ఉద్ధవ్‌ రాజీనామా

ABN , First Publish Date - 2022-06-30T08:12:51+05:30 IST

శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తొమ్మిది రోజులుగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరింది.

ఉద్ధవ్‌ రాజీనామా

  • మహారాష్ట్ర సీఎంగా వైదొలిగిన శివసేన అధినేత
  • శాసనమండలి సభ్యత్వానికీ గుడ్‌బై
  • 31 నెలలకే కూలిన కూటమి ప్రభుత్వం
  • బలపరీక్షకు సిద్ధం కావాలని గవర్నర్‌ ఆదేశం
  • ఆ ఆదేశంపై సుప్రీంను ఆశ్రయించిన సేన
  • 4 గంటలపాటు హోరాహోరీ వాదనలు
  • ఈ రాజకీయ సంక్షోభం సమసిపోవాలంటే..
  • సభలో బలపరీక్ష జరపడమే మార్గం: సుప్రీం
  • విశ్వాసపరీక్షపై స్టే  ఇవ్వడానికి నిరాకరణ
  • గువాహటి నుంచి గోవాకు చేరుకున్న రెబెల్స్‌
  • నేటి ఉదయం తొమ్మిదిన్నరకు ముంబైకి!
  • కోరినవన్నీ ఇచ్చినా తిరుగుబాటు చేశారు
  • రెబెల్‌ ఎమ్మెల్యేల తీరుపై ఠాక్రే నైరాశ్యం
  • సోనియాగాంధీ, పవార్‌కు కృతజ్ఞతలు
  • ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్‌ పట్టణాల పేర్లు
  • శంభాజీనగర్‌, ధారాశివ్‌గా మార్పు
  • రిజైన్‌కు ముందు ఠాక్రే కేబినెట్‌ ఆమోదం


ముంబై, న్యూఢిల్లీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తొమ్మిది రోజులుగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరింది. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం 31 నెలల్లో కుప్పకూలిపోయింది. ‘‘మా ప్రభుత్వానికి దురదృష్టం పట్టుకుంది’’ అంటూ శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. గురువారం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లినా స్టే రాకపోవడంతో.. ఠాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి.. బుధవారం సాయంత్రం కేబినెట్‌ భేటీ నిర్వహించే సమయానికే ఠాక్రే ఈ నిర్ణయానికి వచ్చారని.. కోర్టు నిర్ణయం ప్రతికూలంగా వస్తే రాజీనామా చేస్తానని తన కేబినెట్‌ సహచరులకు వెల్లడించారని సమాచారం. బలపరీక్ష తర్వాత రాజీనామా చేసేబదులు ఇప్పుడే పదవి నుంచి తప్పుకోవడం మంచిదని ఆయన భావించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు, కోర్టు తీర్పు వెలువడిన అరగంటకే ఆయన వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా పార్టీశ్రేణులను, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు.


తనకు సహకరించిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌కు, ఆ రెండు పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కోరినవన్నీ ఇచ్చినా తిరుగుబాటు చేశారంటూ షిండే వర్గం ఎమ్మెల్యేలపై నైరాశ్యం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులుగా సా...గుతూ వచ్చిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం బుధవారంనాడు శరవేగంగా పలు మలుపులు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలో పలువురు బీజేపీ నేతలు మంగళవారం రాత్రి గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీని కలిసి బలపరీక్షకు ఆదేశించాలని విజ్ఞప్తి చేయడంతో ఈ వ్యవహారం వేగం పుంజుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే.. సభలో బలం నిరూపించుకోవాలంటూ ఠాక్రే సర్కారును గవర్నర్‌ ఆదేశించారు. ఇందుకోసం గురువారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని శాసనసభ కార్యదర్శికి లేఖ రాశారు.


