Loud speakers row: రాజ్‌థాకరేకు భయపడుతున్న ఉద్ధవ్: కాంగ్రెస్

ABN , First Publish Date - 2022-05-07T22:20:46+05:30 IST

లౌడ్ స్పీకర్ల వివాదంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీప్ రాజ్‌థాకరే..

Loud speakers row: రాజ్‌థాకరేకు భయపడుతున్న ఉద్ధవ్: కాంగ్రెస్

ముంబై: లౌడ్ స్పీకర్ల వివాదంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీప్ రాజ్‌థాకరే (Raj Thackeray)కు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) సారథ్యంలోని ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ (Sanjay Nirupam) ఆరోపించారు. మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి (MVA)లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉండటం విశేషం.


సంజయ్ నిరుపమ్ శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, మే 1వ తేదీన పలు నిబంధనలతో ఔరంగాబాద్ ర్యాలీకి ప్రభుత్వం అనుమతించిందని, అయితే రాజ్‌థాకరే ఆ నిబంధనలను ఉల్లంఘించారని అన్నారు. తక్షణం రాజ్‌థాకరేను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మతఘర్షణలను రాజ్‌థాకరే రెచ్చగొట్టకుండా ఆయనకు అడ్డుకట్టు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహారాష్ట్ర పోలీసులు 16 షరతులతో ఔరంగాబాద్ ర్యాలీకి అనుమతించారని, వాటిలో 12 షరతులను రాజ్ థాకరే ఉల్లంఘించారని తెలిపారు. రెండు కోర్టుల నుంచి ఆయనపై నాన్‌-బెయిలబుల్ వారెట్లు కూడా ఉన్నాయని అన్నారు. ''ముంబై పోలీసులు అచేతనంగా ఎందుకు ఉండిపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌థాకరేకు భయపడుతున్నట్టు కనిపిస్తోంది''అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం భయపడాల్సిన అవసరం లేదని, అటు దేశంలోనూ, ఇటు మహారాష్ట్రలోనూ చట్టం అనేది ఒకటుందని, చట్టాన్ని ఎవరు సవాలు చేసినా వారిపై చర్యలు తీసుకోవచ్చని సంజయ్ నిరుపమ్ సూచించారు.

Read more