హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌

ABN , First Publish Date - 2022-06-29T08:48:28+05:30 IST

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మంగళవారం ఉదయం 10.05 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌

  • ప్రమాణ స్వీకారం చేయించిన 
  • గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌
  • తెలంగాణ హైకోర్టుకు ఐదో చీఫ్‌ జస్టిస్‌
  • పన్ను చట్టాల్లో విశేష అనుభవశాలి
  • ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, జూన్‌28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మంగళవారం ఉదయం 10.05 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. తొలుత హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్‌ సుజన రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన నియామక ఉత్తర్వులను చదివి వినిపించారు. అనంతరం గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించి నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. అనంతరం గవర్నర్‌ తమిళిసై, కేసీఆర్‌లు జస్టిస్‌ భుయాన్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌రావు, ఇతర న్యాయమూర్తులు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ నర్సింహారెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ సునీల్‌ గౌడ్‌, ఏఎ్‌సజీ సూర్యకరణ్‌రెడ్డి, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌ గౌడ్‌, ఎంపీలు, సీఎస్‌, డీజీపీ, అధికారులు పాల్గొన్నారు. హైకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ను చీఫ్‌ జస్టి్‌సగా నియమిస్తూ ఈనెల 19న రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. ఆయన  తెలంగాణ హైకోర్టుకు అయిదో చీఫ్‌జస్టి్‌సగా బాధ్యతలు చేపట్టారు.


ప్రస్తుతం 27 మంది న్యాయమూర్తులు.. 

ఇప్పటివరకు హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా ఉన్న జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ బదిలీతో హైకోర్టులో ప్రస్తుతం 27 మంది న్యాయమూర్తులు ఉన్నట్టయింది. జస్టిస్‌ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల స్ట్రెంథ్‌ను 24 నుంచి 42కు పెంచారు. అందులో కొత్తగా 17 మంది నూతన న్యాయమూర్తులను నియమించారు. దీంతో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి రిటైర్‌ కావడం, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ బదిలీతో ఈ సంఖ్య 27కు తగ్గింది. ప్రస్తుతం హైకోర్టులో 15 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయి. 


అస్సాం నుంచి హైదరాబాద్‌కు 

చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ట్యాక్స్‌ చట్టాల్లో విశేష అనుభవం గడించారు. ఇన్‌కంట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ న్యాయవాదిగా 16 ఏళ్లపాటు పనిచేశారు. ఆయన 1964 ఆగస్టు 2న గౌహతిలో జన్మించారు. తండ్రి సుచేంద్రనాథ్‌ భుయాన్‌ సీనియర్‌ న్యాయవాదిగా, అస్సాం రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌గా సేవలు అందించారు. గౌహతి ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్‌ఎల్‌బీ, గౌహతి యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా అందుకున్నారు. 1991లో అస్సాం బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. గౌహతి హైకోర్టులోని గౌహతి, అగర్తలా, షిల్లాంగ్‌, కోహిమా, ఇటానగర్‌ ధర్మాసనాల ఎదుట అనేక కేసులను వాదించారు. సెంట్రల్‌ అడ్మినిస్ర్టేషన్‌ ట్రిబ్యునల్‌ (క్యాట్‌) గౌహతి బెంచ్‌, అసోం బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూ ఎదుట వివిధ కేసుల్లో హాజరయ్యారు.


వినియోగదారుల ఫోరం, సివిల్‌ కోర్టులు, లేబర్‌ కోర్టుల ఎదు ట సైతం న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. ఇన్‌కంట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌  తరఫున జూనియర్‌, సీనియర్‌ స్టాడింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌ అటవీశాఖ ప్రత్యేక న్యాయవాదిగా, మేఘాలయ అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2010లో ఆయన ను గౌహతి హైకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా గుర్తించింది. అస్సాం అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా, గౌహతి బార్‌ అసోసియేషన్‌ సభ్యుడిగా, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా, ఆల్‌ ఇండియా ట్యాక్స్‌ ప్రాక్టీషనర్స్‌ ఫెడరేషన్‌, ఇండియన్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ అస్సాం చాప్టర్‌ సభ్యుడిగా పనిచేశారు. 2011లో గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా.. 2013 పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019లో బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021లో తెలంగాణ హైకోర్టుకు రెండో సీనియర్‌ న్యాయమూర్తిగా వచ్చారు. 


ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీష్‌ శర్మ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ, జూన్‌ 28: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ (60) మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌నివా్‌సలో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, హైకోర్టు న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇంతవరకు ఆయన తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేశారు. ఢిల్లీకి బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 19న నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్‌ విపిన్‌ సంఘి ఉత్తరాఖండ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా పదోన్నతి పొందారు. 

Updated Date - 2022-06-29T08:48:28+05:30 IST