ఈ సమావేశం ఏకైక ఎజెండా ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానమేనని.. ఈ ప్రక్రియను ఎట్టిపరిస్థితుల్లోనూ సాయంత్రం 5 గంటల్లోగా ముగించాలని లేఖలో పేర్కొన్నారు. సభ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని.. స్వతంత్ర ఏజెన్సీతో వీడియో తీయించాలని.. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సభ విశ్వాసాన్ని కోల్పోయారని ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తనకు ఈ మెయిల్‌ ద్వారా లేఖ పంపారని గవర్నర్‌ తన లేఖలో పేర్కొన్నారు. సభలో బలాన్ని నిరూపించుకోవాలంటూ ఠాక్రేకు కూడా సమాచారం పంపానని వెల్లడించారు. ఆ ఆదేశాలు బుధవారం ఉదయం 9 గంటలకు అందడంతో.. గవర్నర్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాయంత్రం 5 గంటలకు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ ప్రారంభించింది. అప్పట్నుంచీ రాత్రి ఎనిమిదిన్నర దాకా.. దాదాపు మూడున్నర గంటల పాటు ఉత్కంఠ భరితంగా వాదోపవాదాలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలూ విన్న ధర్మాసనం.. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం సమసిపోవాలంటే శాసనసభలో  విశ్వాస పరీక్ష నిర్వహించడమే సముచితమని స్పష్టం చేసింది. ఠాక్రే నేతృత్వంలోని శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఆధిక్యాన్ని నిరూపించుకోవాలన్న గవర్నర్‌ నిర్ణయంపై తాము జోక్యం చేసుకోబోమని తెలిపింది. జైలులో ఉన్న ఎన్సీపీ నేతలు నవాబ్‌ మాలిక్‌, అనిల్‌ దేశ్‌ ముఖ్‌ కూడా ఓటింగ్‌ లో పాల్గొనేలా చూడాలని ఈడీ, సీబీఐలను ఆదేశించింది. విధాన సభకు వెళ్లేందుకు వారికి రక్షణ కల్పించాలని కోరింది. 


గవర్నర్‌ తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అందుకు అభ్యంతరం వ్యక్తం చేయగా కోర్టు తోసిపుచ్చింది. జైల్లో ఉన్న ఎమ్మెల్యేలను బలపరీక్షలో పాల్గొననివ్వకూడదంటే.. భవిష్యత్తులో ప్రభుత్వాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి విపక్ష నేతలను జైల్లో పెడతాయని వ్యాఖ్యానించింది. కాగా.. కోర్టులో శివసేన తరఫున అభిషేక్‌ సింఘ్వీ, తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే తరఫున నీరజ్‌ కిషన్‌ కౌల్‌ వాదనలు వినిపించారు. డిప్యూటీ స్పీకర్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నవారు గవర్నర్‌ పవిత్రుడు అన్నట్టుగా భావిస్తున్నారని.. అలా అనుకునేవారంతా మేలుకోవాలని, ఇదే గవర్నర్‌ గతంలో ఎమ్మెల్సీ నామినేషన్లను ఏడాదిపాటు అడ్డుకున్నారని సింఘ్వీ గుర్తుచేశారు. రెండు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రి నుంచి రాజ్‌భవన్‌కు వచ్చారని.. ముందురోజు విపక్ష నేతను కలిసి, మర్నాడే బలం నిరూపించుకోవాలంటూ నోటీసు ఇచ్చారని.. అయినా డిప్యూటీ స్పీకర్‌నే అనుమానిస్తారని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు కరోనాతో బాధపడుతున్నారని.. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉన్నారని, ఇంత తక్కువ సమయంలో నోటీసిచ్చి బలపరీక్ష నిర్వహిస్తే వారు హాజరు కాలేరని కోర్టుకు తెలిపారు.


రెబెల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత అంశం కోర్టు విచారణ పరిధిలో ఉందని, ఆ విషయాన్ని గవర్నర్‌ పట్టించుకోలేదని వెల్లడించారు. ఒకవేళ.. గురువారం బలపరీక్ష జరిగి, ఆ తర్వాత ఎమ్యెల్యేలపై అనర్హత వేటు పడితే.. బలపరీక్ష ఫలితాన్ని కోర్టు ఎలా రివర్స్‌ చేయగలదని ప్రశ్నించారు. నిజమైన ఆధిక్యాన్ని తెలుసుకోవాలనుకుంటే ‘అర్హులైన’ ఎమ్మెల్యేలతోనే బలపరీక్ష నిర్వహించాలని, కాబట్టి డిప్యూటీ స్పీకర్‌ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే వరకూ విశ్వాస పరీక్షను నిలిపివేయాలని వాదించారు. దీనికి ధర్మాసనం.. అనర్హత పిటిషన్లకు విశ్వాస పరీక్షకూ సంబంధం ఏమిటని సుప్రీం ప్రశ్నించింది. ఫిరాయింపుదారులు ప్రజల మనోభావాలను ప్రతిబించబోరని, వెంటనే విశ్వాస పరీక్ష జరగకపోతే వచ్చే నష్టమేమీ లేదని సింఘ్వీ చేసిన వాదనను తిరస్కరించింది.


