సర్వాంతర్యామి

ABN , First Publish Date - 2021-07-23T05:30:00+05:30 IST

సాధకుడి జీవితంలో గురువు ప్రవేశించినప్పుడు పరమాత్ముడి గురించిన జ్ఞానం ఉదయిస్తుంది. మనలో

సర్వాంతర్యామి

సాధకుడి జీవితంలో గురువు ప్రవేశించినప్పుడు పరమాత్ముడి గురించిన జ్ఞానం ఉదయిస్తుంది. మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అంతర్మథనం జరగాలి. దానికి గురువు సహాయకారిగా నిలుస్తాడు. గురువు అంటే కేవలం శరీరరూపంలో మన కళ్ళకు కనిపించే వ్యక్తి మాత్రమే కాదు... ఒక సూత్రం. అంతటా ఉండే ఆ గురువును దర్శించడం గురించి సంత్‌ కనకదాసు ఒక కథ చెప్పాడు. 


కనకదాసు ఒక గురువు దగ్గర శిష్యరికం చేసేవాడు. ఆ గురువు ఒక రోజు కనకదాసునూ, ఇతర శిష్యులనూ పిలిచి, తలా ఒక అరటి పండు ఇచ్చారు. ఆ రోజు ఏకాదశి ఉపవాసం పూర్తయ్యాక, ఆ అరటి పండు తినాలని చెబుతూ... ఎవరూ చూడకుండా తినాలని నియమం విధించారు. మరునాడు శిష్యులందరూ వచ్చారు. ఎవరూ చూడకుండా ఆ అరటిపండు ఎలా తిన్నామో చెబుతున్నారు. కనకదాసు తినకుండా వచ్చాడు. ఎందుకు తినలేదని ప్రశ్నించారు గురువు. ఎక్కడికి వెళ్ళి తినాలనుకున్నా, అక్కడ గురువు ఉన్న భావన కలిగిందని కనకదాసు బదులిచ్చాడు.  దీన్నే మనం ‘సాన్నిధ్య భావం’ అంటాం. ఇలాంటి ఎరుకలో ఉన్నప్పుడు ఫిర్యాదులన్నీ మాయమైపోతాయి. మనం అనుక్షణం ‘గురువు’ అనే సర్వాంతర్యామి రక్షణలో ఉన్నామనే గాఢమైన విశ్వాసంతో పనులు చేస్తాం. 



ఒకప్పుడు ఒక రాజాస్థానంలో ఒక పండితుడు ఉండేవాడు. అతను మంచి వక్త. రాజుతో సహా అందరూ అతణ్ణి గౌరవించేవారు. కానీ తనలో ఏదో వెలితి ఉన్నట్టు అతనికి అనిపించి, మంచి గురువు కోసం వెతుకుతూ ఉండేవాడు. అలాంటి గురువు గురించి విని, పల్లకిలో ఎక్కి అతను బయలుదేరాడు. గురువు ఉన్నట్టు తెలిసిన చోటుకు చేరుకొని, పల్లకి దిగి చూశాడు. తాను ఏ గురువు కోసం వెతుక్కుంటూ వచ్చాడో... ఆ గురువు తన పల్లకిని మోసిన బోయీలలో ఒకరు! గురువును కలుసుకోవాలనే అతని ఆకాంక్ష... ఆ గురువే అతణ్ణి వెతుక్కొని వచ్చేలా చేసింది. మనసులో బలమైన కోరిక ఉంటే జీవితంలో గురువు తప్పక కనిపిస్తాడు. మనం ఒక అడుగు వేస్తే చాలు... గురువు మనవైపు పది అడుగులు వేసి వస్తాడు. కానీ ఆ ఒక్క అడుగూ మనం వేయాల్సిందే! 


గురువు దగ్గరకు చేరుకుంటున్న కొద్దీ ఆనందం మరింత పెరుగుతుంది. మరింత నూతనత్వం, మరింత జ్ఞానం, మరింత ప్రేమ కలుగుతాయి. ఈ బంధం తుది ఎక్కడో తెలియని లోతుల్లోకి వెళ్ళడం లాంటిది. అంతం లేని, ఎలాంటి ఆంక్షలూ లేని ఒక అనుబంధంతో కూడిన సంప్రదాయం ఇది. దాన్నే మనం గురు పౌర్ణమి రోజున జరుపుకొంటున్నాం. 

 శ్రీశ్రీ రవిశంకర్‌


Updated Date - 2021-07-23T05:30:00+05:30 IST