ఉగాది కవితలు

ABN , First Publish Date - 2021-04-13T06:37:21+05:30 IST

ఎప్పటికప్పుడు మేం పాతబడిపోతామేమోనని దిగులు పడతావు కాబోలు ప్రతి యేడూ గుత్తంగా...

ఉగాది కవితలు

జ్ఞానబోధీ!

ఎప్పటికప్పుడు మేం పాతబడిపోతామేమోనని

దిగులు పడతావు కాబోలు

ప్రతి యేడూ గుత్తంగా ముస్తాబై వస్తావు

సరికొత్తగా మమ్మల్ని సింగారించడానికి!

ఎంత దయామయివి యుగాదీ!


ఎప్పటికప్పుడు మేం మూగబోతామేమోనని

జీరబోతావు కాబోలు

వస్తూ వస్తూ కోకిల స్వరాన్ని వెంట తెస్తావు

మా గొంతుల్ని రాగమంటపాల్ని చేయడానికి!

ఎంత కళాదాతవు యుగాదీ!


ఎప్పటికప్పుడు మేం మోడుబారిపోతామేమోనని

జాలిపడతావు కాబోలు

వస్తూ వస్తూ లేచిగుళ్ల కానుకల్ని వెంటతెస్తావు

మా మనసు శాఖల్ని అలంకరించడానికి!

ఎంత మృదుల మనస్వివి యుగాదీ!


ఎప్పటికప్పుడు మేం మసకబారిపోతామేమోనని

కలవరపడతావు కాబోలు

వస్తూ వస్తూ వర్ణవర్ణాల పూల సరంజామాను వెంట తెస్తావు

మా నేత్రాల్లోకి పరవశకాంతిని ఒంపడానికి!

ఎంత శోభానిధివి యుగాదీ!


ఎప్పటికప్పుడు మేం వడలిపోతామేమోనని 

వేదన పడతావు కాబోలు

వస్తూ వస్తూ ఉత్సాహ సమీరాల్ని వెంట తెస్తావు

మా ఉక్కపోతల దేహాత్మల్ని సేదదీర్చడానికి!

ఎంత మమకార మూర్తివి యుగాదీ!


ఎప్పటికప్పుడు మేం బతుకురుచిని మరచిపోతామేమోనని

కంగారు పడతావు కాబోలు

వస్తూ వస్తూ షడ్రుచుల అమృతపాత్రను వెంటతెస్తావు

సరళంగా మాకు బతుకు సారాన్ని అందించడానికి

ఎంత జ్ఞానబోధివి యుగాదీ!

దర్భశయనం శ్రీనివాసాచార్య


ప్లవమై ప్రవహించనీ!

జగతి గతిలో ప్రకృతి కృతులు

ఋతువు ఋతువులో సరికొత్త శ్రుతులు 

వసంతం వింతలు చైత్రం చిత్రాలు 

ఏటికేడు కదలివచ్చే కాంతులు

మావిచివురు మధురిమలు 

వేపపువ్వు ఘుమఘుమలు 

మత్తు గమ్మత్తు కోయిల పాటలు 

మది నిండా మధురానుభూతులు 

నవ వసంతం నది పొడవునా 

వనవిహారమే వీధి వీధిన 

ప్లవమై ప్రవహించే ఈ ఉగాది 

జలసిరుల సవ్వడులే ఈ ఏడాది 

చెరువు చెరువులో తెప్పలుగా నీళ్లు 

కప్పలై దుమికి ఈదెను కుర్రాళ్లు 

గాయాల కాలం గతించిపోనీ 

గేయమై జీవితం సుఖించని..!

చక్రవర్తి గుంటుక


పెళ్లికూతురు

బ్రహ్మ తన సృష్టి నైపుణ్యాన్ని

రంగరించి సృష్టించిన జన

రంజకమైన అపరంజి బొమ్మలా!


