ప్రధాని మోదీకి ఉగ్ర ముప్పు

ABN , First Publish Date - 2022-01-19T06:35:57+05:30 IST

ప్రధాని మోదీతోపాటు 75వ రిపబ్లిక్‌ వేడుకల్లో పాల్గొనే ఇతర ప్రముఖులకూ ఉగ్ర

ప్రధాని మోదీకి ఉగ్ర ముప్పు

  • రిపబ్లిక్‌ డే వేడుకల్లో ఇతర ప్రముఖులకూ..!
  • ఇంటెలిజెన్స్‌ నివేదిక హెచ్చరిక.. ఢిల్లీలో డ్రోన్‌లపై నిషేధం
  • రాజ్‌పథ్‌ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం
  • బహుళ అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు
  •  రిపబ్లిక్‌ వేడుకల్లో ఇతర ప్రముఖులకూ ముప్పు: ఇంటెలిజెన్స్‌ 
  • ఢిల్లీలో డ్రోన్‌లపై నిషేధం
  • రాజ్‌పథ్‌ చుట్టుపక్కల భద్రత కట్టుదిట్టం


న్యూఢిల్లీ, జనవరి 18: ప్రధాని మోదీతోపాటు 75వ రిపబ్లిక్‌ వేడుకల్లో పాల్గొనే ఇతర ప్రముఖులకూ ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్‌ విభాగం తొమ్మిది పేజీల నివేదికలో హెచ్చరించింది. పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌-పాకిస్థాన్‌ ప్రాంతంలోని ఉగ్ర గ్రూపుల నుంచి బెదిరింపులు వచ్చినట్టు ఆ నివేదికలో పేర్కొంది. అత్యున్నతస్థాయి ప్రముఖులు, కీలక సంస్థలు, రద్దీ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడం ఆ గ్రూపుల లక్ష్యంగా తెలిపింది.


ఉగ్రదాడులకు డ్రోన్‌లను ఉపయోగించే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. పాకిస్థాన్‌లో ఉంటున్న ఖలిస్థానీ గ్రూపులు కూడా పంజాబ్‌లో తిరిగి తమ కార్యకలాపాలు పునరుద్ధరించేందుకు కేడర్‌ను సమీకరించడంతోపాటు రీగ్రూపింగ్‌ చేస్తున్నట్టు వివరించింది. ఇతర రాష్ర్టాల్లోనూ విధ్వంసానికి ఉగ్రమూకలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు నివేదిక హెచ్చరించింది. కాగా, ప్రధానమంత్రి పాల్గొనే సభలు, ఆయన పర్యటించే ప్రాంతాల్లో పేలుళ్లకు ఖలిస్థానీ గ్రూపులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు 2021 ఫిబ్రవరిలోనూ ఓ హెచ్చరిక వచ్చింది. 



ఢిల్లీలో ఫిబ్రవరి 15 వరకు నిషేధాజ్ఞలు

నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిషేధాజ్ఞలు విధించారు. డ్రోన్‌లు, పారా గ్లైడర్లు, పారా మోటార్లు, యూఏవీలు(మానవ రహిత వాయు వాహనాలు), తేలికపాటి సూక్ష్మ విమానాలు, రిమోట్‌ కంట్రోల్‌తో ఎగిరే వస్తువులు, ఎయిర్‌ బెలూన్‌లు, గాలిలో ఎగిరే చిన్నపాటి విద్యుత్‌ వాహనాలు, పారా జంపింగ్‌లపైనా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.


దేశరాజధానిలో ఉగ్రవాదులు వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున ఈ ఆదేశాలు జారీ అయ్యాయని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ రాకేశ్‌ ఆస్థానా చెప్పారు. ఈ నిషేధాజ్ఞలు ధిక్కరించినవారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 14న ఘాజియాబాద్‌ ఫ్లైవోవర్‌ మార్కెట్‌ వద్ద ఐఈడీ(శక్తివంతమైన పేలుడు పదార్థం) గుర్తించిన నేపథ్యంలో రిపబ్లిక్‌డే పరేడ్‌ జరిగే రాజ్‌పథ్‌ రోడ్డు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు ఎఫ్‌ఆర్‌ఎ్‌స(ముఖం గుర్తించే పరికరాలు), 300కుపైగా సీసీటీవీ కెమెరాలు అమర్చారు.  




సూర్య నమస్కారాల్లో పాల్గొనండి: యూజీసీ 

గణతంత్ర దినోత్సవం నాడు నిర్వహించే సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొనాలని దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ విజ్ఞప్తి చేసింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నేషనల్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేసిందని యూజీసీ పేర్కొంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో 75 లక్షల సూర్యనమస్కారాలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఈ కార్యక్రమంలో 30 వేల విద్యాసంస్థల నుంచి 3 లక్షల మంది విద్యార్థులు పాల్గొనేలా చూడాలని కోరింది. జనవరి 1న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 7వ తేదీ వరకు సాగుతుందని.. అయితే, గణతంత్ర దినోత్సవం రోజు మరింత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా చూస్తున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని యూజీసీ విజ్ఞప్తి చేసింది. 




ఐఎన్‌ఎస్‌లో పేలుడు.. నేవీ సిబ్బంది మృతి

ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ యుద్ధ నౌకలో పేలుడు సంభవించి ముగ్గురు భారతీయ నేవీ సిబ్బంది చనిపోయారు. 11 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో పరికరాలకు ఎటువంటి భారీ నష్టం జరగలేదని నేవీ అధికారులు పేర్కొన్నారు.




వేడుకలపై కరోనా ఎఫెక్ట్‌ 


కరోనా ఉధృతి నేపథ్యంలో జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్‌ డే పరేడ్‌కు 5వేల నుంచి 8వేల మందినే అనుమతించనున్నారు. గతేడాది 25వేల మందిని అనుమతించగా, ఈ దఫా ఆ సంఖ్యను 75 శాతం మేర తగ్గించారు. కరోనా మహమ్మారి దృష్ట్యా ఏటా వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నారు. ఇక వరుసగా రెండో ఏడాది కూడా గణతంత్ర దినోత్సవాలకు విదేశీ ప్రముఖులెవరూ హాజరుకావడం లేదు. పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరేడ్‌ను అరగంట ఆలస్యంగా ఉదయం 10.30 గంటలకు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద సైనికులకు నివాళులర్పించిన సమయంలోనే.. దేశవ్యాప్తంగా ఎన్‌సీసీ సభ్యులు కృతజ్ఞతా వందనం సమర్పిస్తారు.


 రిపబ్లిక్‌ డే భద్రతా ఏర్పాట్లలో భాగంగా జనవరి 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఢిల్లీ గగనతలంలోకి డ్రోన్లు, పారాగ్లైడర్లు, హాట్‌ ఎయిర్‌ బెలూన్ల ప్రయోగంపై ఢిల్లీ పోలీసు విభాగం నిషేధం విధించింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జనవరి 29న ‘బీటింగ్‌ ది రిట్రీట్‌’ వేడుక జరగనుంది. ఇందులో భాగంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఐఐటీ ఢిల్లీకి చెందిన ఒక స్టార్టప్‌ దేశీయంగా అభివృద్ధిచేసిన 1000 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనుంది.


Updated Date - 2022-01-19T06:35:57+05:30 IST