Maharashtraకు సొంత వ్యాక్సిన్ యాప్ కావాలి : ఉద్ధవ్ థాకరే

ABN , First Publish Date - 2021-05-08T18:33:34+05:30 IST

మహారాష్ట్రలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక యాప్ అవసరమని

Maharashtraకు సొంత వ్యాక్సిన్ యాప్ కావాలి : ఉద్ధవ్ థాకరే

ముంబై : మహారాష్ట్రలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక యాప్ అవసరమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్న కోవిన్ యాప్‌లో తరచూ సాంకేతిక సమస్యలు వస్తుండటంతో తాము సొంతంగా ఓ యాప్‌‌ను అభివృద్ధి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. 


వ్యాక్సినేషన్ చేయించుకోవాలనుకునేవారు కోవిన్ యాప్‌లో నమోదు చేయించుకోవలసి ఉంటుంది. ఈ యాప్‌లో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే కేంద్ర ప్రభుత్వానికి శనివారం ఓ లేఖ రాశారు. మహారాష్ట్రలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను అభివృద్ధి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. 


మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉద్ధవ్ థాకరేతో మాట్లాడారు. మహారాష్ట్రలో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించారు. 


ఇదిలావుండగా, మహారాష్ట్రలో జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో కోవిడ్-19 మహమ్మారి తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దాదాపు ఓ నెలపాటు అష్ట దిగ్బంధనం తరహా ఆంక్షలు అమలైన తర్వాత 10 జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించినపుడు ప్రతి వారం కోవిడ్-19 కేసుల వృద్ధి రేటు రాష్ట్ర సగటు కన్నా తక్కువ ఉన్నట్లు వెల్లడైంది. ఈ పది జిల్లాల్లో మూడు జిల్లాలు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ఉన్నాయి. దీంతో జన సాంద్రత అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ఈ మహమ్మారి రెండో ప్రభంజనం తగ్గుముఖం పడుతోందనే ఆశలు చిగురిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలోని 11 జిల్లాల్లో మే 16 నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతుందని ఆశిస్తున్నారు. దాదాపు తొమ్మిది జిల్లాల్లో ఈ కేసుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద మహారాష్ట్రలో కోవిడ్-19 కేసుల సంఖ్య  13 శాతం పెరిగి 6.9 లక్షల నుంచి 7.2 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేసుల సంఖ్య పెరిగితే 22 జిల్లాల్లో ఐసొలేషన్ బెడ్స్ సంఖ్య కొరత కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. పుణే, సతారా, నాసిక్ తీవ్ర సమస్యను ఎదుర్కొంటాయని భావిస్తున్నారు. పుణేలో దాదాపు 30 వేల ఐసొలేషన్ బెడ్స్ కొరత ఏర్పడవచ్చునంటున్నారు. 


Updated Date - 2021-05-08T18:33:34+05:30 IST