ఉడతా ఉడతా ఊచ్‌

ABN , First Publish Date - 2022-07-01T08:16:26+05:30 IST

ఉడతా ఉడతా ఊచ్‌

ఉడతా ఉడతా ఊచ్‌

ఎందుకు దూకావోచ్‌..

ఏపీలో ఏదైనా సాధ్యమే

ఎలుకలు మద్యం తాగుతాయి

ఉడతలు హైటెన్షన్‌ వైర్లు తెంపుతాయి

తేనెటీగలు దేవుడిరథం తగలబెడతాయి

మాస్క్‌ అడిగిన డాక్టర్‌నే పిచ్చోళ్లను చేస్తారు

తీర్పులు చెప్పే జడ్జిలను తిట్టిపోస్తారు

జగనన్న రాజ్యంలో అట్లుంటది మరి!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగనన్న రాజ్యమేలుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా ఎట్లుంటుంది? చిత్రవిచిత్రంగా ఉంటుంది. భూమ్మీద మరెక్కడా జరగని వింతలూ విడ్డూరాలూ ఇక్కడే జరుగుతుంటాయి. ఎలుక మద్యం తాగేస్తుంది. ఉడత కారణంగా హైటెన్షన్‌ వైర్లు తెగి ప్రజల ప్రాణాలు అగ్గికి బుగ్గవుతాయి. అదెట్లా సాధ్యం అంటే.. అంతే నమ్మాల్సిందే! శ్రీసత్యసాయి జిల్లాలో ఒక ఉడుత ఒక హైటెన్షన్‌ కేబుల్‌ నుంచి మరో కేబుల్‌ మీదకు ఎగిరి గంతేయడం వల్ల వైరు తెగిందని అధికారులు సెలవిచ్చారు. అంటే అతి భారీ టవర్‌పై ఉండే విద్యుత్‌ తీగలు తెగిపడి మనుషుల ప్రాణాలు పోవడంలో నేరం విద్యుత్‌ శాఖది కాదు. ఆ నేరం ఉడుతదే అన్నమాట! ఆ మధ్యకాలంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రభుత్వ మద్యంషాపుల్లో భారీగా మద్యం మాయమైంది. అబ్కారీ శాఖ విచారణ జరిపింది. తీరా తేల్చిందేమంటే.. ప్రభుత్వ లిక్కర్‌ షాపుల్లో ఎలుకలు భారీగా మద్యం తాగాయట! అందుకే అమ్మకాల్లో తేడాలు వచ్చాయని తేల్చారు. ప్రభుత్వ మద్యం తాగే ఎలుకలున్న రాష్ట్రంగా ఏపీ సరికొత్త రికార్డు సృష్టించింది.


బామ్మకు టార్చర్‌

రంగనాయకమ్మ ఓ సాధారణ మహిళ. 60 ఏళ్ల వయసున్న ఆమె తన శక్తినంతా కూడదీసుకొని ఏం చేయగలదు? మహా అంటే ఓ గంట వాకింగ్‌ చేయగలరు. సామాజిక చైతన్యం ఉన్న మహిళ కాబట్టి సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంది. అలాగని ఆమెకు వేలు, లక్షల్లో ఫాలోవర్లు లేరు. తాను ఓటేసిన పార్టీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని, తప్పుడు పనులు చేయవద్దని సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ పెట్టారు. అంతే... ఆమె సర్కారును కూలదోసే శక్తిగా మారిందని కేసుపెట్టారు. విచారణకు పిలిచి గంటలకొద్దీ విచారించారు. ఇలాంటివి ఇంతకు ముందెక్కడైనా జరిగినట్లు విన్నారా...కన్నారా? ఏపీలోనే. ఎందుకంటే ఏపీలో అంతే. 


