లంగ్‌ కేన్సర్‌!

May 18 2021 @ 11:44AM

ఆంధ్రజ్యోతి(18-05-2021)

సిగరెట్లలో 4 వేలకు పైగా రసాయనాలు, 60కి పైగా కేన్సర్‌ కారకాలు ఉంటాయి. పొగాకు ఉత్పత్తులను ఏ రూపంలో వాడినా కేన్సర్‌ వచ్చే ప్రమాదం 20% ఎక్కువ. పైగా ఊపిరితిత్తుల కేన్సర్‌ తేలికగా ఇతర శరీరావయవాలకు వ్యాపిస్తుంది. కాబట్టే లంగ్‌ కేన్సర్‌కు గురైనవాళ్లు ఐదేళ్లకు మించి బతికి ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ కేన్సర్‌ గురించి పూర్తి అవగాహన ఏర్పరుచుకోవడం ఎంతో అవసరం.


ధూమపానం, రేడాన్‌ గ్యాస్‌, ఆస్‌బెస్టాస్‌, వాతావరణ కాలుష్యం కూడా లంగ్‌ కేన్సర్‌కు దారి తీయవచ్చు. కేన్సర్‌ తీవ్రతను బట్టి లక్షణాలు ఉంటాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం, తీవ్రమైన దగ్గు, దగ్గుతో పాటు రక్తం, ఆకలి, బరువు తగ్గడం, అలసట, ఛాతీలో, పొట్టలో నొప్పి, మింగడం కష్టంగా ఉండడం సాధారణ లంగ్‌ కేన్సర్‌ ప్రధాన లక్షణాలు.


లంగ్‌ కేన్సర్‌లో  రకాలు

స్మాల్‌ సెల్‌ లంగ్‌ కేన్సర్‌ (ఎస్‌సిఎల్‌సి), నాన్‌ స్మాల్‌ సెల్‌ లంగ్‌ కేన్సర్‌ (ఎన్‌ఎ్‌ససిఎల్‌సి), కేన్సర్‌ వచ్చిన ఇతర అవయవం నుంచి వ్యాప్తి చెందేవి. 45 ఏళ్లు పైబడిన స్త్రీపురుషుల్లో ధూమపానం అలవాటు ఉన్నట్టైతే ఈ కేన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువ. తాగే నీళ్లలో ఆర్సెనిక్‌ ఎక్కువగా ఉన్నా లంగ్‌ కేన్సర్‌కు గురవవచ్చు. 


పరీక్షలు

చెస్ట్‌ ఎక్స్‌రే, బయాప్సీ, సిటి స్కాన్‌, పెట్‌ సిటి స్కాన్‌ ప్రధాన పరీక్షలు. కళ్లెను పరీక్షించడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరును తెలిపే స్పైరోమెట్రీ, లంగ్స్‌ను ఎండోస్కోపీ పద్ధతిలో పరీక్షించే బ్రాంఖోస్కోపీ, రక్తపరీక్షలు కూడా చేసి కేన్సర్‌ లంగ్స్‌లో ఏ ప్రాంతంలో తలెత్తిందో, దాని దశ, గ్రేడ్‌లను కూడ నిర్ధారించి చికిత్స మొదలుపెడతారు. 


చికిత్స

ముందుగా కేన్సర్‌ను గుర్తిస్తే లోబెక్టమీ చేసి, కేన్సర్‌ సోకిన భాగాన్ని తొలగిస్తారు. నాన్‌ స్మాల్‌ సెల్‌ లంగ్‌ కేన్సర్‌కు సర్జరీ చేస్తారు. కానీ ఎక్కువగా వ్యాపించే గుణం ఉన్న స్మాల్‌ సెల్‌ లంగ్‌ కేన్సర్‌కు రేడియోథెరపీ, కీమోథెరపీ ఇస్తారు. సర్జరీ చేసిన పక్షంలో, తర్వాత ఈ చికిత్సలు ఎంత కాలం ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. వయసు పెద్దదై, కేన్సర్‌ను చివరి దశల్లో గుర్తించినప్పుడు వ్యాధి తీవ్రతను తగ్గించి, నాణ్యమైన జీవితం గడిపే పాలియేటివ్‌ కేర్‌ను అందిస్తారు. 


క్షయను పోలిన లక్షణాలు!

ధూమపానం మానేయడం, కాలుష్యానికి దూరంగా ఉండడం, వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యాలను తగ్గించగలిగితే ఊపిరితిత్తులు పదిలంగా ఉన్నట్టే! కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించలేకపోవడానికి కారణం లంగ్‌ కేన్సర్‌ లక్షణాలు క్షయను పోలి ఉండడమే! దాంతో కేన్సర్‌ను క్షయగా పొరపాటు పడి చికిత్సను కొనసాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో అసలు వ్యాధికి చికిత్స ఆలస్యమై కేన్సర్‌ మరింత ముదిరిపోయే ప్రమాదం ఉంటూ ఉంటుంది. కాబట్టి కేన్సర్‌, క్షయ... ఈ రెండు వ్యాధులను ప్రారంభంలోనే కనిపెట్టడం అవసరం. ఇందుకోసం లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్షలతో అసలు సమస్యను నిర్ధారించుకుని, చికిత్సను కొనసాగించాలి. 


-డాక్టర్‌ సిహెచ్‌. మోహన వంశీ చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 9848011421

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.