గల్ఫ్‌లోకి ప్రవేశించిన Omicron.. సౌదీ, యూఏఈలో తొలి కేసులు నమోదు!

ABN , First Publish Date - 2021-12-02T15:09:42+05:30 IST

దక్షిణ ఆఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్(B.1.1.529) శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 23 దేశాల్లో ఒమైక్రాన్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త వేరియంట్ గల్ఫ్‌లోనూ ప్రవేశించింది. సౌదీ అరేబియా, యూఏఈలో తొలి కేసులు నమోదయ్యాయి. బుధవారం ఈ రెండు..

గల్ఫ్‌లోకి ప్రవేశించిన Omicron.. సౌదీ, యూఏఈలో తొలి కేసులు నమోదు!

రియాద్: దక్షిణ ఆఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్(B.1.1.529) శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 23 దేశాల్లో ఒమైక్రాన్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త వేరియంట్ గల్ఫ్‌లోనూ ప్రవేశించింది. సౌదీ అరేబియా, యూఏఈలో తొలి కేసులు నమోదయ్యాయి. బుధవారం ఈ రెండు దేశాల్లో ఒమైక్రాన్ కేసులు నమోదైనట్లు ఆయా దేశాల ఆరోగ్యశాఖలు వెల్లడించాయి. సౌదీలో నమోదైన తొలి కేసు నార్త్ ఆఫ్రికన్ కంట్రీ నుంచి వచ్చిన పౌరుడిలో గుర్తించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. 


"కింగ్‌డమ్‌లో ఒమైక్రాన్ తొలి కేసు గుర్తించాం. ఉత్తర ఆఫ్రికన్ దేశం నుంచి వచ్చిన వ్యక్తిలో కొత్త వేరియంట్ బయటపడింది. ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందింస్తున్నాం." అని సౌదీ ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. అటు సౌదీకి పొరుగు దేశమైన యూఏఈ సైతం మొదటి కేసు నమోదైనట్లు ప్రకటించింది. అరబ్ దేశం ద్వారా యూఏఈ వచ్చిన ఆఫ్రికన్ మహిళలో ఒమైక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది.   


ఇదిలాఉంటే.. ఇప్పటికే ఈ రెండు దేశాలు ఒమైక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఒమైక్రాన్ వేరియంట్ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఏడు ఆఫ్రికన్ దేశాలైన దక్షిణాఫ్రికా, నమీబియా, లెసోతో, ఈశ్వతిని, జింబాబ్వే, బోట్స్వానా, మొజాంబిక్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది. సోమవారం(నవంబర్ 29) నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అలాగే ఈ దేశాల నుంచి ట్రాన్సిట్ విమానాల ద్వారా వచ్చే ప్రయాణికులపై కూడా బ్యాన్ వేసింది. అయితే, యూఏఈ నుంచి ఈ నిషేధిత దేశాలకు విమాన సర్వీసులు మాత్రం యధావిధిగా నడుస్తున్నాయి. దీంతోపాటు ఏడు దేశాల దౌత్యాధికారులు, యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాలు కలిగిన వారికి ఈ నిషేధం నుంచి మినహాంపు ఇచ్చింది. 


సౌదీ అరేబియా కూడా యూఏఈ బాటలోనే శుక్రవారమే ఏడు ఆఫ్రికన్ దేశాలపై బ్యాన్ విధించింది. ఈ మేరకు సౌదీ అంతర్గత మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణాఫ్రికా, నమీబియా, లెసోతో, ఈశ్వతిని, జింబాబ్వే, బోట్స్వానా, మొజాంబిక్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సౌదీలో ప్రవేశం ఉండదని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అయితే, ఈ ఏడు దేశాలలో కాకుండా వేరే దేశంలో 14 రోజులకు పైగా స్టే చేసిన ప్రయాణికులకు మాత్రం ఎంట్రీకి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. 

Updated Date - 2021-12-02T15:09:42+05:30 IST