Udaipur Killer క్రిమినల్ మైండ్.. 2611 బైక్ నంబరు కోసం అదనంగా రూ.5 వేల చెల్లింపు

ABN , First Publish Date - 2022-07-01T23:12:01+05:30 IST

ఉదయ్‌పూర్ హంతకులకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందని రాజస్థాన్ పోలీసులు వెల్లడించిన

Udaipur Killer క్రిమినల్ మైండ్.. 2611 బైక్ నంబరు కోసం అదనంగా రూ.5 వేల చెల్లింపు

జైపూర్: ఉదయ్‌పూర్ (Udaipur) హంతకులకు పాకిస్థాన్‌ (Pakistan)కు చెందిన ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందని రాజస్థాన్ (Rajasthan) పోలీసులు వెల్లడించిన తర్వాతి రోజే వారికి సంబంధించి మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. కస్టడీలో ఉన్న నిందితుల్లో ఒకడైన రియాజ్ అఖ్తరి (Riyaz Akhtari) చెప్పిన విషయం విని పోలీసులే విస్తుపోయారు. 26/11 ముంబై బాంబు పేలుళ్ల ఘటనను గుర్తుకు తెచ్చేలా 2611 అన్న నంబరు ప్లేటును తన బైక్ కోసం తీసుకున్నాడు. ఇందుకోసం అతడు రూ. 5 వేలు అదనంగా చెల్లించడం గమనార్హం. 


నుపుర్ శర్మకు మద్దతు పలికిన టైలర్ కన్నయ్య లాల్ (Kanhaiya Lal) గొంతు కోసి చంపేసిన తర్వాత అదే బైక్‌పై నిందితులు గోస్ మహ్మద్ (Gos Mohammad), రియాజ్ అఖ్తరీ పరారయ్యారు. RJ 27 AS 2611 నంబరుతో ఉన్న ఈ బైక్ ఇప్పుడు ఉదయ్‌పూర్‌లోని ధన్ మండి పోలీస్ స్టేషన్‌లో ఉంది. రియాజ్ మదిలోని క్రిమినల్ ఆలోచనకు ఈ నంబర్ ప్లేట్ అద్దం పడుతోందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడీ నంబర్ ప్లేట్ కీలకం కానుందని భావిస్తున్నారు. అంతేకాదు, 2014లో అతడు నేపాల్ వెళ్లాడని అతడి పాస్‌పోర్టు ద్వారా తెలుసుకున్నారు. పాకిస్థాన్‌కు పలుమార్లు కాల్స్ చేసినట్టు అతడి మొబైల్ డాటా చెబుతోంది.  


నిందితులు బైక్‌పై పారిపోతూ ఉదయ్‌పూర్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని రాజ్‌సమండ్ జిల్లాలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద చిక్కారు. ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) రికార్డులను బట్టి రియాజ్ 2013లో హెచ్‌డీఎఫ్‌సీ నుంచి రుణం తీసుకుని బైక్‌ను కొనుగోలు చేశాడు. 2014లోనే ఈ బైక్ ఇన్సూరెన్స్‌కు కాలం చెల్లించింది. 


 కన్నయ్య లాల్ హత్యానంతరం 32 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో ఇన్‌స్పెక్టర్ జనరల్, ఉదయ్‌పూర్ ఎస్పీ కూడా ఉన్నారు. కాగా, నిందితులిద్దరినీ గురువారం భారీ భద్రత మధ్య కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఉదయ్‌పూర్‌లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. 

Updated Date - 2022-07-01T23:12:01+05:30 IST