రాష్ట్ర హైకోర్టు సీజేగా ఉజ్జల్‌ భుయాన్‌

ABN , First Publish Date - 2022-06-20T09:16:51+05:30 IST

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నియమితులయ్యారు.

రాష్ట్ర హైకోర్టు సీజేగా ఉజ్జల్‌ భుయాన్‌

కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు.. ప్రస్తుత సీజే శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నియమితులయ్యారు. హైకోర్టులో రెండో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న ఆయన్ను సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి గత నెల 17న సిఫారసు చేసింది. అలాగే ప్రస్తుత సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్‌ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు.


ఇటీవల 17 మంది నూతన న్యాయమూర్తులను నియమించారు. దీంతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ఇటీవల జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి పదవీ విరమణ చేయడంతో జడ్జిల సంఖ్య 28కి పడిపోయింది. సీజే సతీశ్‌చంద్ర శర్మ బదిలీతో ఈ సంఖ్య 27కు తగ్గింది. ప్రస్తుతం హైకోర్టులో 15 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, గువాహటి హైకోర్టులకు నూతన సీజేల నియామకానికి కూడా రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. 


ట్యాక్స్‌ చట్టాల్లో విశేష అనుభవం..

జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ 1964 ఆగస్టు 2న గువాహటిలో జన్మించారు. ఆయన తండ్రి సుచేంద్రనాథ్‌ భుయాన్‌ సీనియర్‌ న్యాయవాదిగా, అసోం అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. ఉజ్జల్‌ భుయాన్‌ గువాహటి ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్‌ఎల్‌బీ, యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా అందుకున్నారు. 1991లో అసోం బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. హైకోర్టులోని గువాహటి, అగర్తలా, షిల్లాంగ్‌, కోహిమా, ఇటానగర్‌ ధర్మాసనాల ఎదుట అనేక కేసులను వాదించారు. సెంట్రల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌) గువాహటి బెంచ్‌, అసోం బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూ ఎదుట వివిధ కేసుల్లో హాజరయ్యారు. జస్టిస్‌ భుయాన్‌ ఆదాయ పన్ను శాఖ న్యాయవాదిగా 16 ఏళ్లపాటు పనిచేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌ అటవీశాఖ ప్రత్యేక న్యాయవాదిగా, మేఘాలయ ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా పనిచేశారు. 2011లో గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా,2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019లో బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021లో తెలంగాణ హైకోర్టుకు వచ్చారు. 

Updated Date - 2022-06-20T09:16:51+05:30 IST