ సమయంలోనే అతను కోలుకోవడంతో ఊపిరిపీల్చుకున్నాం. ఆ సమయంలో వైద్యులు, నర్సులు, సిబ్బంది, ఇతర విభాగాల సిబ్బంది తమకు తోడుగా ఉండడం వల్ల వైద్యం చేయగలిగాం. జాతీయ స్థాయిలో గాంధీ ఆస్పత్రికి మంచి గుర్తింపు వచ్చింది. ఆర్మీ రేంజ్‌ అధికారులు ఆకాశంలోంచి హెలీకాప్టర్‌తో పూలవర్షం కురిపించడం, ప్రధాన మంత్రి మోదీ వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో మాట్లాడడం ఆనందంగా అనిపించింది.  - డాక్టర్‌ రాజారావు (సూపరింటెండెంట్‌)


రెండేళ్లు ఇంటిని వదిలి రోగుల సేవలోనే ఉన్నా..

గాంధీ ఆస్పత్రి కొవిడ్‌ నోడల్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇక్కడే విధుల్లోనే ఉన్నా. రెండేళ్లు ఇల్లు వాకిలి విడిచిపెట్టి గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావుతోనే ఉండిపోయాం. కొవిడ్‌ సమయంలో దాదాపు 85వేల మందికి వైద్య పరీక్షలు చేశాం. కొవిడ్‌ ఆస్పత్రిగా ఇండియాలోనే గాంధీకి మంచి పేరు రావడం ఆనందంగా ఉంది. - డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి (కొవిడ్‌ నోడల్‌ అధికారి)


వైద్యులే దేవుళ్లయ్యారు

గాంధీ ఆస్పత్రిలో కొవిడ్‌ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. వైద్యం కోసం వచ్చిన వారందరినీ ఆస్పత్రికిలోకి అనుమతించారు. అటెండర్లు లోపలికి రాకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నాం. కోట్లు సంపాదించిన కుటుంబంలో పుట్టిన వారు చనిపోయినా చూసేందుకు సైతం రాలేని పరిస్ధితి. ఆ సమయంలో వైద్యులే దేవుళ్లయ్యారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌, నోడల్‌ అధికారి ఇరవై నాలుగు గంటలు ఆస్పత్రిలోనే ఉంటూ రౌండ్‌ ద క్లాక్‌లో వైద్యులకు సూచనలివ్వడం, సిబ్బంది బాధ్యతగా తీసుకుని పనిచేయడంతోనే జాతీయ స్థాయిలో ఆస్పత్రికి మంచి పేరు వచ్చింది. - సంజయ్‌, సీఐ, ముషీరాబాద్‌.

Updated Date - 2022-03-03T12:55:23+05:30 IST