ఇక.. ఉద్దవ్‌ ఠాక్రే సభ విశ్వాసాన్ని కోల్పోయారనే వాదనతో గవర్నర్‌ పూర్తిగా సంతృప్తి చెందారని, అందువల్ల ఈ విషయాన్ని తేల్చడానికి వెంటనే విశ్వాసపరీక్ష నిర్వహించడం ఒక్కటే మార్గమని షిండే తరఫున వాదించిన కౌల్‌, గవర్నర్‌ తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు నివేదించారు. డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉండగా.. సభ్యుల అనర్హత ప్రక్రియపై ఆయన నిర్ణయం తీసుకోజాలరని కౌల్‌ వాదించారు. ఆ ప్రక్రియ పెండింగ్‌లో ఉండడానికి బలపరీక్షకు సంబంధం లేదని.. అవి రెండూ వేర్వేరు విషయాలని పేర్కొన్నారు. శివసేనకున్న 55 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది అసమ్మతి గ్రూపులో ఉన్నారని.. వారికి 9 మంది స్వతంత్రుల మద్దతు ఉందని గుర్తుచేశారు. రెబెల్‌ ఎమ్మెల్యేలు 39 మందిలో 16 మందికే అనర్హత నోటీసులిచ్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విశ్వాస పరీక్షకు విముఖత చూపడమే.. ఈ సీఎం సభ విశ్వాసాన్ని కోల్పోయారనడానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.


మైనారిటీలో ఉన్న 14 మంది మాత్రమే బలపరీక్షను వ్యతిరేకిస్తున్నారన్నారు. ‘‘ఈరోజు మేం (షిండే గ్రూపు) శివసేనను వదిలివెళ్లట్లేదు. మేమే అసలైన శివసేన. 55 మంది సేన ఎమ్మెల్యేల్లో 39 మంది మాతోనే ఉన్నారు’’ అని కౌల్‌  ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కాగా, మంత్రుల సిఫారసు లేకుండా గవర్నర్‌ బలపరీక్షకు ఆదేశించలేరన్న వాదనను.. షిండే తరఫున వాదించిన మరో న్యాయవాది మణీందర్‌ సింగ్‌ కొట్టిపారేశారు.


మారిన పేర్లు..

ఔరంగాబాద్‌ పట్టణం పేరును శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ పేరును ధారాశివ్‌గా మార్చాలన్న ప్రతిపాదనలకు మహారాష్ట్ర కేబినెట్‌ బుధవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. అలాగే, త్వరలో అందుబాటులోకి రాబోతున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి పీడబ్ల్యూపీ నేత డీబీ పాటిల్‌ (దినకర్‌ బాలూ పాటిల్‌) పేరు పెట్టాలని నిర్ణయించింది. అసెంబ్లీలో బలపరీక్షపై ఒకవైపు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుండగానే.. మరోవైపు ముంబైలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో కేబినెట్‌ భేటీ అయి ఈ నిర్ణయాలు తీసుకుంది. వీటిలో నవీ ముంబై ఎయిర్‌పోర్టుకు బాల్‌ ఠాక్రే పేరు పెట్టాలని షిండే చాలాకాలంగా ప్రతిపాదిస్తున్నారు. నవీముంబై వాసులు, బీజేపీ మాత్రం.. రైతుల కోసం, నవీముంబై ప్రజల హక్కుల కోసం పోరాడిన డీబీ పాటిల్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కేబినెట్‌ డీబీ పాటిల్‌ పేరు పెట్టాలని నిర్ణయించడం గమనార్హం.


