సచిన్, అమితాబ్ అయిపోయానా? : బ్రిటన్ పీఎం

ABN , First Publish Date - 2022-04-22T21:48:49+05:30 IST

భారత దేశంలో లభించిన గౌరవానికి బ్రిటన్ ప్రధాన మంత్రి

సచిన్, అమితాబ్ అయిపోయానా? : బ్రిటన్ పీఎం

న్యూఢిల్లీ : భారత దేశంలో లభించిన గౌరవానికి బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చాలా సంతోషిస్తున్నారు. తాను క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయిపోయినంత ఆనందంగా ఉందని చెప్తున్నారు. గుజరాత్‌లో ఆయనకు స్వాగతం పలుకుతూ ఆయన ఫొటోలతో పోస్టర్లను అడుగడుగునా ఏర్పాటు చేయడంతో ఆయన సంభ్రమాశ్చర్యాలతో గొప్ప అనుభూతికి లోనయ్యారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం  బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ, భారత దేశంలో తనకు లభించిన గౌరవానికి చాలా సంతోషం వ్యక్తం చేశారు. తాను క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయిపోయాననే అనుభూతి కలిగిందన్నారు. మోదీని ప్రత్యేకమైన స్నేహితుడిగా అభివర్ణించారు. 


‘‘ధన్యవాదాలు, నా మిత్రుడా ప్రధాన మంత్రి మోదీ, నరేంద్ర మోదీ, నా ప్రత్యేక స్నేహితుడా, హిందీలో ఖాస్ దోస్త్ అనాలనుకుంటాను. భారత దేశంలో అద్భుతంగా రెండు రోజులు గడిచాయి. మీ స్వస్థలం గుజరాత్‌ను సందర్శించిన తొలి కన్జర్వేటివ్ ప్రధాన మంత్రిని నేనే. బ్రిటిష్ ఇండియన్స్‌లో దాదాపు సగం మంది పూర్వీకుల గడ్డ కూడా ఇదే. నాకు అత్యంత అద్భుతమైన స్వాగతం లభించింది. నేను సచిన్ టెండూల్కర్ అయిపోయాననే అనుభూతి కలిగింది. నా ఫొటోలు అమితాబ్ బచ్చన్ ఫొటోల్లా ప్రతి చోటా దర్శనమిచ్చాయి. ఎక్కడ చూసినా నేను కనిపించాను. ఇది చాలా అద్భుతం. ఇది చాలా అద్భుతం’’ అని బోరిస్ జాన్సన్ అన్నారు. గుజరాత్ ప్రజలు తనకు ఘన స్వాగతం పలికారని, తాను ఇంత గొప్ప స్వాగతాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి స్వాగతం తనకు లభించలేదని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వ రాష్ట్రాన్ని సందర్శించడం చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. 


బోరిస్ జాన్సన్ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా గురువారం గుజరాత్‌లో పర్యటించారు. ఆయనకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలు, సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన సబర్మతి ఆశ్రమం, అక్షరధామ్ దేవాలయం, జేసీబీల తయారీ కర్మాగారాలను సందర్శించారు. అక్షరధామ్‌లో పూజారులతో కలిసి దేవాలయ ప్రాంగణంలో నడుస్తూ, సంభాషించారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్-బ్రిటన్ సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని చెప్పారు. 


Updated Date - 2022-04-22T21:48:49+05:30 IST