ఉద్ధవ్‌.. ఇంటికి!

Published: Thu, 23 Jun 2022 01:50:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉద్ధవ్‌.. ఇంటికి!

తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండేకు మద్దతుగా గవర్నర్‌కు 34 మంది ఎమ్మెల్యేల లేఖ

వారిలో నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు.. సూరత్‌ నుంచి గువాహటికి రెబెల్‌ ఎమ్మెల్యేలు


సాయంత్రానికి షిండే గూటికి మరో నలుగురు ఎమ్మెల్యేలు

నేను బాల్‌ఠాక్రే కుమారుణ్ని.. అధికారం కోసం పాకులాడను

నావాళ్లే నన్ను వద్దనుకుంటే రాజీనామా చేయడానికి సిద్ధం

నా తర్వాత శివసైనికులే సీఎం అయితే సంతోషం: ఉద్ధవ్‌

అధికారిక నివాసం వీడి సొంతిల్లు మాతోశ్రీకి చేరుకున్న ఠాక్రే

మహా వికాస్‌ అఘాడీ ఒక అసహజమైన కూటమి

దాంట్లోంచి శివసేన బయటకు రావడం అనివార్యం

నాకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది: ఏక్‌నాథ్‌ షిండే

షిండే శిబిరం నుంచి పారిపోయి వచ్చిన నితిన్‌ దేశ్‌ముఖ్‌

తనకు గుండెపోటు రాకున్నా బలవంతంగా ఆస్పత్రికి

తరలించి అనవసరంగా ఇంజెక్షన్లు ఇప్పించారని ఆరోపణ

ఉద్ధవ్‌ ఠాక్రేకు, మహారాష్ట్ర గవర్నర్‌కు కరోనా పాజిటివ్‌


నేను ముఖ్యమంత్రిగా ఉండడంపై ఒక్క శివసేన ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పినా రాజీనామా చేసి అధికారిక నివాసాన్ని వీడి వెళ్లిపోతాను. సూరత్‌, ఇతర ప్రదేశాల్లో ఉండి ప్రకటనలు చేయడం దేనికి? శివసేన అధ్యక్షపదవి, సీఎం పదవి చేపట్టడానికి నేను అనర్హుణ్ని అని నా ముందుకొచ్చి నా ముఖం మీదే చెప్పండి. నేను తక్షణమే రాజీనామా చేస్తాను. రాజీనామా లేఖను నేను సిద్ధంగా ఉంచుకున్నాను. దాన్ని తీసుకుని మీరు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లొచ్చు.

- ఉద్ధవ్‌ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి 


న్యూఢిల్లీ, జూన్‌ 22: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వ పతనం ఖాయంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న శివసేనలో తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పార్టీపై తిరుగుబాటు ప్రకటించిన ఏక్‌నాథ్‌ షిండేకు మద్దతుగా 34 మంది ఎమ్మెల్యేలు (వారిలో నలుగురు స్వతంత్రులు) మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీకి లేఖ రాశారు. షిండేనే శివసేన శాసనసభాపక్ష నేతగా వారు తమ లేఖలో పేర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచి సూరత్‌లో ఉన్న ఈ ఎమ్మెల్యేలనందరినీ బుధవారం తెలతెలవారుతుండగా ప్రత్యేక విమానంలో గువాహటికి (అసోం) తరలించారు. గువాహటి విమానాశ్రయంలో వారికి బీజేపీ ఎంపీ వల్లబ్‌ లోచన్‌ దాస్‌, బీజేపీ ఎమ్మెల్యే సుశాంత బోర్ఘోహెయిన్‌ స్వాగతం పలికారు. అక్కడి బ్లూరాడిసన్‌ హోటల్‌లో వారికి బస ఏర్పాటు చేశారు. సాయంత్రానికి షిండేకు మద్దతుగా మరో నలుగురు ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో గువాహటికి చేరుకున్నారు. వారిలో ఇద్దరు (యోగేశ్‌ కదమ్‌, గులాబ్‌రావ్‌పాటిల్‌) శివసేన ఎమ్మెల్యేలు కాగా.. మంజుల గవిత్‌, చంద్రకాంత్‌ పాటిల్‌ స్వతంత్ర ఎమ్మెల్యేలు.

ఉద్ధవ్‌.. ఇంటికి!

