‘జల’కలేనా?

ABN , First Publish Date - 2021-05-29T04:50:40+05:30 IST

పంటలు పుష్కలంగా పండాలంటే పుడమి తడవాలి. అందుకు అవసరమైన నీటి వనరులు ఉండాలి. ఈ సదుపాయం లేనిచోట వేలాది ఎకరాలు బీడుగా మారుతున్నాయి. పంట ఉత్పత్తులు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితులు చక్కదిద్దేందుకు ప్రభుత్వం రెండేళ్ల కిందట ‘వైఎస్సార్‌ జలకళ’ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రతి ఎకరాకు నీరందించేలా బోర్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని లక్ష్యాలను నిర్దేశించింది. ఈ మేరకు రైతుల నుంచి రైతులు దరఖాస్తులు స్వీకరించారు. కానీ రెండేళ్లు గడుస్తున్నా ఈ పఽథకానికి మోక్షం కలగడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం ‘నీరు’గారుతోంది. రైతులు ‘బోరు’మంటున్నారు.

‘జల’కలేనా?
బోరు తవ్వకాలు చేస్తున్న దృశ్యం

పథకానికి కానరాని మోక్షం

రెండేళ్లుగా తప్పని నిరీక్షణ

‘బోరు’మంటున్న రైతులు

(రాజాం)

పంటలు పుష్కలంగా పండాలంటే పుడమి తడవాలి. అందుకు అవసరమైన నీటి వనరులు ఉండాలి. ఈ సదుపాయం లేనిచోట వేలాది ఎకరాలు బీడుగా మారుతున్నాయి. పంట ఉత్పత్తులు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితులు చక్కదిద్దేందుకు ప్రభుత్వం రెండేళ్ల కిందట ‘వైఎస్సార్‌ జలకళ’ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రతి ఎకరాకు నీరందించేలా బోర్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని లక్ష్యాలను నిర్దేశించింది. ఈ మేరకు రైతుల నుంచి రైతులు దరఖాస్తులు స్వీకరించారు. కానీ రెండేళ్లు గడుస్తున్నా ఈ పఽథకానికి మోక్షం కలగడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం ‘నీరు’గారుతోంది. రైతులు ‘బోరు’మంటున్నారు. 

-------------

జలకళ పథకం కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాలో ఆశించిన స్థాయిలో భూగర్భ జలాలు ఉండి.. సాగునీటి వనరులు అందుబాటులో లేని ప్రాంతాలకు జలకళ  పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  సచివాలయాల ద్వారా రైతుల నుంచి  దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించింది. అధికారులు వాటిని పరిశీలించి అనుమతి ఇచ్చిన తర్వాత బోర్లు వేయాలని.. కొన్ని కేటగిరీలకు విద్యుత్‌ సౌకర్యంతో మోటారు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సమ్మతించింది. గత ఏడాది సెప్టెంబరు 28న సీఎం జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. ముందుగా ఐదెకరాల పొలం ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించారు. కానీ ఈ పథకంపై ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో కాస్త వెసులుబాటు కల్పించారు. రెండున్నర ఎకరాలు కలిగిన రైతులు కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలో ఇప్పటివరకూ 6,620 దరఖాస్తులు రాగా.. వీఆర్వోలు 4,663 ఆమోదించారు. సర్వే కోసం ఏజెన్సీలకు 4,636 దరఖాస్తులు పంపారు. 481 బోర్లకు అనుమతి ఇవ్వగా... 209  మాత్రమే ఏర్పాటు చేశారు. మిగిలిన దరఖాస్తులకు  అనుమతి రావాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా.. ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్లు డ్రిల్లింగ్‌ చేయడానికి అనుమతులు మంజూరు చేయడం లేదని వాపోతున్నారు. అర్హులకే ప్రయోజనం దక్కేలా.. దరఖాస్తులన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొంత జాప్యమవుతోందని పేర్కొంటున్నారు. మరోవైపు కొవిడ్‌ వ్యాప్తిని సాకుగా చూపుతున్నారు.


ప్రక్రియ ఇలా.. 

జలకళ పథకం కింద ఐదెకరాలకు పైగా ఉన్న రైతులకు బోరు (డ్రిల్లింగ్‌) ఉచితంగా వేస్తారు. మిగిలిన వసుతులు రైతులే ఏర్పాటు చేసుకోవాలి. ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులు బృందగా ఏర్పడి మందుకు వచ్చినా అనుమతులు ఇస్తారు. వీరికి బోరు, మోటారు, ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. ఈ పథకానికి సంబంధించి గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అవి వీఆర్వో లాగిన్‌కు చేరుతాయి.  ఆ రైతు పేరున భూమి ఉందా? లేదా? అనే విషయాన్ని వీఆర్వో పరిశీలించి నిర్ధారిస్తారు. తర్వాత ఏపీడీ లాగిన్‌కు ఆమోదించిన తర్వాత కాంట్రాక్టర్లకు పంపుతారు. హైడ్రో జియోలాజికల్‌, జియోలాజికల్‌ సర్వేచేసి భూగర్భ జలాల అనుకూలతను గుర్తిస్తారు. ఆశాజనకంగా ఉంటే డ్వామా పీడీకి నివేదిస్తారు. కలెక్టర్‌ ఆమోదం తీసుకొని డ్రిల్లింగ్‌కు పీడీ అనుమతి ఇస్తారు. రైతులకు అర్హత లేకపోయినా, భూగర్భ జలాలు సమృద్ధిగా లేదని తేలినా దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఈ ప్రక్రియపై వీఆర్వోలు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో రైతులకు న్యాయం జరగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి బోర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.  


 కరోనా కారణంగా జాప్యం 

జలకళ పథకం కింద బోర్లు వేయడానికి కరోనా కారణంగా కొంత జాప్యమవుతోంది.  త్వరగా డ్రిల్లింగ్‌ పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు  నిర్దేశించాం. చాలామంది కొవిడ్‌ బారిన పడడంతో పనులు సాగడం లేదు. లక్ష్యం మేరకు బోర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. 

 - హెచ్‌.కూర్మారావు, డ్వామా పీడీ, శ్రీకాకుళం

Updated Date - 2021-05-29T04:50:40+05:30 IST