వాహనాల వేగం యూటర్న్‌

ABN , First Publish Date - 2022-08-18T06:02:26+05:30 IST

మహా నగరంలో వాహనదారుడి సగటు వేగం గంటకు కేవలం పది కిలోమీటర్లు మాత్రమే. కొన్ని సందర్భాల్లో అదీ అనుమానమే.

వాహనాల వేగం  యూటర్న్‌

గంటకు 10 కి.మీ..?

డ్రైవింగ్‌ కన్నా.. వెయిటింగే ఎక్కువ

ఒక్కో జంక్షన్‌లో మూడు నిమిషాలు

యూటర్న్‌లతో 50 లక్షల కి.మీ. అధిక ప్రయాణం.. 

 వాహనదారులపై ఇం‘ధన’పు భారం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మహా నగరంలో వాహనదారుడి సగటు వేగం గంటకు కేవలం పది కిలోమీటర్లు మాత్రమే. కొన్ని సందర్భాల్లో అదీ అనుమానమే. ట్రాఫిక్‌లో వాహనాలు నడపడం కన్నా, సిగ్నళ్ల వద్ద వెయిటింగ్‌, అకారణంగా కిలోమీటర్ల కొద్దీ చుట్టూ తిప్పే యూటర్న్‌లతో  ఈ దుస్థితి ఏర్పడుతోంది. నగరంలో గంటకు సగటున 20 నుంచి 25 కిలోమీటర్లకు వాహన వేగాన్ని పెంచినట్లు ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. భారీ ట్రాఫిక్‌ జామ్‌లకు తోడు, కొత్తగా పుట్టుకొస్తున్న సిగ్నళ్లు, జంక్షన్లను మూసేసి, ఏర్పాటు చేస్తున్న యూటర్న్‌లతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.  

ఇం‘ధనం’ వృథా

సిగ్నల్‌ ఫ్రీ పేరిట జంక్షన్లను మూసేసి యూటర్న్‌లను ఏర్పాటు చేశారు. వీటి వల్ల నగరంలోని వాహనాలన్నీ సగటున కిలోమీటర్‌ ఎక్కువగా తిరుగుతున్నాయని అంచనా. రోజూ 50 లక్షలకు పైగా వాహనాలు 50 లక్షల కిలోమీటర్ల అదనంగా తిరగాల్సి వస్తోంది. చిన్నా పెద్ద వాహనాలను కలిపి సగటున కిలోమీటర్‌కు రూ. 5 ఖర్చు అని భావించినా, రూ. 2.5కోట్ల ఇంధనం యూటర్న్‌ల కారణంగా వృథా అవుతోందని వాహన దారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదాల పేరు చెప్పి తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుంది వంటి గణాంకాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. సిబ్బందిని నియమించడంతో పాటు, వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని సూచిస్తున్నారు.

ఇదీ లెక్క..

దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఒకరు అమీర్‌పేట్‌లో పని చేస్తారు. బైకుపై వెళ్తే దూరం సుమారు 15కి.మీ. ట్రాఫిక్‌ గణాంకాల ప్రకారం (20కి.మీ/ప్రతి గంట) 45 నిమిషాల్లో చేరుకోవాలి. కానీ గమ్యస్థానం చేరేందుకు గంటన్నర పడుతోంది. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి బయలుదేరిన తర్వాత మూసారంబాగ్‌, చర్మాస్‌, నల్గొండ క్రాస్‌రోడ్‌, చాదర్‌ఘాట్‌ క్రాస్‌రోడ్స్‌, విమెన్స్‌ కాలేజీ, పుత్లీబౌలి, మొజంజాహిమార్కెట్‌, గాంధీభవన్‌, నాంపల్లి, పబ్లిక్‌గార్డెన్‌, లక్డీకాపుల్‌, ఖైరతాబాద్‌, ఎర్రమంజిల్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌ ఇలా సిగ్నళ్లన్నీ క్రాస్‌ చేయాల్సిందే. ప్రతీ సిగ్నల్‌ వద్ద కనీసం 3 నిమిషాలు పడుతుంది. ట్రాఫిక్‌ అధికారుల లెక్కల ప్రకారం 45 నిమిషాలకు తోడు వెయిటింగ్‌ సమయం కూడా కలుపుకుంటే, గంటకు 10 కిలో మీటర్లగా మాత్రమే ప్రయాణించినట్లు అవుతోంది. 

కొన్ని సందర్భాల్లో మనం ఓ వైపు ఆగుతాం. ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ట్రాఫిక్‌లో కిలోమీటర్‌ మేర ముందుకు ప్రయాణించి, అక్కడ యూటర్న్‌ తీసుకుని మళ్లీ కిలోమీటర్‌ వెనక్కి ప్రయాణం చేయాలి. అంటే రెండు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాలి. దీనివల్ల సమయం, ఇంధనం వృథా. ఇలాంటి సమస్యను నివారించాలంటే.. కీలక ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లు క్రాస్‌ చేయడానికి సబ్‌వేలు, స్కైవేలు ఏర్పాటు చేస్తే కొంతమేలు. అయితే, యూటర్న్‌ల వల్ల ప్రమాదాలు తగ్గాయని పోలీసులు చెబుతున్నారు.

