Uddhav Thackeray: శంభాజి బ్రిగేడ్‌తో పొత్తును ప్రకటించిన శివసేన

ABN , First Publish Date - 2022-08-26T21:41:49+05:30 IST

శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కీలక ప్రకటన చేశారు. మరాఠా సంస్థ..

Uddhav Thackeray: శంభాజి బ్రిగేడ్‌తో పొత్తును ప్రకటించిన శివసేన

ముంబై: శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) కీలక ప్రకటన చేశారు. మరాఠా సంస్థ శంభాజి బ్రిగేడ్‌ (Sambhaji Brigade)తో శివసేన పొత్తు పెట్టుకుంటున్నట్టు శుక్రవారంనాడు ప్రకటించారు. శంభాజి బ్రిగేడ్ సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీ అని, రాజ్యాంగ పరిరక్షణ, ప్రాంతీయ గౌరవానికి కట్టుబడి ఉందని మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.


బీజేపీపై థాకరే విమర్శలు గుప్పిస్తూ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సిద్ధాంతాలకు బీజేపీ కట్టుబడటం లేదన్నారు. శంభాజీ బ్రిగేట్‌లో ఉన్నవారంతా సైద్ధాంతిక పోరాటానికి కట్టుబడి ఉన్నవారని చెప్పారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ''కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి''గా తాను అభివర్ణించినట్టు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం పార్టీ సంస్థాగత పటిష్టతపై తాను దృష్టి సారించానని, దసరా నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని తెలిపారు. గత రెండు నెలలుగా శివసేనతో సైద్ధాంతిక సారూప్యత ఉన్న పలు పార్టీలు తనను సంప్రదిస్తున్నాయని చెప్పారు. ఈ పార్టీలన్నీ ప్రాంతీయ గౌరవం, ప్రాంతీయ పార్టీల గౌరవాన్ని కాపాడేందుకు కలిసికట్టుగా నిలవాలని తాను అభిలభిషిస్తున్నట్టు థాకరే తెలిపారు.


కలిసి పనిచేస్తాం...

కాగా, శంభాజి బ్రిగేడ్ చీఫ్ మనోజ్ అఖరే మాట్లాడుతూ, తమ సంస్థ 2016లో రాజకీయ పార్టీగా మారిందని చెప్పారు. శివసేన, శంభాజి బ్రిగేట్ పార్టీలు రెండు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాయని, ఎలాంటి అరమరికలు లేకుండా పనిచేసేందుకు వీలుగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Updated Date - 2022-08-26T21:41:49+05:30 IST