తెలుగువారి ముంగిట వెలసిన

రతనాల రంగవల్లికల్లో కొలువు

తీరిన ముద్దబంతిపువ్వులా!


సప్తస్వరాలను సంగమించే వీణా

నాద విన్యాసములతో అల్లమెల్లన

నడిచి వచ్చే పెళ్లి కూతురులా!


‘శ్రీ ప్లవ’ పెదవులపై లెసగరింప

‘కరోనా’ ఆట కట్టించడానికి 

వస్తోంది నవవసంతంలా!

శ్రీ భాస్కర్ మైలవరపు


శ్రీ ప్లవ ఉగాది - విశ్వ కళ్యాణి

శ్రీకర శుభ చైత్రోదయ శ్రీలొలుకగ,

పచ్చని తెలుగు గుమ్మాలు పసిమి మావి

మాలికల విరాజిల్లగ - మంజులగతి

ప్లవ ఉగాది మహాలక్ష్మి! స్వాగతమ్ము!!


రమ్యమౌ తెలుగు కవితారామమందు,

మావికొమ్మల కోకిలల్ మధురగతిని

తీపి కవితలు పాడగ -తెలుగు నాట  

ప్లవ ఉగాది మహాలక్ష్మి! స్వాగతమ్ము!! 


క్రూరుడౌ ‘కరోనాసురు’ కూల్చివేసి,

విశ్వ భారతావని శాంతి విరియగాను

తెలుగు పుడమి సౌభాగ్యాల వెలుగులీన

ప్లవ ఉగాది దుర్గేశ్వరీ! స్వాగతమ్ము!!


అన్నదాతల నెల్లర నాదు కొనుచు,

సుకవి - పాలక - ప్రజలకు శుభము పలికి

తెలుగు జాతి కీర్తి ప్రభ వెలయగాను -

ప్లవ కళ్యాణి! వేగ రావమ్మ భువికి!! 

కళ్యాణశ్రీ


ఊపిర్లూదుతూ రా!

ఓ తెలుగు వెలుగుల ఉగాదీ

కొత్త హంగుల రంగుల

రాజకీయ చిత్రపటమై

కబుర్ల కుబుసాలు విప్పుతూ వచ్చేవూ


తిరగబడుతున్న కరోనా కాటులా వేవ్‌ టూలా

మళ్లీ భయాలను మోసుకొచ్చేవూ


వలస కూలీల రణంలా ప్రయాణంలా

మళ్లీ కష్టాల కన్నీళ్లను తోడుతీసుకొచ్చేవూ


డాన్‌లా లాక్‌డౌన్‌లా

మళ్లీ నాలుగ్గోడల మధ్య బంధిస్తూ వచ్చేవూ


అలికిడిలేని అరణ్యంలో

వీర జవానుల మృత్యుఘోషవై

ఎద ఎదనూ ఏడిపిస్తూ వచ్చేవూ


తడిలేని మన్యంలో

దాహాల దీనగాధవై


మది మదినీ తడుతూ వచ్చేవూ

ఓటుకు నోటువై నల్లకోటుపై వేటువై

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వచ్చేవూ


గుండెల్లోనే నాగళ్లు నాటుకున్న

కిసానుల ఆర్త నాదమై

మళ్లీ మళ్లీ బాధల్ని ఎత్తుకు వచ్చేవూ

షడ్రుచులను మరిచి 

చేదును వొళ్లంతా పులుముకు వచ్చేవూ


కుడిభుజం మీద కడవెట్టుకొని

సారంగదరియలా రమ్మన్నా

రాకుండ పోయేవూ


శ్రీప్లవమై విప్లవమై పరిప్లవిస్తూ రా

మార్పుల తూర్పు ముక్కవై రా..

ఉదయిస్తూ రా.. ఉజ్వలిస్తూ రా..

ఉద్యమిస్తూ రా.. ఊపిర్లూదుతూ రా..!

డా.కటుకోఝ్వల రమేష్

Updated Date - 2021-04-13T06:37:21+05:30 IST