అలాగే, ఔరంగాబాద్‌ పేరు మార్పిడి కోసం బీజేపీ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తోంది. పుణె నగరం పేరును.. ఛత్రపతి శివాజీ మాతృమూర్తి జిజియాబాయి పేరిట జిజౌనగర్‌గా మార్చాలని కాంగ్రెస్‌ ప్రతిపాదించినా కేబినెట్‌ పరిగణనలోకి తీసుకోలేదు. కాగా.. గడిచిన రెండున్నరేళ్లుగా పాలనలో తనకు అందించిన సహకారానికిగాను కేబినెట్‌ సహచరులకు సీఎం ఠాక్రే కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. శివసేన రెబెల్‌ ఎమ్మెల్యేలు ముంబైకి వస్తుండడం, గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ బలపరీక్షకు ఆదేశించడం వంటి పరిణామాల నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర శాసనసభ వద్ద, ముంబై ఎయిర్‌పోర్టు నుంచి శాసనసభకు వచ్చే మార్గంలోనూ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో 144 సెక్షన్‌ జారీ చేశారు. శాసన సభ వద్ద, దక్షిణ ముంబై ప్రాంతాల్లో ఐదుగురి కన్నా ఎక్కువ మంది ఎక్కడా గుమిగూడకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. చట్టవిరుద్ధంగా సమావేశం కాకూడదంటూ వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలు 300 మందికి సెక్షన్‌ 149 కింద నోటీసులిచ్చారు.


గువాహటి నుంచి గోవాకు..

కొద్దిరోజులుగా గువాహటిలో ఉన్న రెబెల్‌ ఎమ్మెల్యేలు.. గవర్నర్‌ బలపరీక్షకు ఆదేశించిన నేపథ్యంలో బుధవారం ఉదయం అక్కడి సుప్రసిద్ధ కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే 52 మంది ఎమ్మెల్యేలను, అధికారిక నివాసాన్ని వదులుకున్నారుగానీ.. ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ను మాత్రం వదలడానికి సిద్ధంగా లేరని రెబెల్‌ ఎమ్మెల్యే గులాబ్‌రావ్‌ పాటిల్‌ వ్యాఖ్యానించారు. కాగా.. రాత్రికి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రెబెల్‌ ఎమ్మెల్యేలంతా విమానంలో గోవాకు చేరుకున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు వారు ముంబైకి రానున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. సుప్రీం తీర్పుతో మహారాష్ట్ర బీజేపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. తీర్పు వచ్చే సమయానికి ముంబైలోని తాజ్‌హోటల్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. తీర్పు వెలువడగానే అందరూ సంతోషంతో హర్షధ్వానాలు చేస్తూ లడ్డూలు పంచుకున్నారు. ‘హమారా ముఖ్యమంత్రి కైసా హో.. దేవేంద్ర ఫడణవీస్‌ జైసా హో’, ‘జై శివాజీ’ నినాదాలతో హోరెత్తించారు. 


రాజీనామా చేస్తున్నందుకు నాకేం బాధగా లేదు. నా కోసం మీరెవరూ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేయొద్దు. రెబెల్‌ ఎమ్మెల్యేలను తిరిగి రానివ్వండి. శివసేన వల్ల, బాల్‌ఠాక్రే వల్ల రాజకీయంగా ఎదిగిన రెబెల్స్‌ను.. ఆయన కుమారుణ్ని సీఎం పదవి నుంచి దించేసిన ఆనందాన్ని, సంతృప్తిని పొందనివ్వండి. నేను ఈ అంకెల ఆటలోకి దిగదల్చుకోలేదు. రెబెల్స్‌ కోరుకుంటే తాము ప్రభుత్వం నుంచి వైదొలగి బయటి నుంచి మద్దతిస్తామని కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ నాకు చెప్పారు. నావాళ్లు నన్ను వదిలిన సమయంలో నన్ను వదిలి వెళ్తారనుకున్నవాళ్లు నాతో ఉన్నారు. అండగా నిలిచిన శివసైనికులకు నా కృతజ్ఞతలు.

- పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఉద్ధవ్‌


===========

Updated Date - 2022-06-30T08:12:51+05:30 IST