విద్యుత షాక్‌తో ఇద్దరు యువకులు మృతి

ABN , First Publish Date - 2021-03-07T05:37:19+05:30 IST

వేంపల్లె మండలంలో విద్యుత షాక్‌కు గురై ఇద్దరు యువకులు మృతిచెందారు. అందులో ఓ యువకుడికి 11నెలల క్రితమే వివాహం కాగా భార్య ఆరు నెలల గర్భిణి. వేంపల్లె మండలం అలిరెడ్డిపల్లె సమీపంలో చోటుచేసుకున్న

విద్యుత షాక్‌తో ఇద్దరు యువకులు మృతి
అమీర్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

వేంపల్లె, మార్చి 6: వేంపల్లె మండలంలో విద్యుత షాక్‌కు గురై ఇద్దరు యువకులు మృతిచెందారు. అందులో ఓ యువకుడికి 11నెలల క్రితమే వివాహం కాగా భార్య ఆరు నెలల గర్భిణి. వేంపల్లె మండలం అలిరెడ్డిపల్లె సమీపంలో చోటుచేసుకున్న విషాద ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

వేంపల్లెలోని కాలేజీ రోడ్డులో ఉంటున్న శివశంకరయ్య కుమారుడు మంగపట్నం మహేష్‌(20) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదేవీధిలో ఉంటున్న పఠాన ఖాసీం కుమారుడు అమీర్‌(21) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. శనివారం ఇరువురు చేపల కోసమని పాపాఘ్ని అవతల ఉన్న అలిరెడ్డిపల్లె సమీపంలోని కప్పలమడుగు వద్దకు వెళ్లారు. కప్పలమడుగు సమీపంలో రైతులు పొలాల్లో మోటర్ల కోసం లాగిన విద్యుత తీగలు నేలపై ఉన్నాయి. వాటిలో కొన్ని జాయింట్‌లు ఊడిపోయి ఉన్నాయి. ఇది గమనించని యువకులు వాటిని తొక్కడంతో విద్యుత షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. పఠాన అమీర్‌కు రజియాతో 11 నెలల క్రితం వివాహం కాగా ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి. భర్త మృతిచెందడంతో ఆ భార్య రోదన చూపరులను కంటతడిపెట్టించింది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా సంఘటన స్థలాన్ని స్థానిక సీఐ వెంకటేశ్వర్లు సందర్శించి మృతదేహాలను పరిశీలించారు. కుటుంబ సభ్యులను విచారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విద్యుత ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 



Updated Date - 2021-03-07T05:37:19+05:30 IST