గులాబ్‌రావ్‌ పాటిల్‌ ప్రస్తుతం ఉద్ధవ్‌ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తనకు 46మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు షిండే ప్రకటించారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద వేటు పడకుండా ఉండడానికి కావాల్సినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు. అంతేకాదు.. శివసేన పార్టీ చీఫ్‌వి్‌పగా ఎమ్మెల్యే భరత్‌ గోగావలేను నియమించినట్టు ఆయన ప్రకటించారు. మరోవైపు.. పార్టీ ఎమ్మెల్యేలంతా బుధవారం సాయంత్రం 5 గంటలకు సీఎం ఉద్ధవ్‌ నివాసంలో జరిగే శాసనసభాపక్ష భేటీకి హాజరు కావాలని సేన చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభు ఆదేశాలు జారీ చేశారు. తగిన కారణం లేకుండా ఈ భేటీకి గైర్హాజరైతే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే.. కొత్త చీఫ్‌వి్‌పగా భరత్‌ గోగావలే నియమితులైనందున సునీల్‌ ప్రభు ఆదేశాలు చట్టపరంగా చెల్లవని ఏక్‌నాథ్‌ షిండే ట్వీట్‌ చేశారు. గవర్నర్‌ ఎదుట బలప్రదర్శన చేసేందుకు కొంత సమయం కావాల్సిందిగా షిండే కోరినట్టు సమాచారం.ఇక.. బుధవారంనాడు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నిర్వహించిన వర్చువల్‌ క్యాబినెట్‌ భేటీకి ఎనిమిది మంది మంత్రులు గైర్హాజరయ్యారు. వారు.. ఏక్‌నాథ్‌ షిండే, గులాబ్‌రావ్‌ పాటిల్‌, దాదా భూసే, సందీపన్‌ భుమ్రే, అబ్దుల్‌ సత్తార్‌ (సహాయమంత్రి), శంభూరాజ్‌ దేశాయ్‌ (సహాయమంత్రి), బచ్చు కాడు (సహాయమంత్రి, శివసేనకు మద్దతు), రాజేంద్రపాటిల్‌ (సహాయమంత్రి, సేన మద్దతుదారు).


రాజీనామాకు సిద్ధమే..

శివసేన ఎప్పటికీ హిందుత్వను వీడదని.. బాల్‌ ఠాక్రే కుమారుణ్ని అయిన తాను అధికారం కోసం ఎన్నటికీ పాకులాడనని ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. ఏక్‌నాథ్‌ షిండేకు మద్దతుగా 34 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు లేఖ రాసిన నేపథ్యంలో బుధవారం ఆయన వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా తన సందేశాన్ని పార్టీ శ్రేణులకు, ప్రపంచానికి చేరవేశారు. ‘‘ఏక్‌నాథ్‌ షిండేతో ఉన్న ఎమ్మెల్యేల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. తమను బలవంతంగా తీసుకెళ్లారని వారంతా చెబుతున్నారు. శివసేనను హిందుత్వ నుంచి ఎవరూ వేరు చేయలేరు. శరద్‌పవార్‌, కమల్‌నాథ్‌ నాకు ఫోన్‌ చేశారు. నేను సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు.’’ అని ఠాక్రే ఆ వెబ్‌క్యాస్టింగ్‌లో వివరించారు. సీఎం పదవికి తాను తగనని తన పార్టీవాళ్లే అంటే రాజీనామా చేయడానికి సిద్ధమేకానీ.. తన తర్వాత శివసైనికులే సీఎం అవుతారన్న గ్యారంటీ ఉందా? అని ప్రశ్నించారు. శివసైనికులే సీఎం అయితే తాను సంతోషిస్తానన్నారు. ప్రస్తుతం గువాహటిలో ఉన్న రెబెల్‌ ఎమ్మెల్యేల్లో కొందరు వెనక్కి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారని.. చాలామందిని బలవంతపెట్టి, బెదిరించి ముంబై నుంచి తరలించారని ఠాక్రే తెలిపారు. తనకు అనుభవం లేకున్నా ప్రభుత్వం నడపడానికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీకి, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌కు, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం.. ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ తన కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే, మంత్రి జితేంద్రతో కలిసి.. ఠాక్రే అధికారిక నివాసం ‘వర్ష’లో ఆయనతో భేటీ అయ్యారు. కాగా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే తన వ్యక్తిగత నివాసమైన మాతోశ్రీకి తరలిపోనున్నారని సేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఠాక్రేనే ఉంటారని.. అవసరమైతే మహావికాస్‌ అఘాడీ బలపరీక్షలో మెజారిటీని నిరూపించుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఠాక్రే తన పదవికి రాజీనామా చేయట్లేదని తేల్చిచెప్పారు.

