Shiv Sena Crisis: బాలా సాహెబ్ పేరు వాడుకోవద్దు : ఉద్ధవ్ థాకరే

ABN , First Publish Date - 2022-06-25T22:17:41+05:30 IST

మహారాష్ట్ర అధికార కూటమిలోని శివసేన పార్టీలో ఇంటి పోరు క్షణక్షణానికి

Shiv Sena Crisis: బాలా సాహెబ్ పేరు వాడుకోవద్దు : ఉద్ధవ్ థాకరే

ముంబై : మహారాష్ట్ర అధికార కూటమి MVA లోని శివసేన పార్టీలో ఇంటి పోరు క్షణక్షణానికి ముదురు పాకాన పడుతోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Udhav Thackeray) నేతృత్వంలోని శివసేన నుంచి వేరు కుంపటి పెట్టిన ఏక్‌నాథ్ షిండే వర్గం ప్రత్యేమైన పేరును పెట్టుకుంది. ఈ పేరులో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే (Bal Thackeray) పేరు ఉండటంతో ఉద్ధవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలా సాహెబ్ పేరును మాత్రం వాడుకోవద్దని, అది తప్ప ఏది నచ్చితే అది చేసుకోండని హెచ్చరించారు. 


ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేలు తమ పార్టీ పేరును నిర్ణయించుకున్నారు. ఈ వర్గం ప్రతినిధి, రెబల్ ఎమ్మెల్యే దీపక్ కెసార్కర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఇక నుంచి తమ గ్రూప్‌ను ‘శివసేన బాలా సాహెబ్‌’ (Shiv Sena Bala Saheb)గా పిలుస్తామని చెప్పారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు శివసేన  ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో కెసార్కర్ ఈ ప్రకటన చేశారు. 


ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేల వర్గానికి ‘శివసేన బాలా సాహెబ్’గా నామకరణం చేయడంపై స్పందించాలని చాలా మంది తనను కోరుతున్నారని ఉద్ధవ్ పేర్కొన్నారు. అయితే దీని గురించి తాను ఇదివరకే చెప్పానన్నారు. ‘‘వారికి కావలసినదానిని వారు చేసుకోవచ్చు, వారి విషయంలో నేను జోక్యం చేసుకోను. వారి నిర్ణయం వారు తీసుకోవచ్చు. కానీ బాలా సాహెబ్ థాకరే పేరును మాత్రం ఎవరూ ఉపయోగించుకోకూడదు. ఈ విషయంలో శివసేన ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తుంది’’ అని ఉద్ధవ్ చెప్పారు. 


ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలో శివసేన నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు తామే బాల్ థాకరేకు నిజమైన అనుచరులమని చెప్పుకుంటున్నారు. తమ వర్గం ఏ పార్టీలోనూ విలీనం కాబోదంటున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలను కొట్టిపారేశారు. 


ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని ఎమ్మెల్యేలు ఓట్లు అడగాలనుకుంటే, తమ తండ్రుల పేర్లు చెప్పి అడగాలన్నారు. ఇదిలావుండగా, ఉద్ధవ్ థాకరే రెండు రోజుల నుంచి శివసేన కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. తిరుగుబాటును తాను ముందుగానే ఊహించానని చెప్పారు. తాను ఏక్‌నాథ్ షిండేతో గతంలో ఈ విషయంపై మాట్లాడానని కూడా చెప్పారు. 


Updated Date - 2022-06-25T22:17:41+05:30 IST