కొన్ని జంక్షన్లలో ఇలా..

 అపోలో ఆస్పత్రి, ఫిలింనగర్‌ వైపు నుంచి జూబ్లీహిల్స్‌ వైపునకు వెళ్లేందుకు సీవీఆర్‌ క్రాస్‌రోడ్స్‌ వద్ద ఉన్న సిగ్నల్‌ వద్ద ప్రతి వాహనదారుడు కనీసం 10 నిముషాలు వేచి చూడాల్సిందే. బంజారాహిల్స్‌, టీఆర్‌ఎస్‌ భవన్‌ వరకు ట్రాఫిక్‌ జాం అవుతోంది. ఆటోమేటిక్‌ సిగ్నల్‌తో పాటు ట్రాఫిక్‌ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. కానీ వాహనదారుల సమస్యను పరిష్కరించలేక పోతున్నారు.

మెహిదీపట్నం నుంచి టోలిచౌకీ, టోలిచౌకీ నుంచి మెహిదీపట్నం వరకు వెళ్లే వాహనదారుల సమస్యలు మరింత జటిలంగా ఉన్నాయి. మెహిదీపట్నం నుంచి టోలీచౌకీ, టోలీచౌకీ నుంచి లంగర్‌హౌజ్‌ వైపు వెళ్లే వారు సాయంత్రం 4 గంటల తర్వాత రాత్రి 10 గంటల సమయంలో జంక్షన్‌ దాటాలంటే కనీసం పది నిమిషాలు పడుతుంది. 

ఆలివ్‌ ఆస్పత్రి వద్ద దుస్థితి మరింత దుర్భరంగా ఉంది. నానల్‌నగర్‌ నుంచి లంగర్‌హౌజ్‌, గుడిమల్కాపూర్‌ వైపు నుంచి నానల్‌నగర్‌ వైపు వెళ్లే వాహనదారుల క్యూ ఎప్పుడు చూసినా కిలోమీటర్‌ వరకు ఉంటుంది. దాంతో ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా రాంగ్‌సైడ్‌, యూటర్న్‌ తిరగడానికి సైతం అనాసక్తి చూపుతూ డివైడర్లను ఎక్కించి మరీ క్రాస్‌ చేస్తుండటం కనిపిస్తోంది. 

కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు నుంచి వచ్చేవారు, కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌కు వెళ్లాలంటే గతంలో ఆ కాలనీ ఎదురుగానే జంక్షన్‌ ఉండేది. మెట్రో కారిడార్‌ రావడం, ఇతర కారణాలతో జంక్షన్‌ మూసేసి సుమారు కిలోమీటరు దూరంలో యూటర్న్‌ ఏర్పాటు చేశారు. వాహనదారులు.. అంత దూరం వెళ్లి, సుమారు మరో కిలోమీటర్‌ తిరిగి రావాలి. చుట్టూ తిరగలేక చాలా మంది శివానంద రిహబిలిటేషన్‌ హోం దగ్గర టర్న్‌ తీసుకుని ప్రమాదమని తెలిసినా రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్నారు. 

 పంజాగుట్ట వద్ద రోడ్లు విశాలంగా ఉన్నప్పటికీ సిగ్నల్‌ పడినప్పుడు నిమ్స్‌ వరకు ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. 

ప్యారడైజ్‌, పరేడ్‌ గ్రౌండ్‌ సిగ్నళ్లు ఒక్కో సారి రాణిగంజ్‌ వరకు ట్రాఫిక్‌ను ఆపుతుంటాయి. 

మాసాబ్‌ట్యాంక్‌ దాటగానే విరించి ఆస్పత్రి వద్ద అదే పరిస్థితి. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12కు లెఫ్ట్‌ టర్న్‌ ఉన్నప్పటకీ, వాహనదారులు ఫ్రీ లెఫ్ట్‌ పట్టించుకోని కారణంగా జామ్‌ అవుతుంది. విధిలేని పరిస్థితుల్లో రోడ్‌ నెం. 12 వెళ్లాల్సిన వారు కూడా ట్రాఫిక్‌ జాంలో చిక్కుకు పోతున్నారు.

ఖైరతాబాద్‌ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయితే ఎర్రమంజిల్‌ వరకు వాహనాలు నిలిచిపోతాయి. 

ఇలా నగరంలో 30కి పైగా సిగ్నళ్లు గంటల సమయాన్ని వృథా చేస్తున్నాయనడంలో అనుమానం లేదు. రేతిబౌలి, గాంధీభవన్‌, చాదర్‌ఘాట్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, హిమాయత్‌నగర్‌, చిక్కడపల్లి, సికింద్రాబాద్‌, నేరేడ్‌మెట్‌, ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, శాలిబండ, చాంద్రాయణగుట్ట, సంతో్‌షనగర్‌, సైదాబాద్‌, బహదూర్‌పురా, సోమాజిగూడ, బేగంపేట్‌లాంటి ఎన్నో కూడళ్లలో సమస్యలు ఉన్నాయి. వీటి కారణంగా వాహనాల వేగం తగ్గిపోతోంది. 

Updated Date - 2022-08-18T06:02:26+05:30 IST