యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెనియన్లకు యూఏఈ ఊరట

ABN , First Publish Date - 2022-03-05T14:24:11+05:30 IST

రష్యా దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్ పౌరులకు యూఏఈ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెనియన్లకు యూఏఈ ఊరట

అబుదాబి: రష్యా దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్ పౌరులకు యూఏఈ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ పౌరులకు వీసా-ఫ్రీ ఎంట్రీని ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. మార్చి 3వ తేదీ తర్వాత తమ దేశానికి వచ్చిన ఉక్రెయినియన్లకు ఈ వీసా-ఫ్రీ ఎంట్రీ అవకాశం కల్పిస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఇలా వచ్చిన ఉక్రెయిన్ పౌరులు ఇంతకుముందు ఉన్న పాలసీ ప్రకారం 30 రోజులు తమ దేశంలో ఉండవచ్చని తెలిపింది. అలాగే మార్చి 3వ తేదీ కంటే ముందే యూఏఈ వచ్చిన వారికి ఎలాంటి జరిమానాలు చెల్లించకుండా ఒక ఏడాది పాటు తమ దేశంలో ఉండే వెసులుబాటు కల్పించింది. 


"యూఏఈలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం సమన్వయంతో సహాయం అవసరమైన తమ దేశంలోని ఉక్రెనియన్లకు యూఏఈ అత్యవసరమైన సేవలను కూడా అందిస్తుంది" అని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం కూడా ఉక్రెయిన్‌కు మానవతా సహాయంగా 18 మిలియన్ దిర్హమ్స్ (రూ.37.44కోట్లు) పంపనున్నట్లు ప్రకటించింది. అటు రాస్ అల్ ఖైమా కూడా తమ వద్ద చిక్కుకుపోయిన ఉక్రెయిన్ టూరిస్టులకు హోటళ్లలో ఉచితంగా బస చేసేందుకు వీలు కల్పించింది. కాగా, యూఏఈలో సుమారు 15వేల మంది ఉక్రెయిన్ పౌరులు ఉంటున్నట్లు సమాచారం. అలాగే ప్రతియేటా 2.50లక్షల మంది ఉక్రెనియన్ జాతీయులు యూఏఈకి సందర్శనకు వస్తుంటారని తెలుస్తోంది.  

Updated Date - 2022-03-05T14:24:11+05:30 IST