ఉద్ధవ్‌.. ఇంటికి!

కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి షిండేను ముఖ్యమంత్రిని చేయాలంటూ శరద్‌ పవార్‌ ఠాక్రేకు సలహా ఇచ్చినట్టు వచ్చిన కథనాలను ఆయన కొట్టిపారేశారు. పవార్‌ ఠాక్రేకు ఎలాంటి సలహా ఇవ్వలేదని స్పష్టం చేశారు. అంతకుముందు.. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు అసెంబ్లీ రద్దుకు దారితీస్తున్నాయంటూ సంజయ్‌ రౌత్‌ ఒక ట్వీట్‌ చేయడం గమనార్హం. అయితే, మళ్లీ ఆయనే.. షిండే శిబిరంతో సానుకూల చర్చలు జరుగుతున్నాయని, అసమ్మతి ఎమ్మెల్యేలందరూ మళ్లీ పార్టీగూటికి చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అసలు అసెంబ్లీ రద్దు ప్రతిపాదనే లేదని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తనకు స్పష్టం చేశారని, ప్రభుత్వాన్ని తాము సమర్థంగా నడుపుతామని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పాటోలే కూడా తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ముంబైకి చేరుకున్న కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌ కమల్‌నాథ్‌.. ఉద్ధవ్‌ ఠాక్రేతో ఫోన్‌లో మాట్లాడారని ఆయన వెల్లడించారు. పాటోలే ఇలా చెబుతున్నప్పటికీ.. బుధవారంనాడు ముంబైలో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశానికి 44 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 41 మందే హాజరు కావడం గమనార్హం. మరోవైపు.. తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్మకానికి లేరని కమల్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. ముంబైలో ఆయన శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. తమ భేటీలో రాష్ట్రపతి ఎన్నికలు, తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు పవార్‌ తెలిపారు. కాగా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ(80).. ఇద్దరికీ కరోనా పాజిటివ్‌ వచ్చింది. కోషియారీని ముంబైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు.


బయటకు రావాల్సిందే..

ఠాక్రే వెబ్‌ సందేశం ఇచ్చిన కొన్నిగంటల తర్వాత తిరుగుబాటు నేత షిండే ఒక ప్రకటన చేశారు. ‘‘మహావికాస్‌ అఘాడీ ఒక అసహజమైన కూటమి. శివసేన తన కోసం, తన పార్టీ కార్యకర్తల కోసం ఆ కూటమి నుంచి బయటకు రావడం తప్పనిసరి. రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి’’ అన్నారు.  ఈ కూటమి వల్ల కాంగ్రెస్‌, ఎన్సీపీకే లాభం చేకూరిందని.. ఆ రెండు పార్టీలూ బలపడుతుండగా శివసేన వ్యవస్థాగతంగా బలహీనపడుతూ వచ్చిందని, గత రెండున్నరేళ్లుగా సగటు శివసైనికులు ఎన్నో బాధలు పడ్డారని షిండే ఆవేదన వెలిబుచ్చారు.


బలవంతంగా ఆస్పత్రిలో చేర్చారు

షిండే శిబిరంలో మంగళవారం ఉన్న శివసేన ఎమ్మెల్యే నితిన్‌దేశ్‌ముఖ్‌ బుధవారం నాగపూర్‌ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమై సంచలన వ్యాఖ్యలు చేశారు. సూరత్‌లో కొందరు తనను  బలవంతంగా ఆస్పత్రిలో చేర్చారని.. తనకు గుండెపోటు రానప్పటికీ బలవంతంగా ఇంజెక్షన్లు చేశారని చెప్పారు. ఎలాగోలా తాను అక్కణ్నుంచీ తప్పించుకుని క్షేమంగా వెనక్కి వచ్చినట్టు వెల్లడించారు. తాను ఎప్పటికీ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేకు విధేయుడినే అని నితిన్‌ దేశ్‌ముఖ్‌ స్పష్టం చేశారు. కైలాస్‌ పాటిల్‌ అనే మరో ఎమ్మెల్యే.. జూన్‌ 20న తాను షిండే ఇచ్చిన డిన్నర్‌కు వెళ్లానని, అక్కడి నుంచి సూరత్‌కు ఎమ్మెల్యేలను కార్లలో తీసుకెళ్లారని, తాను కారులోంచి బయటపడి కాలినడకన కిలోమీటర్ల కొద్దీ దూరం నడిచి, బైక్‌పైన, ట్రక్కుపైన లిఫ్ట్‌ అడిగి ముంబైకి చేరుకున్నానని చెప్పారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.