Kamal Haasan: విశ్వనటుడు కమల్ హాసన్‌కు యూఏఈలో అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2022-07-23T16:27:48+05:30 IST

విశ్వనటుడు కమల్ హాసన్‌ (Kamal Haasan)కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అరుదైన గౌరవం దక్కింది.

Kamal Haasan: విశ్వనటుడు కమల్ హాసన్‌కు యూఏఈలో అరుదైన గౌరవం

ఎన్నారై డెస్క్: విశ్వనటుడు కమల్ హాసన్‌ (Kamal Haasan)కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం ఆయనకు దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కల్పించే గోల్డెన్ వీసా (Golden Visa) మంజూరు చేసింది. తాజాగా కమల్ వీసా అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా యూఏఈ ప్రభుత్వానికి, అధికారులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. "యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి గోల్డెన్ వీసా అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ, ఫారినర్స్ అఫైర్స్ ఆఫీస్ సందర్శన సందర్భంగా సహకరించిన జీడీఆర్‌ఎఫ్ఏ (GDRFA) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రీకి ధన్యవాదాలు." అని కమల్ ట్వీట్ చేశారు. అలాగే ప్రతిభావంతులు, సృజనాత్మక వ్యక్తులకు మద్దతు ఇస్తున్నందుకు దుబాయ్ ఫిల్మ్ అండ్ టీవీ కమిషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.




ఇక యూఏఈ సర్కార్ విదేశీయులకు లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ కోసం 5, 10 ఏళ్ల కాలపరిమితో గోల్డెన్ వీసాలను మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహించుకోవచ్చు. 2018 కేబినెట్ తీర్మానం నం. 56 ప్రకారం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్లు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు యూఏఈ సర్కార్ గోల్డెన్ వీసా జారీ చేస్తోంది. 


ఇదిలాఉంటే.. భారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఈ వీసా అందుకున్న బాలీవుడ్ స్టార్స్‌ జాబితాలో రణవీర్ సింగ్, ఫర్హా ఖాన్, వరుణ్ ధావన్, బోనీ కపూర్ ఫ్యామిలీ, మౌనీ రాయ్, సంజయ్‌దత్, సునీల్ శెట్టి, సోను నిగమ్, సల్లూభాయ్, జెనీలియా దంపతులు ఉన్నారు. అలాగే బాలీవుడ్ స్టార్స్‌తో పాటు మలయాళం నుంచి మోహన్‌లాల్, మమ్ముటీ, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఉన్నారు. వీరితో పాటు గాయని చిత్ర, తమిళ నటి త్రిష క్రిష్ణన్, నటి అమల పాల్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన కూడా యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు.   

Updated Date - 2022-07-23T16:27:48+05:30 IST