వైద్యుడిని వేటాడారు

డాక్టర్‌ సుధాకర్‌ ఆర్థికంగా స్థితిమంతుడు. మంచి మనసున్న ప్రజావైద్యుడు. కరోనా కాలంలో సేవలందించే వైద్యులు, సిబ్బందికి, రోగులకు ఇవ్వడానికి మాస్కులు కావాలని కోరారు. అంతే ఆయన మాటలు పెద్దలకు నచ్చలేదు. కేసులు, అరె్‌స్టలంటూ వేధించారు. చివరకు బతికుండగానే ఆయనో పిచ్చోడనే ముద్రవేశారు. ఆ తర్వాత ఆయన అసువులు బాశారు. ఇంత జరిగినా వైద్యలోకం గొంతెత్తి ‘ఇదెక్కడి దారుణం’ అని ప్రశ్నించకపోవడం ఒక్క ఏపీలోనే చూశాం. సీబీఐ అంటే నేరస్థులకే కాదు ప్రభుత్వాలకూ భయం. ఇక్కడ అలాంటిదేమీ ఉండదు. సీబీఐ అధికారులు, వారి డ్రైవర్లు, ఇంకా వ్యక్తిగత సహాయకుల ఫోన్లు సైతం ట్రాప్‌ చేస్తుంటారు. అధికారులు చెప్పిన మాట వినకుంటే దారిలో పెట్టేందుకు వారిపైనే ప్రైవేటు కేసులు పెట్టిస్తుంటారు. ఇలాంటి తెగువ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా చూశారా. అవకాశమే లేదు. ఇదొక్క ఏపీలోనే సాధ్యం. న్యాయమూర్తి అంటేనే సమున్నత గౌరవం ఇవ్వాలి. ఇక్కడ అదేం లేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఫిర్యాదులు చేస్తారు. ‘నచ్చని’ తీర్పులు ఇస్తున్నారంటూ బెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వారిపై రాయడానికి వీలుకాని భాషలో సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడతారు. కోర్టులు పరిధి దాటాయని, హద్దులు మీరాయంటూ చర్చలు పెట్టించి మరీ తీర్మానాలు చేయిస్తారు. దేశంలో ఈ తరహా దౌర్జన్యం మరెక్కడా జరగదు. ఈ మూకదాడికి ఏపీనే సెంటర్‌గా ఉంటోంది.


తేనెటీగలు తగలెట్టేశాయట!

దేవుడి యాత్ర కోసం సిద్ధం చేసిన ర థం అంతర్వేదిలో తగలబడిపోయింది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సామాజికంగా ఘర్షణలు రేకెత్తించడానికి ఉద్దేశ్యపూర్వకంగా,  కుట్రపూరితంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దేవుడి రథాన్ని తగులబెట్టారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమయింది. విచారణ జరిపి నిజాలు నిగ్గుతేలుస్తామని ప్రభుత్వం చెప్పింది. దోషులు ఎవరైనా వదలబోమని ప్రభుత్వ పెద్దలు గర్జించారు. కానీ రథాన్ని తగులబెట్టింది మనుషులు కానేకాదని తేల్చారు. అదేమంటే తేనెటీగల వల్లే రథం తగులబడిపోయిందని సరికొత్త సంచలన విషయాన్ని బయటపెట్టారు. తేనెపట్టును కదిలిస్తే ఈగలు కుడుతాయి అని మాత్రమే మనకు తెలుసు. అవి కుడితే ఒళ్లు వాచిపోతుందని, ఓ రెండు మూడు రోజులు ఇబ్బంది పడుతామని తెలుసు. కానీ తేనెటీగలు దేవుడి రథాన్ని తగలబెడుతాయని అధికారులు చెబితేగానీ తెలియలేదు మరి! 


దావోస్ లో ‘పంచ్‌’ ప్రత్యక్షం.. 

న్యాయమూర్తులను దూషించిన కేసులో పంచ్‌ ప్రభాకర్‌ ఏపీలో మోస్ట్‌వాంటెడ్‌. ఇతనికోసం సీబీఐ వెతుకుతోంది. త్వరగా పట్టుకోండి అని కోర్టు ఆదేశిస్తోంది. ఏడాదిన్నరగా అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ అతను దావోస్‌ ఆర్థిక సదస్సులో ప్రత్యక్షమవుతాడు. సీఎం జగన్‌ హాజరైన ఆ సదస్సు జరిగే చోట అతను ప్రభుత్వ పెద్దలు, ఎంపీలతో ఫొటోలు దిగి పంచ్‌ పడిందంటారు. 


వద్దు బాబోయ్‌ పీఆర్సీ అనేలా..

ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ (పీఆర్‌సీ) ప్రకటిస్తే ఇప్పుడిచ్చే జీతాల్లో పెరుగుదల ఉంటుంది. అదేమిటో..ఇక్కడ అంతా రివర్స్‌. కొత్త పీఆర్సీ ప్రకటనతో జీతాలు తగ్గాయి. ప్రయోజనాలకు కోతలుపడ్డాయి. ఇలాంటి పీఆర్సీల గురించి ప్రపంచంలో ఎక్కడైనా విన్నారా? అవకాశమే లేదు. ఉద్యోగుల ఖాతాల్లో జమచేసిన 800 కోట్ల జీపీఎఫ్‌ సొమ్ము వారికే తెలియకుండా మాయం చేసిన సంఘటన గురించి ప్రపంచంలో ఎక్కడైనా విన్నారా? లక్షల మంది ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్మును క్షణంలోనే మాయం చేసిన వైనం ఏపీలోనే ప్రత్యేకం. జగనన్న పాలన అంటే అట్లుంటది మరి!

Updated Date - 2022-07-01T08:16:26+05:30 IST